coal theft case
-
అభిషేక్ బెనర్జీ భార్య, మరదలికి సీబీఐ నోటీసు
న్యూఢిల్లీ/కోల్‌కతా: త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా బెనర్జీకి, మరదలు మేనకా గంభీర్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదివారం నోటీసు జారీ చేసింది. బొగ్గు అక్రమ తవ్వకం, దొంగతనం కేసులో విచారణకు సహకరించాలని పేర్కొంది. సీబీఐ బృందం కోల్‌కతాలోని అభిషేక్ బెనర్జీ భార్య, మరదలి నివాసాలకు వెళ్లి, నోటీసు అందజేసింది. పశ్చిమ బెంగాల్లో కునుస్తోరియా, కజోరా ప్రాంతాల్లోని ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు(ఈసీఎల్) చెందిన బొగ్గు గనుల్లో బొగ్గును అక్రమంగా తవ్వుకొని, స్వాహా చేశారని ఆరోపిస్తూ సీబీఐ గత ఏడాది నవంబర్‌లో పలువురిపై కేసు నమోదు చేసింది. నిందితుల్లో ఈసీఎల్ జనరల్ మేనేజర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఇన్చార్జి తదితరులు ఉన్నారు. ఈ వ్యవహారంతో రుజీరా బెనర్జీకి, మేనకా గంభీర్‌కు కూడా సంబంధం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. విచారణకు సహకరించాలంటూ తాజాగా నోటీసు జారీ చేసింది. సోమవారం విచారించే అవకాశం ఉందని, ఈ కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొంది. అలాగే పశువుల స్మగ్లింగ్ కేసులో అభిషేక్ బెనర్జీకి సన్నిహితుడైన వినయ్ మిశ్రాకు సీబీఐ సమన్లు జారీ చేసింది. బీజేపీకి లొంగే ప్రసక్తే లేదు తన భార్యకు సీబీఐ నోటీసు ఇవ్వడం పట్ల అభిషేక్ బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టంపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. కేసులతో తమను బెదిరించలేరని బీజేపీ పెద్దలను హెచ్చరించారు. బీజేపీకి లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. బీజేపీ నుంచి మిత్రపక్షాలన్నీ దూరమయ్యాయని, ఇప్పుడు సీబీఐ, ఈడీ మాత్రమే బీజేపీ కూటమిలో ఉన్నాయని విమర్శించింది. బొగ్గు దొంగతనం కేసులో సీబీఐ విచారణను తృణమూల్ కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గీయా ఆరోపించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారు ఎంతటివారైనా శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చిచెప్పారు. -
బొగ్గు దొంగతనంపై విచారణ పూర్తి
కొత్తగూడెం(ఖమ్మం), న్యూస్‌లైన్ : సింగరేణి బెల్లంపల్లి ఏరియాలో ఇటీవల చోటుచేసుకున్న బొగ్గు దొంగతనం కేసును విజిలెన్స్ విభాగం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిందని ఆ సంస్థ డెరైక్టర్ ‘పా’ టి.విజయ్‌కుమార్ తెలిపారు. స్థానిక సింగరేణి ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియా నుంచి 18 ట్రక్కుల ద్వారా బొగ్గు అక్రమంగా రవాణా జరిగిందని చెప్పారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి వాయునందన్ సిమెంట్ ఫ్యాక్టరీ, కరీంనగర్ జిల్లాలోని మహదేవ్‌పూర్‌లోని ఓరియంట్ సిమెంట్ కంపెనీకి బొగ్గు సరఫరా చేసే లారీలను అక్రమరవాణకు ఉపయోగించారని తెలిపారు. సాధారణంగా సీహెచ్పీలోకి బొగ్గు లారీలు వచ్చేటప్పు డు లారీ నంబర్‌ను మూవ్మెంట్ కార్డులో నమోదు చేసుకోవాలని, అనంతరం ఖాళీ లారీ వేబ్రిడ్జికి వెళ్లిన తర్వాత లోడింగ్ జరుగుతుందన్నారు. లోడింగ్ తర్వాత వే బ్రిడ్జి మీదకు లారీ వస్తేనే ఆయా కంపెనీలకు సరఫరా అయినట్లు నమోదవుతుందని వివరించారు. అయితే రోజులో నాలుగు ట్రిప్పులు సక్రమంగా వేసే డ్రైవర్లు ఐదో ట్రి ప్పులో లోడింగ్ అనంతరం వే బ్రిడ్జిపైకి రాకుండా బొగ్గు అక్రమ రవాణకు పాల్పడ్డారని తెలిపారు. సీఐఎస్ఎఫ్కు చెందిన చెక్‌పోస్టు సిబ్బంది ఔట్ పోస్టు దగ్గర బొగ్గు లారీలను క్షుణ్ణంగా తనిఖీ చేయకపోవడంతోనే అక్రమ రవాణా జరిగిందన్నారు. బెల్లంపల్లి ఏరియాలో మొత్తం 18 లారీల ద్వారా 19,900 టన్నుల బొగ్గు అక్రమ రవాణా జరిగినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైందన్నారు. బొగ్గు రవాణాకు సహకరించిన సిమెంట్ కంపెనీలకు ప్రస్తుతం బొగ్గు సరఫరా నిలిపివేశామన్నారు. అక్రమాలకు పాల్పడినందుకు ఓరియెంటల్ సిమెంట్ కంపెనీ నుంచి రూ.4.36 కోట్లు, వాయునందన్ సిమెంట్ కంపెనీ నుంచి రూ.90 లక్షలు రికవరీ చేసినట్లు ఆయన వివరించారు. అలాగే విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎనిమిది మంది సెక్యూరిటీ సిబ్బందికి చార్జ్షీట్లు జారీ చేసిన ట్లు చెప్పారు. సింగరేణిలో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు మూవ్మెంట్ కార్డు నమోదులో కొన్ని మార్పులు చేసినట్లు తెలిపారు. కోల్ ట్రాన్స్పోర్టర్లు జీపీఎస్ ఉండే వాహనాలనే అనుమతించడం వల్ల డ్రైవర్లు చేసే ఇలాంటి పనులకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. విలేకరుల సమావేశంలో సెక్యూరిటీ జీఎం శివరామిరెడ్డి, డీజీఎం నాగేశ్వర్రావు, జీఎం (పర్సనల్) కేబీఎస్.సాగర్ పాల్గొన్నారు.