సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లను ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. ఈమేరకు ప్రైవేటు వైద్య కళాశాలలన్నీ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. 2013-14 విద్యా సంవత్సరంలో యాజమాన్య కోటా సీట్ల భర్తీపై తీవ్ర ఆరోపణలు రావడం, పలువురు కోర్టుకెళ్లడం, వీటిపై భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) తీవ్రంగా స్పందించడం తెలిసిందే. ఒక్కో సీటుకు రూ. 60 లక్షల నుంచి రూ. 90 లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఎంసీఐ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు వైద్య కళాశాలలో ప్రతిభ ఆధారంగా సీట్ల భర్తీ జరిగేలా నిర్దిష్ట విధానాన్ని అనుసరించాలని సూచించింది. ఇంటర్మీడియెట్ మార్కుల ప్రాతిపదికన గానీ, ఎంసెట్ ర్యాంకు ఆధారంగా గానీ, ప్రత్యేక ప్రవేశపరీక్ష ద్వారా గానీ భర్తీ జరగాలని పేర్కొంది. ఇప్పటికే కర్ణాటక తదితర రాష్ట్రాలు యాజమాన్య కోటా సీట్ల భర్తీ ప్రవేశపరీక్ష ద్వారా చేస్తున్నాయి.
దీంతో రెండ్రోజుల కిందట సమావేశమైన ప్రైవేటు వైద్య కళాశాలలు ప్రత్యేక ప్రవేశపరీక్ష ద్వారానే సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించాయి. అయితే రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఇరు ప్రాంతాల్లోని ప్రైవేటు వైద్య కళాశాలలు ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉందా అనే అంశం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27 ప్రైవేటు వైద్య కళాశాలల్లో 3,600కు పైగా సీట్లు ఉన్నాయి. వీటిలో 40 శాతం సీట్లు ప్రైవేటు వైద్య కళాశాలల చేతుల్లోనే ఉంటాయి. ఈ 40 శాతం సీట్లలో 25 శాతం యాజమాన్య కోటా, మిగతా 15 శాతం సీట్లు ఎన్‌ఆర్‌ఐ (ప్రవాస భారతీయులకు) కోటాలో ఉన్నాయి. ఇదిలాఉండగా ప్రస్తుతం యాజమాన్య కోటా సీట్లకు రూ. 5.50 లక్షల ఫీజు ఉంది. ఈ ఫీజు వల్ల కాలేజీలు నిర్వహించలేమని, ఎట్టి పరిస్థితుల్లో ఫీజులు పెంచాలని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కోరుతున్నాయి. కన్వీనర్ కోటా, బీ కేటగిరీ కోటా, యాజ మాన్య కోటా మూడు కలిపి కామన్ ఫీజు రూపంలో రూ. 9 లక్షలు చేయాలని ఆయా కళాశాలలు డిమాండ్ చేస్తున్నాయి.
యాజమాన్య కోటాకు ‘ప్రవేశపరీక్ష’!
Published Mon, Dec 9 2013 2:01 AM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM
Advertisement
Advertisement