దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్‌కు అంతా ఓకే..
అనుమతులొచ్చేశాయ్..
రెండో డిజైన్ వైపే మొగ్గు
భవానీపురం లారీస్టాండ్ నుంచి రాజీవ్‌గాంధీ పార్కు వరకు..
రూ.250 కోట్లతో నిర్మాణం
ఎంపీ కేశినేని నాని ప్రకటన
ప్రతిపాదించిన రెండో డిజైన్ మేరకు 4.8 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణం ఉంటుందని, భవానీపురం లారీస్టాండ్ వద్ద ప్రారంభమై కార్పొరేషన్ కార్యాలయం, రాజీవ్‌గాంధీ పార్కు సమీపం వరకు డిజైన్ చేశామని నాని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రైల్వేబ్రిడ్జి, రైల్వే అనుమతులకు కూడా ఎటువంటి ఆటంకాలు లేవని పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ పార్కు నుంచి కనకదుర్గ వారధి వరకు డబుల్ లైన్ రోడ్డు నిర్మాణం చేపట్టడం వల్ల దుర్గగుడి వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నాని వివరించారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన గెజిట్ పత్రం కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి 17వ తేదీనే వచ్చిందని తెలిపారు.
దీంతో సంబంధిత జాతీయ రహదారి శాఖ చీఫ్ ఇంజినీర్, నేషనల్ హైవే అథారిటీ వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని పేర్కొన్నారు. అలాగే, ఈనెల 30వ తేదీన ఆర్ అండ్ బీ (హైదరాబాద్) చీఫ్ ఇంజినీర్ నుంచి ఆర్ అండ్ బీ ఎన్‌హెచ్ విజయవాడ సర్కిల్ ఎస్‌ఈకి, నేషనల్ హైవే అథారిటీ విజయవాడ వారికి ఫ్లైఓవర్ పనులకు సంబంధించిన ఇన్‌వెంటరీ వివరాలను పంపించమని ఉత్తర్వులు జారీచేస్తూ జాతీయ రహదారి విభాగం చీఫ్ ఇంజినీర్ ఆదేశించారని తెలిపారు. త్వరలోనే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ప్రారంభించి నగర ప్రజల చిరకాల కోరిక తీర్చుతామని నాని హామీ ఇచ్చారు.
సాయిల్ టెస్ట్ తరువాతే శంకుస్థాపన
ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఆర్ అండ్ బీ విభాగమే చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. నిర్మాణం, డబుల్ లేన్‌కు అయ్యే సుమారు రూ.250 కోట్ల అంచనా వ్యయాన్ని మాత్రం కేంద్రమే భరించనుంది. ప్రస్తుతం అనుమతులు మంజూరైన రెండో డిజైన్‌కు సంబంధించి డీపీఆర్‌కు టెండర్లు పిలుస్తున్నారు. అది పూర్తి కాగానే, ఇంజినీర్లు సాయిల్ టెస్ట్ చేసిన మీదట ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.