మాజీ మావోయిస్టు రాములు హత్య | Ex. Moist Konapuri Ramulu shot dead | Sakshi
Sakshi News home page

మాజీ మావోయిస్టు రాములు హత్య

Published Mon, May 12 2014 1:05 AM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM

మాజీ మావోయిస్టు రాములు హత్య - Sakshi

మాజీ మావోయిస్టు రాములు హత్య

  •  నల్లగొండలో దుండగుల దాడి 
  •  రాములుపైకి ఆరు  రౌండ్ల కాల్పులు, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
  •  పెళ్లికి హాజరైన రాములు..ఫంక్షన్ హాల్ వద్దే దారుణం
  •  నయీం ముఠాపైనే అనుమానాలు.. 
  •  మృతుడు మాజీ మావోయిస్టు  అగ్రనేత సాంబశివుడి సోదరుడు, టీఆర్‌ఎస్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు
  •  
     సాక్షి, నల్లగొండ: మాజీ మావోయిస్టు, టీఆర్‌ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు కొనపురి రాములు(40) దారుణ హత్యకు గురయ్యారు. మావోయిస్టు దివంగత అగ్రనేత సాంబశివుడు సోదరుడు కూడా అయిన రాములు.. ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆదివారం నల్లగొండకు రావడంతో దుండగులు పథకం ప్రకారం హత్య చేశారు. సంచలనం సృష్టించిన ఈ హత్యోదంతం ఉదయం 11.50 నిమిషాలకు జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పట్టణ శివారు రాంనగర్ సమీపంలోని ఎం.ఎ.బేగ్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు కొలగాని పర్వతాలు కూతురి వివాహానికి రాములు హాజరయ్యారు. వేడుకకు హాజరైన ప్రముఖులతో మాట్లాడుతూ అరగంట పాటు అక్కడే గడిపారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించి బయటకు వచ్చారు. 
     
     ఫంక్షన్ హాల్ ప్రవేశ ద్వారం వద్దే మాటువేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా రాములుపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన రాములును నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు విడిచారు. 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న ఆరుగురు ఆగంతకులు ఈ హత్యలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాడి సమయంలో రాములుకు సెక్యూరిటీగా ఉన్న ఇద్దరు గన్‌మన్ల చేతులను నలుగురు గట్టిగా వెనక్కి పట్టుకున్నారు. మరో ఇద్దరు వ్యక్తులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. 
     
     దీంతో రెండు బుల్లెట్లు రాములు తలలోకి, ఛాతీలోకి దూసుకెళ్లాయి. దుండగులు కారంపొడి చల్లడంతో ప్రతిదాడి చేయలేకపోయామని గన్‌మెన్లు ఆ తర్వాత చెప్పారు. కాల్పులు జరిపిన వెంటనే ఫంక్షన్ హాల్ వెనక వైపున్న గోడ దూకి నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిలో దుండగులు పారిపోయారు. ఘటన అనంతరం తేరుకున్న గన్‌మెన్లు రాములును ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో ఆయన చనిపోయారు. మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయానికి తీసుకువచ్చి కొద్దిసేపు ఉంచారు. 
     
     పోలీసుల అదుపులో గన్‌మెన్లు
     రాములుకు సెక్యూరిటీగా ఉన్న ఇద్దరు గన్‌మెన్లను జిల్లా అదనపు ఎస్పీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వారిద్దరినీ విచారిస్తున్నట్లు తెలిసింది. మావోయిస్టు మాజీ నేత కొనపురి అయిలయ్య అలియాస్ సాంబశివుడికి, మరో మాజీ నక్సలైట్ నయీంకు మధ్య శతృత్వం ఉంది. సాంబశివుడి హత్యలో నయీం ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మిగతా నిందితులను అరెస్టు చేసిన పోలీసులు నయీంను మాత్రం అరెస్టు చేయలేకపోయారు. మావోయిస్టుల కదలికలపై అతను పోలీసు ఇన్‌ఫార్మర్‌గా పనిచేసిన విషయం బహిరంగ రహస్యమే. సాంబశివుడికి సోదరుడైన రాములు హత్యలో పాల్గొన్నది కూడా నయీం ముఠా సభ్యులేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
     
     రెండుసార్లు కుట్ర భగ్నం
     మూడేళ్ల కిందట అప్పుడప్పుడే టీఆర్‌ఎస్ నాయకునిగా ఎదుగుతున్న కొనపురి అయిలయ్య అలియాస్ సాంబశివుడిని దారికాచి హత్య చేశారు. ఈ సంఘటన తర్వాత సాంబశివుని సోదరుడు కొనపురి రాములు హత్యకు పథకం రచించారు. చౌటుప్పల్‌లో ఓసారి, భూదాన్‌పోచంపల్లిలో మరోసారి ఆయన హత్యకు పన్నిన కుట్రలను పోలీసులు భగ్నం చేశారు. నయీం ముఠా నుంచి తనకు ప్రాణ హాని ఉందని రాములు అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించారు. మొదట గన్‌మెన్లను కేటాయించిన ప్రభుత్వం ఆ తర్వాత వారిని తొలగించడంతో కోర్టు ద్వారా తిరిగి గన్‌మెన్ల రక్షణ పొందారు. ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్లతో పాటు, ఏ స్టేషన్ పరిధిలో పర్యటిస్తే, అక్కడి ఎస్‌ఐకి సమాచారమిచ్చి స్థానిక పోలీసుల రక్షణ కూడా తీసుకుంటున్నారు. ఇంత అప్రమత్తంగా ఉంటున్నా, పక్కా ప్రణాళికతో రాములును వెంటాడినట్లు కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలో ఆదివారం న్యూడెమొక్రసీ నాయకుని కూతురు వివాహంతో పాటు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి కూతురు వివాహ వేడుకలు జరిగాయి. ఈ రెండు పెళ్లిళ్లకు రాములు కచ్చితంగా హాజరవుతాడన్న సమాచారంతోనే దుండగులు తెగబడినట్లు విధితమవుతోంది. హత్య జరిగిన వివాహ వేడుక నుంచి రాములు టీఆర్‌ఎస్ నేత వివాహానికి హాజరు కావాల్సి ఉంది. దానికి టీఆర్‌ఎస్ అధినేత కే సీఆర్‌తో పాటు, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు పలువురు హాజరు కానుండడంతో ఆ వేడుక వద్ద పోలీసు బందోబస్తును పెంచారు. అక్కడ రాములును టార్గెట్ చేయడం సాధ్యం కాదని, మొదటి ఫంక్షన్ హాలునే ఎంచుకున్నట్లు పోలీసు వర్గాలు విశ్లేషించాయి.
     ఇది పోలీసుల పనే: రాములు కుటుంబ సభ్యులు
     ‘ఇది ముమ్మాటికీ పోలీసుల పనే. నయీంతో మాకు ఎటువంటి గొడవల్లేవు. నయీం ముఠా పేర నెపం నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. రాములు ఎక్కడికి వెళ్లినా కచ్చితంగా ఆ ప్రాంత పోలీసులకు సమాచారం ఇస్తున్నాడు. సమాచారం ఇవ్వలేదని నల్లగొండ పోలీసులు అనడం నిజం కాదు. పోలీసులే ఏదో దాస్తున్నారు. మాకు పోలీసులపైనే అనుమానాలున్నాయ’ని రాములు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, రాములును హత్యచేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 
     
     నయీం ముఠా పనే కావచ్చు
     రాములు హత్య నయీం ముఠా పనే కావచ్చు. రాములు ఎక్కడకి వెళ్లినా మాకు ముందస్తు సమాచారముండేది. ఎన్నికల్లో ఓటేసేందుకు కూడా బందోబస్తు కల్పించాం. కానీ ఆదివారం నల్లగొండకు వచ్చే సమాచారం మాకివ్వలేదు. సమీపంలోని ఏచూరి ఫంక్షన్ హాల్‌లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాం. రాములు సమాచారం తెలిసుంటే అక్కడా బందోబస్తు ఏర్పాటు చేసేవాళ్లం. సంఘటన స్థలం నుంచి ఒక తుపాకీ, పేలిన తూటాలను స్వాధీనం చేసుకున్నాం. క్లూస్‌టీంతో ఆధారాలు సేకరిస్తున్నాం. అగంతకులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం. నయీం కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. 
      - టి.ప్రభాకర్‌రావు, జిల్లా ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement