పెదపులిపాకలో విజిలెన్స్ తనిఖీల్లో బహిర్గతం
పెనమలూరు : పెదపులిపాక గ్రామ పరిధిలో కృష్ణానది వద్ద నిర్మిస్తున్న పుష్కర ఘాట్ నిర్మాణంలో లోపాలు బయటపడ్డాయి. ఈ ఘాట్ నిర్మాణంపై పర్యవేక్షణ కొరవడడంతో గుత్తేదారు ఇంజినీర్లు ఇచ్చిన డిజైన్‌లోని ప్రమాణాల ప్రకారం నిర్మాణం చేయడం లేదని బుధవారం విజిలెన్స్ అధికారులు జరిపిన తనిఖీల్లో తేలింది.
పెనమలూరు మండలంలో పెదపులిపాక ఘాట్‌కి మాత్రమే రూ. 38.75 లక్షలు కేటాయించారు. ఈ ఘాట్‌ను 34 మీటర్ల వెడల్పు, 17 మీటర్ల పొడవుతో నిర్మించాల్సి ఉంది. కొంతకాలంగా ఇక్కడ ఘాట్ పనులు జరుగుతున్నాయి. ఘాట్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఈ రామకృష్ణ, ఏఈలు వెలుగొండయ్య, రాజేంద్రప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీరి తనిఖీలో ఘాట్ వెడల్పు 34 మీటర్లు ఉండాల్సి ఉండగా అది 33.5 మీటర్లు, కాంక్రీట్ మందం 30 సెంటీమీటర్లకు బదులుగా 28 సెంటీమీటర్లు మాత్రమే ఉంది. విజిలెన్స్ అధికారులు కొలతలు వేసి వివరాలు నమోదు చేశారు.
ఘాట్ డిజైన్‌పై విస్మయం
పెదపులిపాక ఘాట్ డిజైన్‌పై విజిలెన్స్ అధికారులతో పాటు, గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాంక్రీట్ మందం డిజైన్‌లో ఎక్కవ చూపారని, మందం తగ్గించి ఉంటే ఘాట్ మరింత పొడ వు, వెడల్పు పెరిగేదని చెబుతున్నారు. ఇక ఘాట్‌లో ఇప్పడు నీరు చాలా తక్కువగా ఉండడంతో ఘాట్ ఎత్తు సరిపోతుంది. ఒక వేళ పుష్కరాల నాటికి కృష్ణానదికి వరదలు వస్తే ఘాట్ పూర్తిగా నీటిలో మునిగిపోయే అవకాశం ఉంది. ఘాట్‌ను మరో రెం డు మీటర్లు ఎత్తు నిర్మించి ఉండి ఉంటేయాత్రికులకు అనువుగా ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు.
మరిన్ని నిధులు అవసరం
ఈ ఘాట్‌కు మరిన్ని నిధులు అవసరం ఉంది. ఘాట్‌కు వెళ్లే దారి సక్రమంగా లేదు. పాత ఘాట్ కు, కొత్త ఘాట్‌కు లింకుగా మధ్యలో యాత్రికులు నడవడానికి మెట్లు నిర్మించాలి. ఘాట్ వద్ద బ్యూటిఫికేషన్ కూడా చేయాల్సి ఉంది. వీటికి ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు. కనీసం అంచనాలు కూడా వేయలేదని సమాచారం.