పల్లెల్ని పిండుకోండి
- అభివృద్ధి పనుల నిధుల కోసం గ్రామ కార్యదర్శులకు ఏపీ ప్రభుత్వం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా ఇచ్చే 13వ ఆర్థిక సంఘం నిధులను.. కరెంటు బకాయిల పేరుతో తమ ఖాతాకే మళ్లించుకోవాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు గ్రామాలకు నిధుల అవసరాల కోసం ఆయా గ్రామాల్లో తప్పనిసరిగా ఇంటి పన్నులు వసూలు చేసుకోవాలని సూచిస్తోంది. స్థానిక రాజకీయ కారణాలతో గ్రామాల్లో అంతంత మాత్రంగా ఉండే పన్నుల వసూళ్లను ఇక బలవంతంగా చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. గ్రామ కార్యదర్శులందరూ ఫిబ్రవరి నెలాఖరు నాటికి వారి గ్రామాల్లో బకాయిలతో సహా వంద శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని.. లేదంటే వారిపై కఠిన చర్యలు చేపడతామని కూడా హెచ్చరించింది.
కేంద్ర నిధులు విద్యుత్ బకాయిలకు జమ..
పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అందజేసే నిధుల ఆధారంగా గ్రామాల సర్పంచ్‌లు తమ తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడతారు. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గ్రామ పంచాయతీలు తమకు రూ. 850 కోట్ల మేర విద్యుత్ బిల్లుల బకాయి పడ్డాయని ట్రాన్స్‌కో సర్కారుకు నివేదించింది. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పంచాయతీలకు ఇచ్చే 13వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల విద్యుత్ బకాయిల కింద జమ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సీఎం స్థాయిలోనే నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కరెంటు బకాయిలకు తప్ప మిగతా అవసరాలకు గ్రామ సర్పంచ్‌లు రాసే చెక్కులకు డబ్బులు చెల్లించవద్దంటూ కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ట్రెజరీలకు ఆదేశాలిచ్చారు.
జనవరి 20కల్లా వసూళ్లు పూర్తి చేయాలి...
రెగ్యులర్ గ్రామ కార్యదర్శులు ఉండే పంచాయతీల్లో జనవరి 20వ తేదీ నాటికే పన్నుల వసూలు పూర్తిచేయాలని.. కార్యదర్శులు లేని వాటిలో ఫిబ్రవరి నెలాఖరు కల్లా వసూలు లక్ష్యం పూర్తి చేయాలని గడువు కూడా నిర్దేశించింది. ఇంటి పన్నుతో సహా ఆయా గ్రామాల్లో షాపుల అద్దె వంటి ఇతర పన్ను బకాయిలను కూడా రాబట్టుకోవాలని ఆదేశించింది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని సూచించింది.
జనవరి 20 లోగా వంద శాతం వసూలు చేసిన గ్రామ కార్యదర్శులకు గణతంత్ర దినోత్సవం రోజు అవార్డు ఇస్తామని ప్రకటించింది. నిర్ణీత గడువులోగా ఇంటి పన్ను వసూలు చేయని గ్రామ కార్యదర్శులపై చర్యలు చేపడతామనీ హెచ్చరించింది. అలాంటి వసూలు చేయని గ్రామ కార్యదర్శుల జాబితాను తమకు పంపాలని పంచాయతీరాజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఈ నెల 18వ తేదీన మెమో (నెం. 9999) జారీ చేసింది.
పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా ఐదు రోజులు పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సి.హెచ్.అయ్యన్నపాత్రుడు ఇటీవల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, గ్రామాల్లో ఇంటి పన్నుల వసూలుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.