సాక్షి, అనంతపురం : జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆరో రోజైన సోమవారం కూడా ఉద్యమాన్ని హోరెత్తించారు. సోనియా, కేసీఆర్, సీఎం కిరణ్, దిగ్విజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతపురం నగరంలో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. నగర పాలక సంస్థ ఉద్యోగులు సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి కేసీఆర్, దిగ్విజయ్ సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం పిండ ప్రదానం చేసి.. ఓ ఉద్యోగి శిరోముండనం చేయించుకున్నారు. కేసీఆర్, దిగ్విజయ్ దిష్టిబొమ్మలకు కర్మకాండ చేస్తూ... దాదాపు వెయ్యి మందికి రోడ్డుపైనే భోజనం వడ్డించారు. హిందూ దేవాదాయ, ధర్మాదాయ అర్చక సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్‌కు చావు మేళం వాయిస్తూ నగరంలోని సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నేత ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న వారు దారి వెంబడి ‘అమ్మా.. అయ్యా.. సోనియాగాంధీ వెళ్లిపోయింది’ అంటూ కన్నీరు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
సప్తగిరి సర్కిల్‌లో దిష్టిబొమ్మను దహనం చేశారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పెన్షనర్లు, జీవిత బీమా, ఏడీసీసీబీ, జేఎన్‌టీయూ, పశు సంవర్ధక శాఖ, రెవెన్యూ, నీటి పారుదల, ఆర్టీసీ, సంక్షేమ, ప్రణాళిక తదితర శాఖల ఉద్యోగులతో పాటు నాయీ బ్రాహ్మణులు, భవన నిర్మాణ కార్మికులు, బేకరీ, ప్రింటింగ్ ప్రెస్, సూర్యనగర్ మినీ వ్యాన్ అసోసియేషన్ల సభ్యులు, కుమ్మరి శాలివాహన సంఘం, ఆటో యూనియన్ నాయకులు, పెట్రోల్ బంకుల కార్మికులు, విద్యాసంస్థల నిర్వాహకులు, విద్యార్థులు పెద్దఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు పౌరాణిక వేష ధారణలలో ట్రాక్టర్లలో ర్యాలీగా వచ్చారు. కురుబ సంఘం ఆధ్వర్యంలో పాతూరు కనకదాస విగ్రహం నుంచి నగరం మొత్తం ర్యాలీ చేపట్టారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు, ఎమ్మెల్యే బీకే పార్థసారథి, మాజీ మేయర్ రాగే పరశురాం తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో హేమసాగర్ మద్దతు తెలిపారు. హౌసింగ్ ఉద్యోగులు మోకాళ్లపై ర్యాలీ చేశారు. సప్తగిరి సర్కిల్, టవర్‌క్లాక్, సాయినగర్, ఆర్ట్స్ కళాశాల ఎదురుగా రోడ్లపై సమైక్యవాదులు వంటా-వార్పు చేపట్టారు. స్థానిక కోర్టు రోడ్డులో ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి చేదు అనుభవం ఎదురైంది. అదే సమయంలో ర్యాలీగా వచ్చిన న్యాయవాదులు...‘పార్థసారథి గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. వారికి సర్దిచెప్పడానికి ఎమ్మెల్యే ఎంత ప్రయత్నించినా వినకపోవడంతో అనుచరులతో కలసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరాయి.
సమైక్యాంధ్రకు జైకొట్టిన ఎస్కేయూ వీసీ
విద్యార్థులు, బీసీ సంఘాల నాయకులు ఎస్కే యూనివర్సిటీ ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఎస్కేయూ వైస్‌చాన్సలర్ రామకృష్ణారెడ్డి అక్కడికొచ్చి రాస్తారోకో విరమించాలని కోరారు. అందుకు వారు ససేమిరా అన్నారు. ఉద్యమం చేస్తున్న విద్యార్థులకు నీడ లేకుండా చేస్తున్నారని, వెంటనే హాస్టళ్లు తెరవాలని వీసీతో వాగ్వాదానికి దిగారు. రెండు రోజుల్లో హాస్టళ్లు తెరుస్తామని ఆయన హామీ వచ్చారు. వీసీతో ‘జై..సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేయించారు.
కళ్యాణదుర్గంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మంత్రి రఘువీరారెడ్డి ఇంటిని సమైక్య వాదులు ముట్టడించారు. సోనియాగాంధీ డౌన్‌డౌన్ అని జేఏసీ నాయకులు నినాదాలు చేయగా.. అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు సోనియా జిందాబాద్ అని నినదించారు. దీంతో ఇరువర్గాల మధ్య కాసేపు తోపులాట జరిగింది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. రాయదుర్గంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రోడ్డుపై నిద్రపోయి బజారు నిద్ర కార్యక్రమాన్ని చేశారు. సమైక్యాంధ్ర కోసం నిరంతరం ఆందోళనలు చేయాలని.. అందుకు తన మద్దతు ఉంటుందని తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి సమైక్యవాదులకు సూచించారు. రాష్ట్ర విభజనను తట్టుకోలేక జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. తెలంగాణకు అనుకూలంగా టీవీల్లో వార్తలు వస్తుండటం చూసి గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు.