మేం మద్దతివ్వకుంటే బిల్లు పాసయ్యేదే కాదు
తెలంగాణపై వెంకయ్యనాయుడు
కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వల్లనే ఆలస్యమైంది
హైదరాబాద్: పార్లమెంట్‌లో బీజేపీ మద్దతు ఇవ్వకుంటే తెలంగాణ బిల్లు ఆమోదం పొందేదే కాదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఎం. వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో తనపై చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. రాష్ట్ర ఏర్పాటు ఇంత ఆలస్యం కావడానికి కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలే బాధ్యత తీసుకోవాలన్నారు. ఉద్యమంలో ఈ ప్రాంత యువకులు ఆత్మహత్యలు చేసుకోవడానికీ ఆ రెండు పార్టీలు కారణమని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామని ప్రకటించడంవల్లే కాంగ్రెస్ పార్టీ తొమ్మిదిన్నరేళ్లు కాలయాపన చేసి ఎన్నికల ముందు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి ముందుకొచ్చిందని చెప్పారు. తనపై విమర్శలు చేస్తున్న కేంద్ర మంత్రి జైరాంరమేష్ తెలంగాణ బిల్లు చర్చ జరిగే సమయంలో ఎనిమిదిసార్లు తనను ఎందుకు కలవాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలని కోరడం తన తప్పా? అని ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబులది అపవిత్ర కలయిక అంటున్నారు గానీ, చంద్రబాబు కింద తానేమీ పని చేయలేదు, మీరే ఆయన కింద పనిచేశారని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పడు తనపై విమర్శలు చేస్తున్న ఈయనే 2009లో ఎన్‌డీయేతో కలిసేందుకు తన ఇంటికి వచ్చారని చెప్పారు. ఈ ప్రాంతం వారే ముఖ్యమంత్రి కావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటారు కానీ, వలస వచ్చిన వాళ్లను సీఎం కావడానికి అంగీకరించరని వ్యాఖ్యానించారు. ఎవరు వసూళ్ల రాజానో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. హుందాగా వ్యవహరించాలని, కుల ప్రస్తావన మానుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఆపేశక్తి ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేశారు.
పొత్తు ధర్మం పాటిస్తారనుకుంటున్నా
సీమాంధ్ర ప్రాంతంలో పొత్తుల్లో బీజేపీకి కేటాయించిన సీట్లలో మూడు చోట్ల టీడీపీ అభ్యర్థులను బరిలో నిలిపిందని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తనతో చెప్పారని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. పొత్తు నిర్ణయం సమయంలో టీడీపీ నేతలు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని.. పొత్తు ధర్మాన్ని పాటిస్తారని అనుకుంటున్నానని చెప్పారు. రేపటి నుంచి సీమాంధ్రలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు.