రాయల తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం కరీంనగర్కు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని ఆయన కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గత 59 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు పోరాడుతున్న సంగతి మరువరాదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ సుముఖుత వ్యక్తం చేసింది.
అయితే రాయలసీమలోని రెండు జిల్లాలతోపాటు తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలు కలపి రాయల తెలంగాణ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సూత్రప్రాయంగా అంగీకరించే అవకాశం ఉందని వార్తలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తమకు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాయల తెలంగాణ ఏర్పాటు వద్దని టి.జేఏసీ నేతలు ఇప్పటికే న్యూఢిల్లీలో ముమ్మరం ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.