మంగళగిరి : ప్రభుత్వంతోపాటు పలువురు అధికార పార్టీ నేతలు, కొందరు అధికారుల బెదిరింపుల కారణంగానే తాము భూ సమీకరణకు అంగీకార పత్రాలు ఇవ్వాల్సివచ్చిందని రాజధాని గ్రామాల రైతులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ పత్రాలను వెనక్కు తీసుకుంటామని, లేదంటే ప్రభుత్వంతో ఒప్పందానికి వెళ్లకుండా, కోర్టును ఆశ్రయించి భూములను నిలుపుకుంటామని చెబుతున్నారు.
గత నెల 28తో భూ సమీకరణకు గడువు ముగియనుండగా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారపార్టీ నేతలు భూములు ఇవ్వకుంటే సేకరణలో లాక్కుంటారనీ, సమీకరణకు ఇవ్వని భూములు అమ్ముకోవడానికి వీల్లేదంటూ ప్రచారం చేయడంతో ఆందోళన చెందిన రైతులు అంగీకారపత్రాలు అందజేశారు.మరోవైపు, భూసేకరణ బిల్లు ఆమోదం పొందలేదని, భూసేకరణ సాధ్యం కాదని, ఒకవేళ భయపడి రైతులు అంగీకారపత్రాలు అందజేసినా కోర్టుకు వెళ్లయినా సరే భూములు తిరిగితెస్తామని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) వారికి అభయం ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఈ నెల 3న రాజధాని గ్రామాల్లో పర్యటిస్తూ తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే సమీకరణకు ఇచ్చిన భూములను వెనక్కు ఇస్తామని చెప్పడం రైతుల్లో ఆనందోత్సాహాలను నింపింది. దీంతో అంగీకారపత్రాలను వెనక్కు తీసుకునేందుకు పలువురు రైతులు సిద్ధమవుతున్నారు.
తగ్గిన భూముల ధరలు...
సమీకరణకు అందజేసిన భూముల ధరలు ఒక్కసారిగా సగానికి సగం (80లక్షల ఎకరా 40లక్షలకు) పడిపోవడం, సమీకరణకు ఇవ్వని భూముల ధరలు కోటిన్నరకు పెరగడం సైతం రైతులను పునరాలోచనలో పడేసింది. దీంతో కొన్ని గ్రామాల్లోని రైతులు మూకుమ్మడిగా అంగీకరపత్రాలను వెనక్కు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నిడమర్రు, బేతపూడి గ్రామాల్లోని రైతులు తమ పత్రాలను వెనక్కు ఇవ్వాలని కోరుతున్నా ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని అధికారులు భయపెడుతున్నారు. దీంతో అంగీకారపత్రాలు తిరిగి ఇచ్చేయాలనీ లేదంటే మూకుమ్మడిగా ఆందోళనకు దిగడంతో పాటు న్యాయపోరాట ం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
రైతుల అభిప్రాయాలు వారి మాట ల్లోనే...
భయంతో అరెకరం ఇచ్చా...
తొలుత అభ్యంతర పత్ర ం ఇచ్చిన నేను, భూ సేకరణ చేస్తారనే భయంతో నాకు ఉన్న అరెకరా భూమిని సమీకరణకు ఇచ్చా. జగన్‌తో పాటు పవన్ కల్యాణ్ పర్యటనతో భూసేకరణ జరగదనే నమ్మకం కలిగింది. అధికారులు అంగీకారపత్రం వెనక్కి ఇవ్వకుంటే రైతులతో కలసి కార్యాలయం వద్దే ఆందోళన చేస్తాం.
- కోలపల్లి వసంతరావు, బేతపూడి
వెనక్కు ఇవ్వకుంటే న్యాయపోరాటమే..
సమీకరణలో ఇవ్వకుంటే భూములు లాక్కుంటారని కొందరు చెప్పడంతో తొలుత అభ్యంతర పత్రం ఇచ్చిన నేను భయపడి ఐదెకరాలు భూమిని ఇచ్చా. జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో భూమిని లాక్కోలేరనే నమ్మకం కుదరడంతో అంగీకారపత్రాన్ని వెనక్కి అడుగుతున్నా. ఇవ్వకపోతే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోకుండా, న్యాయ పోరాటం చేస్తా.
-కొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు, నిడమర్రు
నా పత్రం వెనక్కు ఇవ్వాలి...
భూములు ఇవ్వకుంటే అమ్ముకోలేరని అనడంతోపాటు, ప్రభుత్వం లాక్కుంటుందంటే భయ పడి చివర రోజు భూసమీకరణకు అంగీకారప్రతం ఇచ్చాను. సమీకరణకు భూమి ఇవ్వడం తొలి నుంచి ఇష్టం లేదు. కేవలం భయపడే ఇచ్చాను. వెంటనే అధికారులు నా పత్రం వెనక్కి ఇవ్వాలి.
- ఆముదాల మార్కండేయులు, రైతు, నిడమర్రు
భయంతోనే భూములిచ్చాం..!
Published Sat, Mar 7 2015 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM
Advertisement
Advertisement