రాజధాని గ్రామాలు మాయం | lands to formers in two zones | Sakshi
Sakshi News home page

రాజధాని గ్రామాలు మాయం

Published Wed, Dec 30 2015 2:31 AM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

రాజధాని గ్రామాలు మాయం - Sakshi

రాజధాని గ్రామాలు మాయం

20 జోన్లుగా ఏపీ రాజధాని నగరం వర్గీకరణ  భూములిచ్చిన రైతులకు ఊరు బయట స్థలాలు
 సాక్షి, హైదరాబాద్: రాజధాని కోసం సమీకరించిన భూముల్లో అధికభాగాన్ని రియల్ ఎస్టేట్‌కే వినియోగించనున్నారు. రాజధాని మాస్టర్ ప్రణాళికలో వర్గీకరించిన 20 జోన్లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమౌతున్నది. ఏ జోన్‌కు ఎన్ని ఎకరాలో ఈ ప్రణాళికలో స్పష్టం చేశారు. దీని ప్రకారం మధ్యతరహా జనసాంద్రత గలిగిన రెసిడెన్షియల్ జోన్‌కు 12,002.5 ఎకరాలను, సాధారణ వాణిజ్య జోన్‌కు 2856.3 ఎకరాలను కేటాయించారు. ఈ రెండు జోన్‌లలోనే (అంటే 14,858.8 ఎకరాలలో) రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇళ్లు, వాణిజ్య స్థలాలను కేటాయించనున్నట్లు ప్రణాళికలో పేర్కొన్నారు. అందుకోసం 8వేల ఎకరాలు సరిపోతాయని అంచనా. అంటే మిగిలిన ప్రాంతమంతా రియల్‌ఎస్టేట్ కోసమే వినియోగిస్తారని తెలుస్తోంది. ఈ రెండు జోన్‌లలో... భూములిచ్చిన రైతులకు ఇళ్ల స్థలాలు కేటాయించే చోట దాదాపు 7 వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనున్నారు. అక్కడ చిన్న, మధ్యతరగతి, ఎగువ తరగతిని ఆకర్షించే అపార్టుమెంట్లను, ఇళ్లను నిర్మించనున్నారు.

అలాగే సాధారణ వాణిజ్య అవసరాలకు 2,856 ఎకరాలను వినియోగించనున్నారు. పరిశ్రమలకు 2,789 ఎకరాలను వినియోగించనున్నారు. గ్రీనరీ పేరుతో పార్కులకు ఏకంగా 7,302 ఎకరాలను వినియోగించనున్నారు. క్రీడా ప్రాంగణాలకు ఏకంగా 820 ఎకరాలను, హోటల్స్/రిసార్ట్స్ కోసం ఏకంగా 790 ఎకరాలను, మిశ్రమ వాణిజ్యం పేరుతో 2,856.32 ఎకరాలను వినియోగిస్తారు. ఇక్కడే కొంత వాణిజ్య స్థలాలను రైతులకు ఇవ్వనున్నారు. మొత్తం మీద రాజధాని భూములలో ఎక్కువభాగం ప్రైవేట్ రంగం చేతిలోనే పెట్టనున్నారు.
 
 కోర్లో మూడూళ్లు మాయం
 కోర్ రాజధాని వచ్చే మూడు గ్రామాలు మాయం కానున్నాయి. ఉద్ధండరాయుని పాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం గ్రామాలు కోర్ రాజధానితో కనుమరుగు కానున్నాయి. ఆ గ్రామాలను పూర్తిగా అక్కడి నుంచి తొలగించనున్నారు. అలాగే రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చిన రైతులకు ఆయా గ్రామాల్లో కాకుండా ఆయా గ్రామాల బయట స్థలాలు ఇవ్వాలని మాస్టర్ ప్రణాళికలో స్పష్టం చేశారు. ఉదాహరణకు తుళ్లూరు గ్రామంలో రైతులకు ఇళ్ల స్థలాలు, వాణిజ్య స్థలాలను ఎక్కడ ఇచ్చేది మాస్టర్ ప్రణాళికలో మ్యాప్ ద్వారా వివరించారు. దాని ప్రకారం అది రాజధాని ప్రాంతానికి దూరంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

ప్రస్తుత గ్రామాల్లోని స్థలాలను వాణిజ్య కార్యకలాపాలకు కేటాయించనున్నారు. ఆ గ్రామాల్లోని రైతులకు నివాస స్థలాలను మాత్రం గ్రామాల బయట కేటాయించాలని పేర్కొన్నారు. ఈ విధంగా చేయడం వల్ల పట్టణీకరణ పెరుగుతుందని, గ్రామీణ ప్రాంతం గణనీయంగా తగ్గిపోతుందని మాస్టర్ ప్రణాళికలో పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ స్కీములో రైతులకు తిరిగి స్థలాలు ఇచ్చే కార్యక్రమం అమలు అంతా మాస్టర్ ప్రణాళికను అనుసరించి ఉండాలని స్పష్టం చేశారు. భూములిచ్చిన రైతులకు మీడియం జనసాంద్రత గల ప్రాంతంలో  స్థలాలను కేటాయించాలని నిర్ణయించారు. హెక్టార్‌కు 110 యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. 29 గ్రామాల్లోని భూములిచ్చిన రైతులకు ఆయా గ్రామాల బయట స్థలాలను కేటాయించనున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement