
రెండేళ్లుగా ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్న రాజేంద్రపాలెం ఆదర్శ పాఠశాల
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేయనున్న ఆంగ్ల మాధ్యమం పాఠశాలలను మోడల్‌గా తీర్చిదిద్దనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 218 పాఠశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లంలో బోధన చేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఆంగ్ల బోధనకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమిస్తారా ఉన్న వారితోనే ఒకటి నుంచి బోధన చేయిస్తారా అనేది తెలియాల్సి ఉంది. గతంలో ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించారు. రెండు మాధ్యమాలకు బోధన చేసేది ఒక్కరేకావడంతో అది ఆశించిన స్థాయిలో నెరవేరలేదు. జిల్లాకు వచ్చిన 218 ఆంగ్ల పాఠశాలల్లో కనీసం 90 పాఠశాలలను మన్యంకు కేటాయించే వీలుంది
కొయ్యూరు (పాడేరు):తల్లిదండ్రులు వారి పిల్లలను ఆంగ్ల మాధ్యమాన్ని బోధిస్తున్న ప్రైవే టు పాఠశాలలకు పంపిస్తున్నారు. రానురాను ప్రైవేటు పాఠశాలల్లో ఆడ్మిషన్లు పెరిగిపోతుంటే ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్నాయి. దీనికి కారణం ఆంగ్ల బోధన లేకపోవడం. దీనిని గమనించిన ప్రభుత్వం ఆంగ్ల బోధనకు కొన్ని పాఠశాలలను ఎంపిక చేసింది. దానిలో ఒకటి నుంచి కూడా పూర్తిగా ఆంగ్లంలోనే బోధన చేయనున్నారు. ఆంగ్ల మాధ్యమం కారణంగా తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించడం తగ్గిస్తారన్న నమ్మకం ఉంది. అయితే ఆంగ్లంలో బోధించే వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. లేదా ఆంగ్లంపై పట్టున్న వారిని నియమించినా బాగుంటుంది.
కిందటి సంవత్సరం జిల్లా విద్యాశాఖ ఏ పాఠశాలల ఉపాధ్యాయులు ఆంగ్లంలో బోధన చేసేందుకు ఆసక్తి చూపుతున్నారో వివరాలు పంపాలని ఆదేశించింది. కొయ్యూరు మండలంలో రత్నంపేట, ఆడాకులతో పాటు మరో ఎనిమిది పాఠశాలలను మార్పు చేసేందుకు గతంలో నివేదించారు. ముందుగా ఆయా చోట్ల ఆంగ్లమాధ్యమం ఏర్పాటు చేస్తారు. ఆంగ్ల మాధ్యమాన్ని నిర్వహించే అన్ని పాఠశాలలను ఆదర్శంగా చేయనున్నారు. అక్కడ విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన చేయనున్నారు. ఆ పాఠశాలల్లో చేర్పిస్తే నాణ్యమైన విద్య వస్తుందన్న నమ్మకాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు కలిగించనున్నారు. రెండేళ్ల కిందట రాజేంద్రపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆదర్శంగా చేశారు. ఇక్కడ ఒకటి నుంచి ఆంగ్లంలో బోధన చేస్తున్నారు. ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
ప్రత్యేక ఫ్యాకల్టీ ఉండాలి..
విద్యార్థుల తల్లిదండ్రుల ఆంక్షలకు వీలుగా పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంగా చేయడం మంచిదే. అయితే ఆంగ్లంలో బోధన చేసేందుకు ప్రత్యేక ఫ్యాకల్టీ ఉండాలి. అలా ఉంటేనే విద్యార్థులకు న్యాయం చేయగలుగుతారు. లేదా బోధన చేసే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. ఆంగ్ల మాధ్యమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో ఆడ్మిషన్లు కొంత వరకు తగ్గించే వీలుంది.
–ఎస్.సన్యాసిరావు, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు,ఏపీటీడబ్లు్య ఉపాధ్యాయుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment