అర్హులకే ‘ఫీజు’ అందేలా చర్యలు!
- రీయింబర్స్‌మెంట్‌పై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
- కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం
- అనర్హులను గుర్తించే విధానంపైనే కసరత్తు
- బయోమెట్రిక్, ఆధార్‌ను తప్పనిసరి చేయాలని యోచన
- 11వ తేదీన మరోసారి భేటీ.. తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పక్కదారి పట్టకుండా.. బోగస్ కాలేజీలు ప్రయోజనం పొందకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. అర్హులైన విద్యార్థులకు మాత్రమే లబ్ధి చేకూరేలా చూడాలని అభిప్రాయపడింది. అక్రమాలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని నిశ్చితాభిప్రాయానికి వచ్చింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం మార్గదర్శకాలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం తొలి సమావేశం బుధవారం సచివాలయంలో జరి గింది. ఈ భేటీకి విద్యా శాఖ బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, సి.లక్ష్మారెడ్డి, ఉన్నతాధికారులు హాజరుకాగా.. కమిటీలోని మరో మంత్రి జగదీశ్‌రెడ్డి రాలేదు.
371డీ ప్రకారమే స్థానికత..
తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పథకం రద్దయిన నేపథ్యంలో... ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి పద్ధతులను అవలంబించాలనే దానిపై మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో చర్చించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద విద్యార్థుల స్థానికతను గుర్తించేందుకు 371డీకి అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని... అయితే 371డీలో ఏయే అంశాల ప్రాతిపదికన దీనిని నిర్ధారించాలనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొన్ని కాలేజీల యాజమాన్యాలు దుర్వినియోగం చేశాయని, విద్యార్థులు లేకపోయినా ఉన్నట్లుగా చూపి ఫీజులను పొందాయని అధికారులు సబ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా వృత్తి విద్యా కాలేజీల్లో తక్కువ సంఖ్యలో ఉన్న విద్యార్థుల కోసమే 80 శాతం నిధులు ఖర్చవుతున్నాయని వారు వివరించారు. ఈ మార్గదర్శకాలను రూపొందించడంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఈ నెల 11న మరోసారి భేటీ కావాలని.. అదే భేటీలో 371డీపైనా చర్చించాలని నిర్ణయించారు.
ఇక కాలేజీల్లో బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థుల ఎంపికకు సంబంధించి ఆధార్ కార్డులను తప్పనిసరి చేయాలని సంబంధిత అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. అన్ని కాలేజీల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు, ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. కాగా.. ప్రభుత్వ రంగంలోని కాలేజీలను మరింత పటిష్టం చేయాలని.. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సబ్ కమిటీ సూచించినట్లు సమాచారం.
అర్హులకు న్యాయం: కడియం
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగిస్తామని, అర్హులైన పేద విద్యార్థులకు అన్యాయం జరగకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంత్రి వర్గ ఉప సం ఘం భేటీ అనంతరం పేర్కొన్నారు. పథకం మార్గదర్శకాలు, ఇతర అంశాలకు సంబంధిం చి ప్రాథమికచర్చలే జరిగాయని చెప్పారు. 11న మరోసారి భేటీ అవుతామని, అప్పటికల్లా పూర్తి వివరాలతో రావాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. 11న జరిగే భేటీలో చర్చించిన విషయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతామని కడియం పేర్కొన్నారు.