మంచిగా ఉంటూనే హైందవిని మట్టుపెట్టాడు.. | Ex-tenant naveen kumar who murdered Hyderabad techie haindavi arrested | Sakshi
Sakshi News home page

హైందవీ తన దారిన తాను వెళ్లి ఉంటే..

Published Mon, Jul 24 2017 8:23 AM | Last Updated on Wed, Jul 10 2019 2:44 PM

మంచిగా ఉంటూనే హైందవిని మట్టుపెట్టాడు.. - Sakshi

మంచిగా ఉంటూనే హైందవిని మట్టుపెట్టాడు..

► పరులతో జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు
► హైందవి హత్యతో ప్రొద్దుటూరులో భయాందోళనలు


ప్రొద్దుటూరు: అతను అద్దెకు ఉన్నది మూడు నెలలే. అయినా ఆ కుటుంబంతో బాగా చనువు ఏర్పడింది. ఈ కారణంగా అప్పుడప్పుడు ఇంట్లోకి వెళ్లేవాడు. మంచిగా ఉంటూనే అతను బీటెక్‌ విద్యార్థిని హైందవిని మట్టుపెట్టాడు. గోకుల్‌నగర్‌లో నివాసం ఉంటున్న జయప్రకాష్‌రెడ్డికి కుమార్తె హైందవి, కుమారుడు మౌనీశ్వరరెడ్డిలు ఉన్నారు. ఆయన లెక్చర్‌గా పని చేస్తుండగా, భార్య విజయలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. వారి కుమార్తె హైందవి 10 వరకూ ఉషోదయ హైస్కూల్, ఇంటర్‌ షిర్డిసాయి జూనియర్‌ కాలేజిలో చదువుకుంది. తర్వాత బీటెక్‌ ట్రిపుల్‌ఈ హైదరాబాద్‌లోని సీవీఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజిలో పూర్తి చేసింది.

మొదటి నుంచి హైందవికి క్లాస్‌లో మంచి మార్కులు వచ్చేవి. బాగా చదివి ఎప్పటికైనా ఉన్నతమైన ఉద్యోగం సాధిస్తానని తల్లిదండ్రులతో చెప్పేది. ఈ క్రమంలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదివేటప్పుడు కళాశాలలో నిర్వహించిన క్యాంపస్‌ సెలక‌్షన్లలో టీసీఎస్‌ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైంది. అయితే ఆ కంపెనీ నుంచి కాల్‌లెటర్‌ రాకపోవడంతో ఇంటిì వద్ద ఖాళీగా ఉండకుండా బ్యాంకు కోచింగ్‌కు వెళ్లేది. వృత్తి రీత్యా ఏనాడైనా విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుందని భావించిన హైందవి ఇటీవల పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంది. ఇంట్లో ఉంటే తల్లికి ఒక్క పని కూడా చేసే అవకాశం ఇవ్వదు. అంతా తానే చేస్తుంది.

తన దారిన తాను వెళ్లి ఉంటే..

తన స్కూటీ రోజూ మొరాయిస్తుండంతో రిపేరు చేయించేందుకు షెడ్డులో ఇచ్చింది. స్కూటీ తెచ్చుకునేందుకు హైందవి తండ్రి బైక్‌లో బజారులోకి వెళ్లింది. అప్పటికే స్కూటీ రిపేరు చేసి ఉండటంతో తీసుకొని నేరుగా ఇంటికి బయలుదేరింది. పెట్రోల్‌ అయిపోవడంతో నవీన్‌ కుమార్‌ దారిలో బైక్‌ నిలిపి ఆగి ఉన్నాడు. అదే దారిలో వెళ్తున్న హైందవి అతన్ని చూసి ఆగింది. పెట్రోల్‌ అయిపోవడంతో ఆగానని అతను చెప్పగా మానవత్వం చూపిన హైందవి తన స్కూటీలో కూర్చోపెట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్లింది. ఇంట్లో ఉన్న ఒక ఖాళీ బాటిల్‌ ఇచ్చి పెట్రోల్‌ తెచ్చుకోమని స్కూటీ తాళాలను అతనికి ఇచ్చింది. తమ కుటుంబంతో పరిచయం కారాణంగా హైందవి అతనికి సాయం చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంది. అలా కాకుండా తన దారిన తాను వెళ్లి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని పలువురు అంటున్నారు.

పరులతో జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు

పరాయి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంటి పక్కన ఉన్న కారణంగా చనువు ఉంటుందని, అలాంటి వారికి ఎక్కువ చనువు ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలని అంటున్నారు. కొందరు మనుసులో ఏదో ఆలోచన పెట్టుకొని పరిచయం పెంచుకునేవాళ్లు కూడా లేకపోలేదని పోలీసులు పేర్కొంటున్నారు. మంచితనం అనే ముసుగు కప్పుకొని నిండా ముంచేవాళ్లు ఇటీవల కాలంలో ఎక్కువగా ఉన్నారని, ఇంటా బయట జాగ్రత్తగా ఉంటే ఎలాంటి నేరాలు జరగడానికి అస్కారం ఉండదని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

హైందవి హత్యతో ప్రొద్దుటూరులో భయాందోళనలు

హైందవి హత్య జరిగిన మరు క్షణం నుంచి ప్రొద్దుటూరు ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇంట్లోకి చొరబడి గొంతులు కోస్తుండటంతో పట్టణ వాసుల్లో అలజడి మొదలైంది. ఇప్పటి వరకూ బయటికి వెళ్లేటప్పుడు మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేవారు. ఇళ్లలో ఉన్న వాళ్లు కూడా పూర్తి రక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పట్టణంలోనే గాక శివారు ప్రాంతాల్లో పోలీసులు రాత్రి గస్తీ ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement