అధికారం మాదే: వెంకయ్య ధీమా
ముంబై: మహారాష్ట్రలో ఈ నెల 15 ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది బీజేపీయేనని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెకయ్య నాయుడు ధీమా వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు, అభిప్రాయ సేకరణలు, ప్రధాన మంత్రి సభలకు భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలు, వీటన్నింటిని బట్టి పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.
శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత మార్కెట్ సెంటిమెంట్, పెట్టిబడిదారుల విశ్వాసం భారీగా పెరిగిందని అన్నారు. ద్రవ్యోల్బణం తగ్గిందని, నల్లధనాన్ని వెలికి తీసేందుకు ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశామని వెంకయ్య చెప్పారు. అంతర్జాతీయంగాకూడా భారతదేశ ప్రతిష్ట మరింత మెరుగుపడిందని, బ్రిక్స్ బ్యాంక్ తొలి చైర్మన్‌షిప్ భారత్‌కు దక్కిందని అన్నారు. ఇవన్నీ మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలని చెప్పారు. ఐదు వారాల వ్యవధిలో తాము దేశవ్యాప్తంగా పేదల కోసం ఐదు కోట్ల జన్‌ధన్ పథకం బ్యాంకు ఖాతాలను ప్రారంభించామని తెలిపారు.
గత 23 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న న్యాయవ్యవస్థ నియామకాల బిల్లును ఆమోదించామని పేర్కొన్నారు. శివసేనతో తమ బంధం తెగిపోవడం పట్ల వెంకయ్య విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో శివసేన నాయకులు బీజేపీకి బదులుగా కాంగ్రెస్, ఎన్సీపీలను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయాలని సూచించారు. కాంగ్రెస్-ఎన్సీపీల 15 ఏళ్ల అవినీతి పాలనను రూపుమాపాలన్నదే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి చెప్పారు. నిరుద్యోగం, అవినీతి, వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యల వంటి సమస్యలతో సతమవుతున్న రాష్ట్రం విప్లవాత్మకమైన మార్పును కోరుతోందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, కేంద్ర రాష్ట్రాల మధ్య సామరస్యానికి, మోడీ సర్కారును బలోపేతం చేసేందుకు బీజేపీకి ఓటు వేయాలని ఆయన కోరారు.
ప్రాణాలను కాపాడే ఔషధాల ధరలు పెరిగాయన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలపై స్పందిస్తూ, తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మందుల ధరలు పెరగలేదు, తగ్గలేదు అని చెప్పారు. మహారష్ట్రలో వారికి అతి తక్కువ సీట్లు వస్తాయన్న విషయాన్ని గ్రహించి కాంగ్రెస్ నేతలు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని అన్నారు.