రోజుకో పార్టీ | every day parties | Sakshi
Sakshi News home page

రోజుకో పార్టీ

Published Tue, Feb 25 2014 12:15 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

రోజుకో పార్టీ - Sakshi

రోజుకో పార్టీ

 రోజుకో పార్టీ
 
 ఢిల్లీలో మకాం వేసిన అన్ని పార్టీల నాయకులు పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించడంతో ఒక్కొక్కరుగా తిరిగి వస్తున్నారు. తెలంగాణ సాధన లో తామే చాంపియన్లమని చెప్పుకోవడానికి భారీ ఎత్తున  విజయోత్సవాలకు సిద్ధమవుతున్నారు. ఒకరికి మించి మరొకరు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

 

సోమవారం నుంచి వరుసగా మూడురోజుల పాటు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం జిల్లానేతలు  టార్గెట్లు పెట్టుకుని మరీ జనసమీకరణ ప్రయత్నాల్లో పడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పార్టీల నేతలు చురుగ్గా పాల్గొన్నా వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఆ మేరకు లబ్ధి చేకూరుతుందా లేదా అన్న సందేహాలు అందరినీ వేధిస్తున్నాయి. విజయోత్సవాల ద్వారా జనాన్ని ఆకర్షించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ, సభ
 నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్, కరీంనగర్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్, పార్టీ జిల్లా ఇన్‌చార్జి బి.వినోద్‌కుమార్ ఢిల్లీ నుంచి సోమవారం జిల్లాకు వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వారిని ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద జిల్లా నాయకులు ఆహ్వానించనున్నారు. అక్కడనుంచి నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. సాయంత్రం  తెలంగాణచౌక్‌లో జరిగే భారీ బహిరంగ సభలో వారు పాల్గొంటారు. ర్యాలీ, సభలను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు బాధ్యతలు పంచుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ శ్రేణులను పెద్ద సంఖ్యలో సమీకరించడంతో పాటు ఉద్యమ సంఘాలను ఆహ్వానిస్తున్నారు.
     మంగళవారం కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత సభను నిర్వహించనుంది. ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బిల్లుకు ఆమోదం లభించిన తరువాత ఢిల్లీ నుంచి జిల్లాకు వస్తున్న మంత్రి దుద్దిళ శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్‌లకు పార్టీశ్రేణులు పెద్దఎత్తున స్వాగత సన్నాహాలు చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు కోసం చర్యలు తీసుకున్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌సింగ్‌లకు కృతజ్ఞత తెలిపేందుకు డీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాభవన్‌లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సభను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సభలో పాల్గొనాలని ఆహ్వానించారు.
     

 

బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ధన్యవాద సభ నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ నాయకత్వం సంపూర్ణంగా సహకరించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నేరవేరిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ సభను పెడుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, లోక్‌సభాపక్ష నేత సుష్మాస్వరాజ్, సీనియర్ నాయకులు ఆరుణ్‌జైట్లీ, ప్రకాష్ జవదేకర్‌లకు ఈ సభలో ధన్యవాదాలు తెలుపనున్నారు. జిల్లా ముఖ్య నాయకులు సిహెచ్.విద్యాసాగర్‌రావు, పి.సుగుణాకార్‌రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొంటారు. ఈ సభకు కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పార్టీ కార్యకర్తలను సమీకరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement