-
ఎయిర్‌పోర్టు విస్తరణకు 857 ఎకరాల సేకరణ
-
నిర్వాసిత రైతులకు ఇంకా పూర్తిగా అందని పరిహారం
-
అయినా భూములు స్వాధీనం చేసుకున్న అధికారులు
-
నేడు విమానాశ్రయ విస్తరణకు సీఎం భూమిపూజ
-
న్యాయం చేయాలని కోరుతున్న బాధితులు
సాక్షి, రాజమహేద్రవరం :
మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయ విస్తరణ భూసేకరణ పరిహారం చెల్లింపు ఓ ప్రహసనంగా మారింది. 1936లో 366 ఎకరాల్లో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని విస్తరించేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. 1750 మీటర్లు ఉన్న రన్‌వేను 3,165 మీటర్లకు విస్తరించేందుకు రెవెన్యూ అధికారులు 857 ఎకరాలు సేకరించారు. మధురపూడి, బూరుగుపూడి, గుమ్ములూరు గ్రామాల పరిధిలో 700 మంది రైతుల నుంచి 799 ఎకరాలు.. ప్రభుత్వం నుంచి 58.77 ఎకరాలు సేకరించారు. ఈ భూములను మూడు కేటగిరీలుగా విభజించారు. ఎ–కేటగిరీ భూములకు రూ.49 లక్షలు, బి–కేటగిరీకి రూ.36 లక్షలు, సి–కేటగిరీకి రూ.33 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. గత ఏడాది ప్రారంభించిన భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. 65 మంది రైతులకు వివిధ కారణాలతో ఇంతవరకూ నష్టపరిహారం చెల్లించలేదు. అయినప్పటికీ అధికారులు ఆ భూములను స్వాధీనం చేసేసుకుని, విమానాశ్రయ అథారిటీకి అప్పగించారు.
కోర్టుల్లో నడుస్తున్న కేసులు
రైతులకు ఇప్పటివరకూ 85 శాతం నష్ట పరిహారం చెల్లించారు. మరో 15 శాతం చెల్లించాల్సి ఉంది. ఆర్థిక వివాదాలు, కోర్టు కేసులు, ప్రభుత్వ రికార్డుల్లో వ్యత్యాసాలు, భూ యజమానుల రికార్డులకు, రెవెన్యూ రికార్డులకు మధ్య తేడాలవల్ల 65 మంది రైతులకు ఇవ్వాల్సిన రూ.49 కోట్ల పరిహారం ఇంకా చెల్లించలేదు. ఇవన్నీ ప్రభుత్వం పరిష్కరించదగ్గ కేసులే అయినా పట్టించుకోవడం లేదు. భూమి తీసుకోవడానికి ముందే అధికారులు రైతుల వద్ద ఉన్న రికార్డులను సరిచేసి ఉంటే ఇటువంటి ఇబ్బందులు తలెత్తేవికావు. ఇప్పటికే పరిహారం తీసుకున్న రైతులు ఆ నగదుతో మరోచోట భూములు కొనుగోలు చేయగా తాము మాత్రం ఇంకా పరిహారం కోసం ఎదురు చూస్తూనే ఉన్నామని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రన్‌వే విస్తరణ పనులకు సోమవారం భూమిపూజ చేయనున్నారు. ఆయనైనా తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
రైతులకు న్యాయం జరుగుతుంది
విమానాశ్రయ విస్తరణకు 857 ఎకరాలు తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. కొంతమంది రైతులకు న్యాయపరమైన వివాదాలు ఉన్నట్లు తెలిసింది. అవి పరిష్కారమయ్యాక రైతులందరికీ న్యాయం జరుగుతుంది.
– ఎం.రాజ్‌కిషోర్, డైరెక్టర్, రాజమహేంద్రవరం విమానాశ్రయం
సమస్యల పరిష్కరానికి కాంపిటేటివ్ అథారిటీ
భూమి రికార్డులు లేకపోవడం, వారసత్వ గొడవలు తదితర కారణాల వల్ల 66 ఎకరాలకు చెల్లించాల్సిన పరిహారం నిలిచిపోయింది. నూతన చట్టం ప్రకారం కాంపిటేటివ్ అథారిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ అథారిటీ ఈ సమస్యలను పరిష్కరించిన తర్వాత ఆయా రైతులకు పరిహారం అందుతుంది.
– విజయకృష్ణన్, సబ్‌కలెక్టర్, రాజమహేద్రవరం
సాకులు చెప్పడం సరికాదు
ఏడాది కిందట మా భూములు తీసుకున్నారు. పరిహారం ఇవ్వకుండా సాకులు చెప్పడం సరికాదు. ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలి. పరిహారం ఇవ్వకపోవడంతో మరోచోట భూములు కొనలేకపోయాం. ఉన్న ఎకరా తీసుకోవడంతో పనులు లేవు.
– పి.నరసింహం, పరిహారం అందని రైతు, మధురపూడి
65 మందికి ఇంకా అందని పరిహారం
విమానాశ్రయ విస్తరణకు రైతుల నుంచి సేకరించిన 799 ఎకరాలకు రూ.323 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకూ 635 మంది రైతులకు రూ.274 కోట్లు ఇచ్చారు. మరో 65 మంది రైతులకు రూ.49 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీరిలో మధురపూడి, బూరుగుపూడి గ్రామాల రైతులే ఎక్కువగా ఉన్నారు.
ముఖ్యమంత్రి న్యాయం చేయాలి
ప్రభుత్వం అడిగిన వెంటనే భూములు ఇచ్చినందుకేనా మాకు పరిహారం ఇవ్వడం లేదు? ఓపక్క పరిహారం అందక, మరోపక్క భూమి లేక మేము ఏం చేసుకుని బతకాలి? ముఖ్యమంత్రి మాకు న్యాయం చేయాలి.
– ఆకుల చిన్నోడు, పరిహారం అందని రైతు, మధురపూడి