సాక్షి ప్రతినిధి, గుంటూరు : భూ సమీకరణకు అంగీకారపత్రాలు ఇవ్వని జరీబు గ్రామాల రైతులు పట్టువదలని విక్రమార్కుల్లా వ్యవహరిస్తున్నారు. భూ సమీకరణకు వ్యతిరేకిస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడంతోపాటు ఢిల్లీలోనూ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. శనివారం బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమిత్‌షాను, దగ్గుబాటి పురందే శ్వరిని కలిసి పరిస్థితులను వివరించారు. గడువు తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 33 వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించిందని, ఇవి కాకుండా అసైన్డ్, దేవాదాయశాఖ, వక్ఫ్‌బోర్డు, ప్రభుత్వ భూములు మరో 17 వేల ఎకరాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని చెప్పారు.
మొత్తం 50 వేల ఎకరాలు రాజధాని నిర్మాణానికి సరిపోతాయని, ఇకపై భూ సమీకరణగాని, సేకరణగాని చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి దీనిపై ఒక నిర్ణయానికి వస్తామని అమిత్‌షా రైతులకు వివరించారు. తొలుత రైతులంతా తమ ప్రాంతంలో పండుతున్న 120 రకాల పంటలకు సంబంధించిన ఫొటోలను అమిత్‌షాకు చూపించారు.
జరీబు భూముల్లో ఏటా మూడు పంటలు పండుతాయని, 20 అడుగుల లోతులోనే సాగునీరు అందబాటులోకి వస్తుందని వివరించారు. ఇప్పటి వరకు సమీకరించిన భూమి రాజధానికి సరిపోతుందని కాబట్టి తమ భూములను సమీకరణ, సేకరణ నుంచి మినహాయించే విధంగా చూడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో అమలులోకి తీసుకురానున్న భూ సేకరణకు సంబంధించిన ఆర్డినెన్స్‌లో మల్టీక్రాప్స్ పండించే భూములను మినహాయించాలని కోరారు. అమిత్‌షాను కలిసిన వారిలో పెనుమాక గ్రామానికి చెందిన నరేష్‌రెడ్డి, ముప్పెరి సుబ్బారావు, కల్లెం గోవిందు, ఎం.కోటిరెడ్డి, సోమశేఖర్ తదితరులు ఉన్నారు.
అంగీకార పత్రాలు వెనక్కివ్వండి..
తమ అంగీకారపత్రాలు వెనక్కి తిరిగివ్వాలంటూ శనివారం రైతులు ఆందోళనకు దిగారు. మంగళగిరి మండలం బేతపూడికి చెందిన సుమారు 40మంది రైతులు శనివారం నవులూరులోని సీఆర్‌డీఏ కార్యాలయానికి చేరుకున్నారు. తమ అంగీకారపత్రాలు వెనక్కి ఇవ్వాలని డిప్యూటి కలెక్టర్ రఘనాథ్‌రెడ్డిని కోరారు. భూ సమీకరణ గడువు ముగిసే నాటికి భూములు ఇవ్వకపోతే భూ సేకరణ చేస్తారని భయపెట్టడం వల్లే తాము భూములు ఇచ్చామని తమకు భూములు ఇవ్వడం ఏమాత్రం ఇష్టలేదని స్పష్టం చేశారు. దీనికి డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ అంగీకారపత్రాలను ప్రభుత్వానికి అందజేశామని, సమస్యపై మెమొరాండం అందజేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని సూచించారు. ఈ సందర్భంగా రైతులు కార్యాలయం ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అధికారుల్లో మొదలైన అలజడి..
తాడేపల్లి రూరల్ : రాజధాని ప్రతిపాదిత గ్రామాల రైతులు తామిచ్చిన 9.3 అంగీకార పత్రాలు వెనక్కివ్వాలని ఆందోళన చేస్తున్నారని వార్తలు రావడంతో సీఆర్‌డీఏ కార్యాలయాల వద్ద శనివారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని ప్రాంతంలో పర్యటించి, రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు రైతులు బలవంతంగా తమ భూములు ఇస్తున్నామని, న్యాయం చేయమని ఆయనకు విన్నవించారు.
అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఈ ప్రాంతంలో పర్యటించి, అవసరమైతే రైతుల తరఫున ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. వీరి పర్యటనలు రైతుల్లో చైతన్యం తెచ్చాయి. భూ సమీకరణపై వ్యతిరేకత తారస్థాయికి చేరింది. భూములు ఇచ్చిన రైతులు సైతం తిరుగుబావుట ఎగురవేసి ఎక్కడ తమ భూముల అంగీకారపత్రాలు ఇచ్చేయమంటారోనని అధికారుల్లో అలజడి మొదలైంది. ఈ క్రమంలో సీఆర్‌డీఏ కార్యాలయాల వద్ద పోలీసులుతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
పట్టువదలని జరీబు రైతులు
Published Sun, Mar 8 2015 2:47 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement