ఎస్కేయూ దొంగల అరెస్ట్
అనంతపురం క్రైం : శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ నిధులు దుర్వినియోగం చేసి సొంత ఆస్తులు కూడగట్టుకోవడంతో పాటు కుటుంబ సభ్యుల పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయించిన ముగ్గురు ఉద్యోగులను ఇటుకలపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో సూపరింటెండెంట్లు కొండేటి శేషయ్య, కుమ్మర కృష్ణమూర్తి, సీనియర్ అసిస్టెంట్ గుమ్మడి ఉదయ్‌భాస్కర్‌రెడ్డి ఉన్నారు.
ముగ్గురూ ఫైనాన్స్ విభాగంలో పని చేస్తున్నవారే. ఉదయ్‌భాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన సుమారు రూ.16.90 లక్షల నగదు కల్గిన 12 బ్యాంకు పాసు బుక్కులు, సుమారు రూ. 1.36 కోట్లు గల 28 ఫిక్స్‌డ్ డిపాజిట్ల బాండ్లు స్వాధీనం చేసుకున్నారు. కొండేటి శేషయ్య నుంచి సుమారు రూ. 91 వేల నగదు కల్గిన రెండు బ్యాంకు పాసు బుక్కులు, కుమ్మర కృష్ణమూర్తి నుంచి సుమారు రూ. 32 వేలు కల్గిన రెండు పాసు బుక్కులు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం ముగ్గురి నుంచి రూ. 1.36 కోట్ల విలువైన 28 ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లు, రూ. 21 లక్షల నగదు కల్గిన 16 బ్యాంకు పాసుబుక్కులు, స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్టు వివరాలను శుక్రవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ రాజశేఖర్‌బాబు వెల్లడించారు.
నిధుల దుర్వినియోగంపై రిజిస్ట్రార్ ఫిర్యాదు
ఎస్కేయూ ఫైనాన్స్ విభాగంలో నిధుల దుర్వినియోగం అయినట్లు గుర్తించిన రిజిస్ట్రార్ దశరథరామయ్య ఈనెల 16న ఇటుకులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు ఆదేశాలతో అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ పర్యవేక్షణలో ఇటుకలపల్లి సీఐ కే. శ్రీనివాసులు, ఎస్‌ఐ శివగంగాధర్‌రెడ్డిల నేతృత్వంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో నిందితులను విచారించగా పలు విషయాలు వెల్లడయ్యాయి.
దోచుకున్న సొమ్ముతో ఆస్తులు కూడగట్టి...
యూనివర్సిటీ ఫైనాన్స్ విభాగంలో దోచుకున్న డబ్బుతో ఉదయ్‌భాస్కర్‌రెడ్డి ఆస్తులు కూడగట్టాడు. తన కుటుంబ సభ్యుల పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయించాడు. ఇలా మొత్తం 1.36 కోట్లు డిపాజిట్లు చేయించాడు. జిల్లా కేంద్రం, పరిసర ప్రాంతాల్లో అపార్టుమెంటులో ఒకప్లాటు, 15 సెంట్ల స్థలం కొనుగోలు చేశాడు. ఇటీవల కూతురికి ఘనంగా వివాహం చేశాడు. బంగారం కొనుగోలు చేశాడు. ఈయనతో పాటు తక్కిన ఇద్దరూ తమ కుటుంబ సభ్యుల పేరిట ప్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేశారు. గుర్తించిన వాటిపై తదుపరి లావాదేవీలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.