సాక్షి, కర్నూలు: ‘‘అసాంఘిక శక్తులను వదిలే ప్రసక్తే లేదు. పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం లభిస్తుందనే భావన కలిగించేలా పోలీసులు తమ విధులు నిర్వర్తించాలి. ఆ దిశగా ప్రయత్నాలు చేపడుతున్నా. విధి నిర్వహణలో రాజకీయ జోక్యానికి తావులేకుండా చూస్తున్నా. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే సిబ్బందికి రక్షణగా నిలుస్తా. తోక జాడించే సిబ్బందిపై నిఘా కొనసాగుతుంది.
ముఖ్యంగా మహిళలపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. కర్నూలు నగరంలో హైదరాబాద్ తరహా పోలీసు హెల్ప్ కంట్రోల్ రూమ్స్‌ను అమల్లోకి తీసుకురానున్నాం’’ అని జిల్లా ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామిరెడ్డి అన్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా.. ఈ ఏడాది చోటు చేసుకున్న ఘటనలు, వాటిపై తీసుకుంటున్న చర్యలు, వ్యూహాలపై శనివారం ‘సాక్షి’ ఎస్పీతో ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలివి..
సాక్షి: మహిళలపై దాడులు అధికమయ్యాయి. వారికి ధైర్యం, భరోసా కల్పించడంతో పాటు నేరాల అదుపునకు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు?
ఎస్పీ: మహిళలపై దాడుల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాం. అన్నివేళల వారికి అందుబాటులో ఉంటాం. దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవు. నిందితుల్ని దోషులుగా నిరూపించేందుకు.. ఆధారాల సేకరణ తదితర అంశాలపై నిక్కచ్చిగా వ్యవహరిస్తాం.
సాక్షి: మహిళలపై దాడులు, ఇతర ఘటనలకు ఎక్కువ శాతం ఆటోవాలాలే కారణమని తెలుస్తోంది. మీరేమంటారు?
ఎస్పీ: ఆటోవాలాలపై ఓ కన్నేసి ఉంచాం. ఆర్టీఏ అధికారులతో కలిసి సంయుక్తంగా చర్యలు చేపడుతున్నాం. జనవరి 1 నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టబోతున్నాం. ఆటోల్లోని సౌండ్ సిస్టం బాక్స్‌లను తొలగించడంతో పాటు.. వాటి వెనుకాల ప్రకటనల పోస్టర్లను, స్టిక్కర్లను అతికించరాదని ఆదేశించాం. ఆటోల్లో ఎలాంటి మారణాయుధాలు ఉన్నా జరిమానా విధించడంతో పాటు సీజ్ చేస్తాం. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అమలు చేస్తున్న పోలీసు హెల్ప్ కంట్రోల్ రూమ్స్‌ను నగర పోలీసులు, రైల్వే పోలీసుల సహకారంతో కర్నూలులోనూ ఏర్పాటు చేయబోతున్నాం. బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో ఈ పద్ధతిని అమల్లోకి తీసుకొస్తున్నాం. ఈ విధానంతో ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల వివరాలు, వారి ఫోన్ నంబర్లను పోలీసు సిబ్బంది సేకరిస్తారు. తద్వారా ఆటోవాలాలు చార్జీ ఎంత వసూలు చేస్తున్నారు? ప్రయాణికులు సురక్షితంగా ఇళ్లకు చేరారా? అనే వివరాలను పోలీసులు తెలుసుకుంటారు.
సాక్షి: కొందరు పోలీసు అధికారులు రాజకీయ నేతలకు తలొగ్గి పనిచేస్తున్నారు. ఆ ప్రభావం కేసులపై ఉంటోంది. వీరి పట్ల మీ వైఖరి?
ఎస్పీ: కొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్లు వాస్తవమే. అయితే న్యాయబద్ధంగా పని చేయాలని సిబ్బందికి సూచిస్తున్నాం. మితిమీరితే బదిలీ చేయడానికీ వెనుకాడబోం. అప్పుడు రాజకీయ నాయకులు చెప్పినా వినే ప్రసక్తే లేదు. వృత్తి పట్ల నిబద్ధతతో పని చేసే సిబ్బందికి అండగా ఉంటా. నేతల అండదండలు ఉంటేనే మంచి స్థానాల్లో విధులు నిర్వహించవచ్చనుకుంటున్న అధికారులపై ప్రత్యేక దృష్టి సారించాం. పనితీరు ఆధారంగా వీరిపై చర్యలు చేపడతాం.
సాక్షి: జిల్లాలో మీ మార్కు పోలిసింగ్ ఏలా ఉండబోతోంది?
ఎస్పీ: పోలిసింగ్ ఓ వ్యక్తి మీద ఆధారపడకూడదు. వ్యవస్థకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా పోలీసులు పరిశోధన ప్రమాణాలు పెంచుకోవాలి. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో గౌరవప్రదంగా వ్యవహరించేలా.. అసాంఘిక శక్తులే మా శత్రువులని భావించేలా పోలిసింగ్‌ను తీర్చిదిద్దుతా. జిల్లాలో ఫ్యాక్షన్ నేపథ్యం కలిగిన వారిపై ఎప్పుడూ ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఎన్నికల నేపథ్యంలో వారి కదలికలను నిరంతరం పరిశీలిస్తుంటాం. ఫ్యాక్షనిస్టులకు, రౌడీషీటర్లకు తరచూ కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తాం.
సాక్షి: పోలీసుల సంక్షేమం.. వారి పిల్లల కెరీర్ గెడైన్స్‌పై మీ ప్లానింగ్?
ఎస్పీ: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటేనే.. కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. పోలీసులందరికీ హౌసింగ్ ప్లాట్లు ఇచ్చే అంశం సుప్రీం కోర్టులో ఉన్నందున జాప్యం జరుగుతోంది. ప్రయాణ భత్యం(టీఏ) రూ.3.70 కోట్లు అందజేసేందుకు ఉన్నతాధికారులతో చర్చించా. పోలీసుల పిల్లలకు కేరీర్ గెడైన్స్‌పై ప్రణాళిక రూపొందించాం. ఏప్రిల్, మే నెలల్లో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉంటుంది.
సాక్షి: దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లను అరికట్టేందుకు
మీ వ్యూహం?
ఎస్పీ: సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో జిల్లాకు వచ్చిన అదనపు బలగాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశాం. గత రెండు నెలలుగా చైన్‌స్నాచింగ్ కేసులు 8 మాత్రమే నమోదయ్యాయి. పాత నేరస్తుల కన్నా.. వ్యసనాలకు లోనవుతున్న విద్యార్థుల వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల పలువుర్ని అరెస్టు చేయడంతో ఈ తరహా నేరాలు తగ్గుముఖం పట్టాయి.
సాక్షి: మట్కా, పేకాట నియంత్రణకు చేపట్టిన చర్యలేంటి?
ఎస్పీ: మట్కా, పేకాటతో ఎన్నో కుంటుంబాలు నష్టపోతున్నాయి. సబ్ డివిజన్ల పరిధిలో నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకున్నాం. వీటి వెనుక ఉండే ఎలాంటి శక్తులను వదలబోం.
అసాంఘిక శక్తుల ఆటకట్టిస్తా
Published Sun, Dec 29 2013 5:11 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement