విభజనకు కిరణే కారణం: మంత్రి డొక్కా
సీఎం తెరవెనుక ఒప్పందాల వల్లే రాష్ట్రం చీలిక : మంత్రి డొక్కా
సోనియా ఏడాది కిందటే తెలంగాణకు ప్యాకేజీ ఇస్తామన్నారు
సీఎం పదవిని కోల్పోవాల్సి వస్తుందని కిరణ్ అడ్డుపడ్డారు
విభజనకు సహకరిస్తూ సీమాంధ్ర ప్రజలను మోసగించారు
ఢిల్లీ పెద్దలతో మాట్లాడుకుని రెండు ప్లాన్‌లు సిద్ధం చేసుకున్నారు
ఏం చేసినా.. కిరణ్ మళ్లీ కాంగ్రెస్ టోపీయే పెట్టుకుని వస్తారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం రెండుగా చీలిపోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే ప్రధాన కారణమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ధ్వజమెత్తారు. ఢిల్లీలోని కొందరు పెద్దలతో ఆయన తెరవెనుక ఒప్పందాలు చేసుకొని తెలంగాణ బిల్లుకు చివరి వరకు తన సహకారాన్ని అందించారంటూ నిప్పులు చెరిగారు. సీఎం కిరణ్ పైకి సమైక్యవాదం వినిపిస్తూ లోలోపల విభజనకు తోడ్పాటునందించి సీమాంధ్ర ప్రజలను దారుణంగా మోసపుచ్చారని డొక్కా మండిపడ్డారు. ఆయన మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కిరణ్ తీరును ఎండగట్టారు. లోక్‌సభలో విభజన బిల్లు ప్రవేశపెడితే రాజీనామా అన్న సీఎం.. ఇంకా నేడు, రేపు అంటూ నాన్చడం చిత్రంగా ఉందన్నారు. ‘‘కిరణ్ ఇటీవలి కాలంలో లగేజీలు సర్దుకోవడంపైనే దృష్టి పెట్టారు. ఇంకా కొంత లగేజీ మిగిలిపోయిందట. కొన్ని బ్యాగులు, పుస్తకాలు సర్దుకోవలసిన అవసరముంది. అవన్నీ సర్దుకున్నాకైనా ఆయన రాజీనామా చేస్తారో లేదో చూడాలి’’ అని డొక్కా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనలో సీఎం కిరణ్ పాత్ర గురించి డొక్కా చేసిన విమర్శలు ఆయన మాటల్లోనే...
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఏడాది కిందటే ఒక నిర్ణయానికి వచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతామని, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామని సీఎం కిరణ్‌కు చెప్పారు. కానీ.. తెలంగాణకు ప్యాకేజీ ప్రకటిస్తే అందులో భాగంగా తాను సీఎం పదవిని కూడా కోల్పోవలసి వస్తుందని భావించి సీఎం అధిష్టానం సూచనలకు కుంటిసాకులు చెప్తూ అడ్డుపడ్డారు. అనంతర పరిణామాల్లో రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీలో కీలకపాత్ర పోషిస్తున్న పలువురు పెద్దలతో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రజలను మోసగించి నిండా ముంచారు. ఢిల్లీ పెద్దలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం కిరణ్ రెండు ప్లాన్లు రూపొందించుకున్నారు. రాష్ట్ర విభజనకు సహకరిస్తూనే పైకి సమైక్యవాదాన్ని వినిపించడం. సమైక్య ఉద్యమాన్ని మెల్లగా నీరుగార్చటం. చివర్లో అసెంబ్లీలో విభజన బిల్లు ప్రక్రియను పూర్తిచేసి పంపడం. ఆపై పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేవరకు వేచి చూసి రాజీనామా చేయడం.
కొత్త పార్టీ పెట్టి ఆరేడు నెలలు హడావుడి చేసి ఆ తరువాత దాన్ని మూసేసి మళ్లీ కాంగ్రెస్‌లో చేరి పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం. ఇది మొదటి ప్లాన్‌లో భాగం. రెండో ప్లాన్‌లో భాగంగా.. బిల్లు ఆమోదం పొందాక రాజకీయంగా వైరాగ్యాన్ని ప్రకటించడం. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి కొన్ని రోజులు బెంగళూరులో, ఆపై అమెరికాలో గడిపి రెండేళ్ల తరువాత మెల్లగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కొత్త అవతారం ఎత్తడం. కిరణ్ సమైక్యవాది అనడం శుద్ధ తప్పు. దాన్ని ఎవరూ నమ్మడం లేదు. ఆయన తెరవెనుక విధానాల వల్ల సమైక్యాంధ్రను కోల్పోయాం. సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన నాడైనా ఆయన రాజీనామా చేసి ఉంటే రాష్ట్రంలో రాజకీయం సంక్షోభం ఏర్పడి 2014 ఎన్నికల వరకు తెలంగాణ అంశం వాయిదా పడేది. కిరణ్ మాయలో పడి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని చివరివరకు రక్షించుకుంటూ వచ్చి నిండా మునిగారు. సీమాంధ్ర మంత్రులు కూడా సీఎం మాయలో పడి ముందు ఆయన వెనుకే వెళ్లినా.. ఇప్పుడు ఏంచేయాలో పాలుపోని స్థితిలో పడ్డారని తెలిపారు.