
సాక్షి, అమరావతి: సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫొటోమీద చెత్త వేసిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఎంబీసీ ఎండీ నాగభూషణం మంగళవారం సచివాలయంలోని నాలుగో బ్లాక్‌కు వెళ్లి.. సిబ్బంది, కార్మికుల నుంచి వివరాలు సేకరించారు. నాలుగో బ్లాక్ పారిశుధ్య సిబ్బందిపై నెపం వేసేలా విచారణ సాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లో సోమవారం ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో జేఎన్‌టీసీ సమీక్షా సమావేశం సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది అల్పాహారం తిన్నారు.
తిన్న తర్వాత మిగిలిన పేట్లను నాలుగో బ్లాక్ లోని సమావేశ మందిరం వద్ద టేబుల్ మీదున్న సీఎం చంద్రబాబు ఫొటోపైనే వేసేశారు. ప్రభుత్వాధినేత ఫొటోను సైతం పట్టించుకోకుండా డస్ట్‌బిన్‌గా వాడుకోవటం విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పాలనా కేంద్రంలోనే ఆయన ఫొటోపై చెత్త వేయడం సచివాలయంలో ఇపుడు చర్చనీయాంశమైంది. దీంతో సంచలనం కలిగించిన ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.