♦ గ్రామస్తులు, పోలీసుల రాకతో దుండగుల పరారీ
♦ జేసీబీతో పాటు రెండు కార్లలో వచ్చిన పదిమంది
గిద్దలూరు : గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలకు యత్నిస్తుండగా గ్రామస్తులు, పోలీసుల ప్రవేశంతో పరారయ్యారు. ఈ సంఘటన మండలంలోని నరవ, బయనపల్లె గ్రామాల మధ్య నందికుంట సమీపంలో గురువారం రాత్రి జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. నంది కుంట సమీపంలోని పొలంలో కొన్నేళ్లుగా రెండు పెద్ద రాళ్లున్నాయి. వాటిపై సంస్కృతంలో అక్షరాలు చెక్కి ఉన్నాయి. గమనించిన దుండగులు రాళ్ల కింద గుప్తనిధులున్నాయని ఆశపడ్డారు. అందులో భాగంగా గుప్తనిధుల కోసం అక్కడ తవ్వేందుకు రెండు కార్లలో పది మంది చేరుకున్నారు. రాళ్లను పక్కకు తొలగించి తవ్వకాలకు జేసీబీని తెచ్చుకున్నారు.
రాళ్లు ఉన్న ప్రదేశంలో పూజలు చేస్తే గ్రామస్తులకు కనిపిస్తుందని గ్రహించిన దుండగులు.. పక్కనే ఉన్న కుంటను అడ్డుగా చేసుకుని కొంచెం దూరంగా పూజలకు జిల్లేడు కర్రలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ వంటివి సిద్ధం చేసుకున్నారు. వాహనాలన్నీ నరవ నుంచి రాత్రి 10 గంటల సమయంలో వెళ్లడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. కొందరు యువకులు సంఘటన స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ ఎక్కువ మందితో పాటు రెండు కార్లు, జేసీబీని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
సీఐ ఎస్‌ఎండీ ఫిరోజ్, ఏఎస్సై రఫీయుద్దీన్‌లు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి వస్తుండగా దుండగులు జేసీబీ, కార్లతో సహా బయనపల్లె రోడ్డులో పారిపోయారు. సంఘటన స్థలంలో జిల్లేడు కర్రలు, నిమ్మకాయలను సీఐ పరిశీలించారు. నిందితులు గిద్దలూరు ప్రాంతానికి చెందిన వారుగా అనుమానిస్తున్నారు. గతేడాది పాపులవీడు, తురిమెళ్ల కనక సురభేశ్వర కోన ఆలయం వద్ద దుండగులు అనేక పర్యాయాలు తవ్వకాలు జరిపారు. రాచర్ల మండలం గుడిమెట్ట మౌళాలి స్వామి దర్గాలో తవ్వకాలు జరిపి స్వామి ప్రతిమ తీసుకెళ్లారు. గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడే వారిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
గుప్తనిధుల కోసం తవ్వకాలు
Published Sat, Jul 18 2015 4:04 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement