కర్నూలు(జిల్లా పరిషత్): ఇంటర్‌మీడియట్ పరీక్ష కేంద్రాల్లో తప్పనిసరిగా బేంచీలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు జారీ చేసిన ఆదేశాలు బేఖాతర్ అయ్యాయి. బుధవారం జిల్లాలో చాలా పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు నేలపైనే పరీక్ష రాయాల్సి వచ్చింది. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా సుదూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు 7 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లా కేంద్రమైన కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్ కేంద్రాల్లోనూ పలు కేంద్రాల్లో ఈ పరిస్థితి కనిపించింది. స్థానికంగా ఉన్న విద్యార్థులు సైతం 8 గంటల నుంచి పరీక్షా కేంద్రానికి చేరుకోవడం ప్రారంభించారు.
కొందరు విద్యార్థులు మాత్రమే 9 గంటల తర్వాత పది నిమిషాలు ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకున్నా అనుమతించారు. జిల్లా మొత్తంగా 110 కేంద్రాల్లో బుధవారం మొదటిరోజు జరిగిన పరీక్షకు 38,804 మంది విద్యార్థులకు గాను 37,061 మంది హాజరుకాగా, 1,743 మంది గైర్హాజరయ్యారు. కర్నూలు నగరంలోని పలు కేంద్రాలను ఆర్‌ఐవో సుబ్రహ్మణ్యేశ్వరరావు పరిశీలించారు. ఈసారి ప్రయోగాత్మకంగా ఆళ్లగడ్డ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా నీడలో పరీక్షలు నిర్వహించారు. కాగా, ఇంటర్ మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయని ఆర్‌ఐవో తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, సమస్యలు ఉత్పన్నం కాలేదని చెప్పారు.
నేలపైనే రాతలు
ఇంటర్ మీడియట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్పినా పలు కేంద్రాల్లో డెస్క్‌ల సమస్య తీవ్రంగా ఉంది. కర్నూలు నగరంలోని బాలశివ జూనియర్ కళాశాలతో పాటు పెద్దపాడులోని మోడల్ స్కూల్, కోడుమూరులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ఆదోనిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, కోసిగి, మంత్రాలయం, కౌతాళంలలోని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు నేలపైనే పరీక్షలు రాశారు.
రావూస్ కాలేజీలో ఆందోళన
పరీక్షా కేంద్రంలోకి ప్యాడ్‌లు అనుమతించ కపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నంద్యాలలోని రావూస్ జూనియర్ కళాశాల వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ కళాశాలలో ప్యాడ్‌తో కూడిన కుర్చీలు ఉండటంతో పరీక్షల నిర్వహణాధికారులు విద్యార్థులకు ప్రత్యేకంగా ప్యాడ్‌లు తీసుకురాకూడదని ఆంక్షలు విధించారు. తాము ప్యాడ్‌లపై రాసే అలవాటు ఉందని, అకస్మాత్తుగా ప్యాడ్‌లు వద్దని చెబితే ఎలా రాయగలమని నిలదీశారు. వీరికి మద్దతుగా తల్లిదండ్రులు సైతం ఆందోళన చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవ సద్దుమణించారు. గురువారం నుంచైనా విద్యార్థులకు ప్యాడ్‌లు అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. కోడుమూరు మోడల్ స్కూల్‌కు వెళ్లేందుకు రహదారి సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. రహదారి వెంట గుంతలు, ముళ్లకంపలు ఉండటంతో ఆటోలు సైతం వెళ్లలేని పరిస్థితి. దీంతో ఒకటిన్నర కిలోమీటర్ దూరం నడిచి వెళ్లి పరీక్ష రాయాల్సి వచ్చింది.
నేలబారు పరీక్షలు
Published Thu, Mar 12 2015 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM
Advertisement
Advertisement