సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : అతిగా మద్యం సేవించి షార్‌లోని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సెక్టార్-ఏలో ఎస్సైగా పనిచేస్తున్న యుకే తిమ్మయ్య (60) మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణంలోని కచ్చేరివీధిలోని కృష్ణాలాడ్జిలో శనివారం జరిగింది. తిమ్మయ్య మృతి చెందిన విషయాన్ని గుర్తించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో ట్రైనీ డీఎస్పీ జే కులశేఖర్ మృతదేహాన్ని పరిశీలించారు. గదిలోని అతని బ్యాగ్‌ను పరిశీలించగా సీఐఎస్‌ఎఫ్ ఎస్సైగా గుర్తించి షార్ సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ శ్రీధర్‌కు సమాచారం అందించారు. కమాండెంట్, ఇతర సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది మృతదేహాన్ని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కథనం మేరకు..
కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కూర్గ్ జిల్లా హమ్మత్ గ్రామానికి చెందిన యూకే తిమ్మయ్య షార్ కేంద్రం భద్రతా దళంలో ఎస్సైగా పని చేస్తున్నారు. మరో అయిదారు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. కుటుంబ విభేదాలతో భార్యకు దూరంగా షార్‌లోనే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నాడు.
గతనెల 28 నుంచి 31 వరకు ఆరోగ్యం సరిగా లేదని విధులకు సెలవు పెట్టారు. ఈ నెల ఒకటిన కాలు వాచిందని షార్ అసుపత్రిలో వైద్యం చేయించుకున్నాడు. వాస్తవంగా ఈనెల 1న విధుల్లో చేరాల్సి ఉండగా రెండు రోజుల నుంచి లాడ్జిలో రూం తీసుకుని మద్యం సేవిస్తూనే ఉన్నాడు. లాడ్జి సిబ్బంది వద్దని వారించినా మాట వినకుండా అతిగా మద్యం సేవించాడని తెలిపారు. మైకంలో కాలు జారిపడిపోయాడా! గొంతు ఎండుకు పోయి చనిపోయాడా! అనే విషయం పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. షార్ భద్రతా సిబ్బంది కమాండెంట్ మృతుడి బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అతిగా మద్యం తాగి సీఐఎస్‌ఎఫ్ ఎస్సై మృతి
Published Sun, Jan 5 2014 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement