సాక్షి, గుంటూరు : రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు జరీబు రైతులు ససేమిరా అంటున్నారు. సీఎంతో చర్చలకు సైతం విముఖత వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వ ప్యాకేజీలు అవసరం లేదని, భూములు ఇవ్వబోమని తేల్చిచెబుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం విజయవాడ వచ్చారు. దీనికి రెండు రోజుల ముందు తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ జరీబు రైతులతో సంప్రదింపులు జరిపారు. సీఎంతో సమావేశానికైనా విజయవాడ రావాలని కోరారు. దీనికి జరీబు రైతులు ఏ మాత్రం అంగీకరించలేదు. దీంతో భూ సమీకరణకు అనుకూలంగా ఉన్న రైతులను తీసుకువెళ్లి ముఖ్యమంత్రికి సన్మానం చేయడం వంటి కార్యక్రమాలతో హడావుడి చేశారు.
అంతా ఏకపక్ష నిర్ణయాలే....
రాజధాని భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం మొదటి నుంచి వ్యవహరిస్తున్న తీరు ఈ ప్రాంత రైతుల్లో అనుమానాలు రేకెత్తించింది. కనీసం రైతులతో సంప్రదించకుండానే భూములు ఇచ్చేందుకు అనుకూలం అని ప్రకటించడం, అనుకూల గ్రామాల్లో మాత్రమే మంత్రి వర్గ ఉప సంఘం సభ్యులు సభలు నిర్వహించి అంతా బాగుందన్న ప్రచారాన్ని తీసుకువచ్చారు.
గ్రామ సభల్లో సైతం తెలుగుదేశం పార్టీ నాయకులను ముందు నిలిపి భూ సమీకరణకు అందరూ అనుకూలమనే నినాదాలు సైతం ఇప్పించడం రైతుల్లో మరింత అభద్రతా భావాన్ని పెంచేలా చేసింది.
ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచనల మేరకు ఎంపిక చేసిన రైతులను మాత్రమే తొలిదశలో హైదరాబాద్ తీసుకువెళ్లి సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించడం కూడా మిగిలిన రైతుల్లో ఆగ్రహాన్ని కలిగించింది.
అంతేగాక, భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉన్న రైతులను మొక్కుబడిగా చర్చలకు పిలిచి అవమానకర రీతిలో వ్యవహరించడంపై కూడా అన్నదాతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులే జరీబు రైతులకు ప్రభుత్వానికి మధ్య మరింత దూరం పెంచేలా చేసింది.
భూ సేకరణ అంటూ బెదిరింపులు...
భూ సమీకరణకు రైతులు అంగీకరించని పక్షంలో ప్రభుత్వం భూ సేకరణకు దిగుతుందనే సంకేతాలు పంపుతూ టీడీపీ నేతలు రైతులను తమ దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు.
మరో వైపు రైతులు కూడా ప్రభుత్వ బెదిరింపులకు లొంగకుండా న్యాయపోరాటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరో వారం రోజుల్లో సింగపూర్ ప్రతినిధుల బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించనుందని, ఈ లోపు భూసమీకరణ అంశాన్ని ఓ కొలిక్కి తేవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతూనే వున్నాయి.
భూముల ధర పెంచకుండా....
రాజధాని ప్రాంతంలో ఎకరా భూమి కోటీ అరవై లక్షల రూపాయల వరకు ధర పలుకుతోంది. ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం ఎకరా భూమి ధర రూ.3.50 లక్షల నుంచి ఏడు లక్షలలోపు మాత్రమే ఉంది. భూముల ధర పెంచితే ఆదాయం రాగలదని విజిలెన్స్ శాఖ సూచనలు చేస్తున్నా ప్రభుత్వం అందుకు ఒప్పుకోవడం లేదని సమాచారం.ఒకవైపు భూముల ధర పెంచితే, మరో వైపు భూసేకరణ చేయాల్సి వస్తే నిబంధనల ప్రకారం రైతులకు పది రెట్లు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందనే ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం.
మొత్తం మీద రాజధాని ప్రాంతంలో జరీబు భూముల సమీకరణ విషయం లో మాత్రం ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోక తప్పేలా లేదు.
ఇవ్వంగాక...ఇవ్వం!
Published Wed, Dec 17 2014 2:51 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement