సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఈ నెలాఖరు వరకు గడువు తేదీ పొడిగించినప్పటికీ రాజధాని గ్రామాల్లో భూసమీకరణ ముందుకు సాగడం లేదు. సోమవారం 91 మంది రైతులు 111 ఎకరాలకు అంగీకార పత్రాలు ఇవ్వడంతో మొత్తం భూ సమీకరణ 21,742 ఎకరాలకు చేరుకున్నది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉద్యోగులకు సెలవు ప్రకటించడంతో భూ సమీకరణ జరగలేదు. బుధవారం అమావాస్య కావడంతో రైతులు అంగీకారపత్రాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే అవకాశాలు లేవు. మిగిలిన కొద్ది రోజుల్లో భూ సమీకరణను వేగవంతం చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని మంత్రులు, ఉన్నతాధికారులు భావిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు సానుకూలంగా లేవు.
1ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులోకి రావడంతో మంత్రులు, టీడీపీ ప్రజాప్రతినిధులు రాజధాని గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా పోయింది. ఇంతకు ముందు మంత్రి పి.నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతుల సందేహాలను నివృత్తి చేసి భూ సమీకరణ వేగవంతం చేయడానికి ప్రయత్నించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి అక్కడి రైతులతో సంప్రదింపులు జరిపారు.
భవిష్యత్‌లో రైతులకు ప్రభుత్వ పరంగా రాజధాని గ్రామాల్లో సహాయం చేయడానికి అవకాశం ఉంటుందని హామీలు ఇచ్చారు. కొందరు రైతులు వారి హామీలను నమ్మి భూ సమీకరణకు ముందుకు రావడంతో తాడేపల్లి, మంగళగిరి మండల్లాలో 3,943 ఎకరాలకు అంగీకార పత్రాలు వచ్చాయి.ఎన్నికల కోడ్ కారణంగా వీరెవరూ అటువైపు వెళ్లకపోవడం, రాజధాని గ్రామాల్లో రైతులకు మద్దతుగా పెరుగుతున్న ఉద్యమాల కారణంగా భూ సమీకరణ ముందుకు సాగడం లేదు. ప్యాకేజీ పెంచాలని జరీబు భూముల రైతుల డిమాండ్‌పై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని, ఆ ప్రకటన ద్వారా మిగిలిన లక్ష్యాన్ని చేరుకోవాలనే భావనలో ఉన్నతాధికారులు, మంత్రులు ఉన్నారు.
సాగని సమీకరణ
Published Wed, Feb 18 2015 2:19 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement