బుల్లెట్ కంటే బ్యాలెట్టే ‘పవర్’
సాక్షి, విజయవాడ : ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని, బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పదని తెలియజెప్పాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి, బీజేపీ సీనియర్‌నేత ఎం.వెంకయ్యనాయుడు కోరారు. మంగళవారం విజయవాడ ఎకన్వెన్షన్ సెంటర్లో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడుగా నియమితుడైన డాక్టర్ కంభంపాటి హరిబాబును అధ్యక్షుడుగా కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమైందని, ఆలోటును జాతీయపార్టీ బీజేపీ భర్తీ చేయాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉందని దీన్ని పార్టీ నేతలు, శ్రేణులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
నరేంద్రమోడి ప్రభుత్వం అభివృద్ధి, సుపరిపాలన అనే లక్ష్యాలతో పనిచేస్తోందన్నారు. మున్సిపల్ పాలనలో సంస్కరణలు తీసుకురావాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. మోడి ప్రభుత్వ హయాంలో వేగం పెరిగిందని, ఉద్యోగస్తులు బాధ్యతలు పెరిగాయని తెలిపారు. రాబోయే రోజుల్లో స్మార్ట్ సిటీల ఏర్పాటు, ప్రధాన నగరాల్లో మెట్రోరైళ్లు విస్తరణ వంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. నరేంద్రమోడి 100 రోజుల పాలన 100 ముందడుగులని కొనియాడారు.
సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు అధ్యక్షత వహించి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఏమీ చేసిందని ఇప్పుడే పలువురు ప్రశ్నిస్తున్నారన్నారు. తాము అధికారంలోకి రాగానే పున:వ్యవస్థీకరణ చట్టంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను చట్టం చేశామని గుర్తు చేశారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం ఏపీ నుంచి పరిపాలన సాగించాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. కొత్త రైల్వే జోన్ ప్రతిపాదనకు కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ జరగాలని హరిబాబు సూచించారు.
బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలి...
లబ్బీపేట : రానున్న ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భారతీయ జనతాపార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ అన్నారు. నవంబరు 1 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో సభ్యత్వాలు చేర్చాలన్నారు. మాజీ గవర్నర్ వి.రామారావు, జాతీయ అధికార ప్రతినిధి నరసింహరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, కృష్ణంరాజు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, దాసం ఉమామహేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, శ్రీనివాసరాజు, సినీ నటులు భానుచందర్, సురేష్, శివాజీ, శివాజీరాజ్, విక్కీ తదితరులు పాల్గొన్నారు. నగరానికి చెందిన డాక్టర్ కొడాలి రామకృష్ణ, తుమ్మల పద్మ తదితరులు పార్టీలో చేరారు.