కొత్తగూడెం(ఖమ్మం), న్యూస్‌లైన్ :
సింగరేణి బెల్లంపల్లి ఏరియాలో ఇటీవల చోటుచేసుకున్న బొగ్గు దొంగతనం కేసును విజిలెన్స్ విభాగం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిందని ఆ సంస్థ డెరైక్టర్ ‘పా’ టి.విజయ్‌కుమార్ తెలిపారు. స్థానిక సింగరేణి ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియా నుంచి 18 ట్రక్కుల ద్వారా బొగ్గు అక్రమంగా రవాణా జరిగిందని చెప్పారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి వాయునందన్ సిమెంట్ ఫ్యాక్టరీ, కరీంనగర్ జిల్లాలోని మహదేవ్‌పూర్‌లోని ఓరియంట్ సిమెంట్ కంపెనీకి బొగ్గు సరఫరా చేసే లారీలను అక్రమరవాణకు ఉపయోగించారని తెలిపారు. సాధారణంగా సీహెచ్‌పీలోకి బొగ్గు లారీలు వచ్చేటప్పు డు లారీ నంబర్‌ను మూవ్‌మెంట్ కార్డులో నమోదు చేసుకోవాలని, అనంతరం ఖాళీ లారీ వేబ్రిడ్జికి వెళ్లిన తర్వాత లోడింగ్ జరుగుతుందన్నారు. లోడింగ్ తర్వాత వే బ్రిడ్జి మీదకు లారీ వస్తేనే ఆయా కంపెనీలకు సరఫరా అయినట్లు నమోదవుతుందని వివరించారు. అయితే రోజులో నాలుగు ట్రిప్పులు సక్రమంగా వేసే డ్రైవర్లు ఐదో ట్రి ప్పులో లోడింగ్ అనంతరం వే బ్రిడ్జిపైకి రాకుండా బొగ్గు అక్రమ రవాణకు పాల్పడ్డారని తెలిపారు.
సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన చెక్‌పోస్టు సిబ్బంది ఔట్ పోస్టు దగ్గర బొగ్గు లారీలను క్షుణ్ణంగా తనిఖీ చేయకపోవడంతోనే అక్రమ రవాణా జరిగిందన్నారు. బెల్లంపల్లి ఏరియాలో మొత్తం 18 లారీల ద్వారా 19,900 టన్నుల బొగ్గు అక్రమ రవాణా జరిగినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైందన్నారు. బొగ్గు రవాణాకు సహకరించిన సిమెంట్ కంపెనీలకు ప్రస్తుతం బొగ్గు సరఫరా నిలిపివేశామన్నారు. అక్రమాలకు పాల్పడినందుకు ఓరియెంటల్ సిమెంట్ కంపెనీ నుంచి రూ.4.36 కోట్లు, వాయునందన్ సిమెంట్ కంపెనీ నుంచి రూ.90 లక్షలు రికవరీ చేసినట్లు ఆయన వివరించారు. అలాగే విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎనిమిది మంది సెక్యూరిటీ సిబ్బందికి చార్జ్‌షీట్లు జారీ చేసిన ట్లు చెప్పారు. సింగరేణిలో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు మూవ్‌మెంట్ కార్డు నమోదులో కొన్ని మార్పులు చేసినట్లు తెలిపారు. కోల్ ట్రాన్స్‌పోర్టర్లు జీపీఎస్ ఉండే వాహనాలనే అనుమతించడం వల్ల డ్రైవర్లు చేసే ఇలాంటి పనులకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. విలేకరుల సమావేశంలో సెక్యూరిటీ జీఎం శివరామిరెడ్డి, డీజీఎం నాగేశ్వర్‌రావు, జీఎం (పర్సనల్) కేబీఎస్.సాగర్ పాల్గొన్నారు.
బొగ్గు దొంగతనంపై విచారణ పూర్తి
Published Wed, Feb 26 2014 12:16 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement