telengana bill
-
మేం మద్దతివ్వకుంటే బిల్లు పాసయ్యేదే కాదు
తెలంగాణపై వెంకయ్యనాయుడు కాంగ్రెస్, టీఆర్ఎస్ వల్లనే ఆలస్యమైంది హైదరాబాద్: పార్లమెంట్లో బీజేపీ మద్దతు ఇవ్వకుంటే తెలంగాణ బిల్లు ఆమోదం పొందేదే కాదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఎం. వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో తనపై చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. రాష్ట్ర ఏర్పాటు ఇంత ఆలస్యం కావడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలే బాధ్యత తీసుకోవాలన్నారు. ఉద్యమంలో ఈ ప్రాంత యువకులు ఆత్మహత్యలు చేసుకోవడానికీ ఆ రెండు పార్టీలు కారణమని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామని ప్రకటించడంవల్లే కాంగ్రెస్ పార్టీ తొమ్మిదిన్నరేళ్లు కాలయాపన చేసి ఎన్నికల ముందు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి ముందుకొచ్చిందని చెప్పారు. తనపై విమర్శలు చేస్తున్న కేంద్ర మంత్రి జైరాంరమేష్ తెలంగాణ బిల్లు చర్చ జరిగే సమయంలో ఎనిమిదిసార్లు తనను ఎందుకు కలవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలని కోరడం తన తప్పా? అని ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబులది అపవిత్ర కలయిక అంటున్నారు గానీ, చంద్రబాబు కింద తానేమీ పని చేయలేదు, మీరే ఆయన కింద పనిచేశారని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పడు తనపై విమర్శలు చేస్తున్న ఈయనే 2009లో ఎన్డీయేతో కలిసేందుకు తన ఇంటికి వచ్చారని చెప్పారు. ఈ ప్రాంతం వారే ముఖ్యమంత్రి కావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటారు కానీ, వలస వచ్చిన వాళ్లను సీఎం కావడానికి అంగీకరించరని వ్యాఖ్యానించారు. ఎవరు వసూళ్ల రాజానో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. హుందాగా వ్యవహరించాలని, కుల ప్రస్తావన మానుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఆపేశక్తి ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేశారు. పొత్తు ధర్మం పాటిస్తారనుకుంటున్నా సీమాంధ్ర ప్రాంతంలో పొత్తుల్లో బీజేపీకి కేటాయించిన సీట్లలో మూడు చోట్ల టీడీపీ అభ్యర్థులను బరిలో నిలిపిందని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తనతో చెప్పారని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. పొత్తు నిర్ణయం సమయంలో టీడీపీ నేతలు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని.. పొత్తు ధర్మాన్ని పాటిస్తారని అనుకుంటున్నానని చెప్పారు. రేపటి నుంచి సీమాంధ్రలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. -
రోజుకో పార్టీ
రోజుకో పార్టీ ఢిల్లీలో మకాం వేసిన అన్ని పార్టీల నాయకులు పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించడంతో ఒక్కొక్కరుగా తిరిగి వస్తున్నారు. తెలంగాణ సాధన లో తామే చాంపియన్లమని చెప్పుకోవడానికి భారీ ఎత్తున విజయోత్సవాలకు సిద్ధమవుతున్నారు. ఒకరికి మించి మరొకరు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి వరుసగా మూడురోజుల పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం జిల్లానేతలు టార్గెట్లు పెట్టుకుని మరీ జనసమీకరణ ప్రయత్నాల్లో పడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పార్టీల నేతలు చురుగ్గా పాల్గొన్నా వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఆ మేరకు లబ్ధి చేకూరుతుందా లేదా అన్న సందేహాలు అందరినీ వేధిస్తున్నాయి. విజయోత్సవాల ద్వారా జనాన్ని ఆకర్షించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ, సభ నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్, కరీంనగర్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్, పార్టీ జిల్లా ఇన్చార్జి బి.వినోద్‌కుమార్ ఢిల్లీ నుంచి సోమవారం జిల్లాకు వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వారిని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జిల్లా నాయకులు ఆహ్వానించనున్నారు. అక్కడనుంచి నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. సాయంత్రం తెలంగాణచౌక్‌లో జరిగే భారీ బహిరంగ సభలో వారు పాల్గొంటారు. ర్యాలీ, సభలను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు బాధ్యతలు పంచుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ శ్రేణులను పెద్ద సంఖ్యలో సమీకరించడంతో పాటు ఉద్యమ సంఘాలను ఆహ్వానిస్తున్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత సభను నిర్వహించనుంది. ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బిల్లుకు ఆమోదం లభించిన తరువాత ఢిల్లీ నుంచి జిల్లాకు వస్తున్న మంత్రి దుద్దిళ శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్‌లకు పార్టీశ్రేణులు పెద్దఎత్తున స్వాగత సన్నాహాలు చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు కోసం చర్యలు తీసుకున్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్, రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌సింగ్‌లకు కృతజ్ఞత తెలిపేందుకు డీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాభవన్‌లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సభను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సభలో పాల్గొనాలని ఆహ్వానించారు. బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ధన్యవాద సభ నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ నాయకత్వం సంపూర్ణంగా సహకరించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నేరవేరిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ సభను పెడుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, లోక్‌సభాపక్ష నేత సుష్మాస్వరాజ్, సీనియర్ నాయకులు ఆరుణ్‌జైట్లీ, ప్రకాష్ జవదేకర్‌లకు ఈ సభలో ధన్యవాదాలు తెలుపనున్నారు. జిల్లా ముఖ్య నాయకులు సిహెచ్.విద్యాసాగర్‌రావు, పి.సుగుణాకార్‌రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొంటారు. ఈ సభకు కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పార్టీ కార్యకర్తలను సమీకరిస్తున్నారు. -
విభజనకు కిరణే కారణం: మంత్రి డొక్కా
సీఎం తెరవెనుక ఒప్పందాల వల్లే రాష్ట్రం చీలిక : మంత్రి డొక్కా సోనియా ఏడాది కిందటే తెలంగాణకు ప్యాకేజీ ఇస్తామన్నారు సీఎం పదవిని కోల్పోవాల్సి వస్తుందని కిరణ్ అడ్డుపడ్డారు విభజనకు సహకరిస్తూ సీమాంధ్ర ప్రజలను మోసగించారు ఢిల్లీ పెద్దలతో మాట్లాడుకుని రెండు ప్లాన్లు సిద్ధం చేసుకున్నారు ఏం చేసినా.. కిరణ్ మళ్లీ కాంగ్రెస్ టోపీయే పెట్టుకుని వస్తారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం రెండుగా చీలిపోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే ప్రధాన కారణమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ధ్వజమెత్తారు. ఢిల్లీలోని కొందరు పెద్దలతో ఆయన తెరవెనుక ఒప్పందాలు చేసుకొని తెలంగాణ బిల్లుకు చివరి వరకు తన సహకారాన్ని అందించారంటూ నిప్పులు చెరిగారు. సీఎం కిరణ్ పైకి సమైక్యవాదం వినిపిస్తూ లోలోపల విభజనకు తోడ్పాటునందించి సీమాంధ్ర ప్రజలను దారుణంగా మోసపుచ్చారని డొక్కా మండిపడ్డారు. ఆయన మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కిరణ్ తీరును ఎండగట్టారు. లోక్‌సభలో విభజన బిల్లు ప్రవేశపెడితే రాజీనామా అన్న సీఎం.. ఇంకా నేడు, రేపు అంటూ నాన్చడం చిత్రంగా ఉందన్నారు. ‘‘కిరణ్ ఇటీవలి కాలంలో లగేజీలు సర్దుకోవడంపైనే దృష్టి పెట్టారు. ఇంకా కొంత లగేజీ మిగిలిపోయిందట. కొన్ని బ్యాగులు, పుస్తకాలు సర్దుకోవలసిన అవసరముంది. అవన్నీ సర్దుకున్నాకైనా ఆయన రాజీనామా చేస్తారో లేదో చూడాలి’’ అని డొక్కా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనలో సీఎం కిరణ్ పాత్ర గురించి డొక్కా చేసిన విమర్శలు ఆయన మాటల్లోనే... తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఏడాది కిందటే ఒక నిర్ణయానికి వచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతామని, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామని సీఎం కిరణ్‌కు చెప్పారు. కానీ.. తెలంగాణకు ప్యాకేజీ ప్రకటిస్తే అందులో భాగంగా తాను సీఎం పదవిని కూడా కోల్పోవలసి వస్తుందని భావించి సీఎం అధిష్టానం సూచనలకు కుంటిసాకులు చెప్తూ అడ్డుపడ్డారు. అనంతర పరిణామాల్లో రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీలో కీలకపాత్ర పోషిస్తున్న పలువురు పెద్దలతో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రజలను మోసగించి నిండా ముంచారు. ఢిల్లీ పెద్దలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం కిరణ్ రెండు ప్లాన్లు రూపొందించుకున్నారు. రాష్ట్ర విభజనకు సహకరిస్తూనే పైకి సమైక్యవాదాన్ని వినిపించడం. సమైక్య ఉద్యమాన్ని మెల్లగా నీరుగార్చటం. చివర్లో అసెంబ్లీలో విభజన బిల్లు ప్రక్రియను పూర్తిచేసి పంపడం. ఆపై పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేవరకు వేచి చూసి రాజీనామా చేయడం. కొత్త పార్టీ పెట్టి ఆరేడు నెలలు హడావుడి చేసి ఆ తరువాత దాన్ని మూసేసి మళ్లీ కాంగ్రెస్‌లో చేరి పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం. ఇది మొదటి ప్లాన్‌లో భాగం. రెండో ప్లాన్‌లో భాగంగా.. బిల్లు ఆమోదం పొందాక రాజకీయంగా వైరాగ్యాన్ని ప్రకటించడం. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి కొన్ని రోజులు బెంగళూరులో, ఆపై అమెరికాలో గడిపి రెండేళ్ల తరువాత మెల్లగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కొత్త అవతారం ఎత్తడం. కిరణ్ సమైక్యవాది అనడం శుద్ధ తప్పు. దాన్ని ఎవరూ నమ్మడం లేదు. ఆయన తెరవెనుక విధానాల వల్ల సమైక్యాంధ్రను కోల్పోయాం. సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన నాడైనా ఆయన రాజీనామా చేసి ఉంటే రాష్ట్రంలో రాజకీయం సంక్షోభం ఏర్పడి 2014 ఎన్నికల వరకు తెలంగాణ అంశం వాయిదా పడేది. కిరణ్ మాయలో పడి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని చివరివరకు రక్షించుకుంటూ వచ్చి నిండా మునిగారు. సీమాంధ్ర మంత్రులు కూడా సీఎం మాయలో పడి ముందు ఆయన వెనుకే వెళ్లినా.. ఇప్పుడు ఏంచేయాలో పాలుపోని స్థితిలో పడ్డారని తెలిపారు. -
‘బిల్లు’ ఆమోదం బాధ్యత బీజేపీదే
నిజాంసాగర్, న్యూస్‌లైన్ : పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు యూపీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బిల్లును ఆమోదించే బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీపైనే ఉందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సమన్యాయం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు తెరవెనుక నాటకం ఆడుతున్నాడని విమర్శించారు. శనివారం పోచారం జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్సింధేతో కలిసి మండల కేంద్రంలో విలేకరులతో మా ట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చివరి దశ కు చేరిందని, అరవై ఏళ్ల కల త్వరలో సాకారం కానుందన్నారు. తెలంగాణ కోసం ఢిల్లీలోని జాతీయ నాయకులను కలిశామని, బిల్లు ఆమోదానికి జాతీయపార్టీల నాయకులు సానుకూలంగా మద్దతు ఇస్తున్నారన్నారు. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఎ మ్మెల్యేలు, ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఎంతమంది అడ్డుపడినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమన్నారు. రెండుకళ్ల సిద్ధాంతాన్ని అవలంబిస్తున్న చంద్రబాబునాయకుడు తెలంగాణను అడ్డుకోవడానికి బీజేపీ జాతీయ నేతలను కలుస్తుండడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఎన్నిదీక్షలు చేసినా ప్రత్యేక రాష్ట్రం ఆగదన్నారు. సమావేశంలో స్థానిక టీఆర్ ఎస్ నాయకులు రాజు, గంగారెడ్డి, వినయ్‌కుమార్, విఠల్, రాజే శ్వర్‌గౌడ్, రాజు, సత్యనారాయణ, దుర్గారెడ్డి తదితరులున్నారు.