YS Jagan: రైతుల సేవే లక్ష్యం | Rythu Bharosa Centers in AP, Farmers Toll Free Number - Sakshi
Sakshi News home page

రైతుల సేవే లక్ష్యం: సీఎం జగన్‌

Published Thu, Mar 18 2021 10:01 PM | Last Updated on Fri, Mar 19 2021 9:35 AM

Rythu Bharosa Centres In Andhra Pradesh - Sakshi

ఆర్బీకేల్లోని అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు ఈ– క్రాపింగ్‌ చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర లభిం చకపోతే వీరికి చెబితే రిజిస్టర్‌ చేసుకుం టారు. సీఎం యాప్‌ ద్వారా ఆ విషయాన్ని వారు పైకి తెలియజేస్తారు. తద్వారా మార్కెటింగ్‌ శాఖ జోక్యం చేసుకుని, మద్దతు ధరకు అమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అలా వీలుకాకపోతే నేరుగా మార్కెటింగ్‌ శాఖే కొనుగోలు చేస్తుంది. ఇదంతా జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరుగుతుంది. 
–సీఎం వైఎస్‌ జగన్

సాక్షి, అమరావతి: రైతును ఊరు దాటించే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతు భరోసా కేంద్రాలకు (ఆర్బీకేలకు) ఉం దని, ఆ మేరకు అవసరమయ్యే సేవలన్నింటినీ అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుల అవసరాలు అన్నింటినీ తీర్చడమే లక్ష్యంగా ఆర్బీకేలు పని చేయాలని, వీటి ద్వారా రైతులు ఆర్డర్‌ చేసిన వెంటనే నిర్దేశిత సమయంలోగా విత్తనాలు, ఎరువులు చేరాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుత రబీ ప్రొక్యూర్‌మెంట్‌తో పాటు, ఖరీఫ్‌ 2021–22 సన్నద్ధతపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు ఊరు దాటి పోకూడని విధంగా సేవలందించాలనే విషయాన్ని అధికారులు కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ప్రతి గ్రామానికి ఆర్బీకే యూనిట్‌గా పంటల ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఆర్బీకేల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. ఈ సమయంలో వ్యవసాయ సిబ్బంది ఆర్బీకేలోనే రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. ఆర్బీకేల ద్వారా కచ్చితంగా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందివ్వాలని, ఇందులో వేరే మాటకే తావులేదని.. ఫిషరీస్‌ ఫీడ్, లైవ్‌ స్టాక్‌ మెడిసిన్, సీడ్, ఫెర్టిలైజర్స్‌ అన్నీ రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. 

ఆర్బీకేలన్నింటికీ ఇంటర్‌నెట్‌ సదుపాయం 
ఆర్బీకేలన్నింటికీ వేగవంతమైన ఇంటర్‌నెట్‌ సదుపాయం ఉండాలని సీఎం ఆదేశించారు. ఇది ఇంటరాక్టివ్‌ విధానంలో రైతుల సందేహాల నివృత్తికి ఉపయోగపడుతుందన్నారు. రైతులకు వచ్చే ఖరీఫ్‌లో ఇచ్చే విత్తనాలు కచ్చితంగా నాణ్యతతో ఉండాలని.. మార్కెట్లో కొనుగోలుకు ఆసక్తి చూపని వంగడాలు, ఆసక్తి చూపి మంచి ధర లభించే వంగడాలపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. దీనిపై పోస్టర్‌లను విడుదల చేయాలన్నారు. దీనివల్ల మార్కెటింగ్‌ సౌకర్యాలు మరింత మెరుగు పడతాయన్నారు. అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ సహాయంతో రైతులకు స్పష్టంగా ఈ విషయాలను తెలియజేయాలని, ఆన్‌లైన్‌లో కూడా అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.

రబీ పంటలు సాగు చేసిన 6,081 ఆర్బీకేల పరిధిలో పంటల కొనుగోళ్లు ప్రారంభించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.28,430 కోట్లతో పంటల కొనుగోళ్లు చేశామని తెలిపారు. ఇందులో ధాన్యం కొనుగోలుకు రూ.22,918 కోట్లు, ఇతర పంటలకు రూ.5,512 కోట్లు వెచ్చించామన్నారు. 

2015–16 నుంచి 2018–19 వరకు గత ప్రభుత్వం నాలుగేళ్లలో పంటల కొనుగోలు కోసం రూ.43,047 కోట్లు మాత్రమే వెచ్చించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

విత్తనాల దగ్గర నుంచి పురుగు మందులు, ఎరువులు సహా ఏం కొనుగోలు చేసినా రైతు మోసపోకూడదు. వాటి కోసం ఆర్బీకేల్లో రైతులు ఆర్డర్‌ చేసిన 48 నుంచి 72 గంటల్లోగా అందుబాటులోకి తేవడమే లక్ష్యం. వాటిని ప్రభుత్వం పరీక్షించి, క్వాలిటీ పరంగా స్టాంప్‌ వేసి ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా కల్తీ అన్నది రైతు దగ్గరకి రాకూడదన్న తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం.

ఆర్బీకే యూనిట్‌గా ప్రతి గ్రామానికి పంటల ప్రణాళిక తయారు చేయాలి. ఏయే పంటలకు కనీస మద్దతు ధర ఏమిటనేది ప్రదర్శించిన పోస్టర్‌ ఉండాలి. ప్రతి గ్రామంలో రైతులు విత్తనం వేసే దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు ప్రతి అడుగులో తోడుగా ఉంటూ చేయి పట్టుకుని నడిపించాలి. ఇలాంటి వ్యవస్థ కచ్చితంగా గ్రామాల్లో రావాలనే తాపత్రయం, తపన నుంచి పుట్టిన బీజమే ఈ రైతు భరోసా కేంద్రం. 

ఆర్బీకే చానల్‌ ప్రారంభం
రైతులకు అన్ని విధాలా తోడుగా ఉండేలా రూపొందించిన ఆర్బీకే చానల్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ఘట్టంలో ఈ రోజు ఇంకో ముందడుగు వేశామని పేర్కొన్నారు. ఆర్బీకేల్లో స్మార్ట్‌ టీవీలు పెడుతున్నాం కాబట్టి, అక్కడి రైతులకు చాలా విషయాల మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణం గురించి తెలియజెపుతూ నిరంతరం సమాచారం ఇచ్చేందుకు ఈ చానల్‌ ఉపయోగపడుతుందన్నారు.

ఏ రైతుకు ఏ సందేహం వచ్చినా టోల్‌ ఫ్రీ నంబర్‌ 155251కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. రైతుల సందేహాలపై సైంటిస్ట్‌లతో ఇంటరాక్టివ్‌ పద్ధతిలో కూడా సందేహాలు తీర్చడానికి ఒక పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆర్బీకేలను విప్లవాత్మకంగా రైతులకు ఇంకా దగ్గరగా, ఇంకా ఎక్కువగా ఉపయోగపడే విధంగా తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా అడుగులు ముందుకు వేస్తున్నామని తెలిపారు. ఇవన్నీ కూడా రైతులకు ఉపయోగపడాలని మనసారా ఆశిస్తున్నానని, రైతులకు ఇంకా మంచి చేసే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు.
చదవండి: 
బడుగుబలహీన వర్గాలకే అగ్రాసనం..
మైదుకూరు ఛైర్మన్‌ పీఠం వైఎస్సార్‌సీపీదే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement