సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
ఉత్కంఠకు ప్రభుత్వం తెరదించింది. శివార్లలోని 15 పంచాయతీలను హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న ఈ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని భావించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనుకున్న తరుణంలో అనూహ్యంగా ప్రభుత్వం గ్రేటర్‌లో పంచాయతీలను కలుపుతూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. రాజధానిని ఆనుకొని ఉన్న 36 గ్రామ పంచాయతీలను నగరీకరణ నేపథ్యంలో గ్రేటర్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదనలు కొన్నాళ్లుగా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అయితే, జీహెచ్‌ఎంసీలో గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పలువురు కోర్టుకెక్కడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ కేసుల్లో చాలావరకు హైకోర్టు కొట్టివేయడం ప్రభుత్వానికి అనుకూలంగా మారింది.
ఈ తరుణంలో ఇటీవల 20 పంచాయతీలను గ్రేటర్‌లో కలుపుతూ... మిగతా 16 పంచాయతీలకు ఎన్నికల నగారా మోగించింది. ఈ నెల 21న ఎన్నికల ముహూర్తాన్ని ఖరారు చేసిన ఎలక్షన్ కమిషన్... 6వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. నగరానికి చేరువలో ఉన్న పంచాయతీలు పక్కనపెట్టి.. దూరంగా ఉన్న పల్లెలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేశారనే విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఎన్నికలతో పాలకవర్గాలు కొలువుదీరితే ఐదేళ్లవరకు ఈ పంచాయతీలు గ్రేటర్‌లో కలపడం కుదరదని భావించే ఎన్నికల క్రతువుకు మరికొన్ని హడావుడిగా ప్రభుత్వం ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు విలీనంపై ఎలాంటి సంకేతాలివ్వని సర్కారు.. చివరి నిమిషంలో ఉత్తర్వులు జారీ చేయడం ఆశావహులను నైరాశ్యంలో పడేసింది.
మణికొండ మినహా..
వాస్తవానికి మణికొండలో అడ్డగోలుగా జరిగిన నిర్మాణాల నేపథ్యంలోనే శివారు పంచాయతీలను గ్రేటర్‌లో కలపాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. అనుమతుల్లేకుండా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నప్పటికీ నియంత్రించే సామర్థ్యం పంచాయతీలు లేకపోవడంతో వీటిని జీహెచ్‌ఎంసీ పరిధిలోకి తేవడమే ఉత్తమమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భావించారు. ఈ తరుణంలో కొన్నాళ్ల క్రితం అనుమతిలేని బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగి పలువురు మృత్యువాత పడడం ప్రభుత్వాన్ని ఆలోచింపజేసింది. ఈ క్రమంలోనే ఇబ్బడిముబ్బడిగా విస్తరించిన మణికొండను గ్రేటర్‌లో మిళితం చేయాలనే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గ్రేటర్‌లో కలిస్తే తమ ఆటలు సాగవని భావించిన కొందరు కోర్టుకెక్కి ‘స్టే’ పొందారు. తాజాగా మిగతా పంచాయతీల విషయంలో న్యాయస్థానం లైన్‌క్లియర్ చేసిన ప్పటికీ, మణికొండ విలీనంపై ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు. దీంతో ప్రతిపాదిత 35 పంచాయతీలు జీహెచ్‌ఎంసీలో కలిసినప్పటికీ, విలీన ప్రతిపాదనకు ఆజ్యంపోసిన మణికొండ మాత్రం విలీనం నుంచి తప్పించుకుంది. కాగా, రాజేంద్రనగర్, సరూర్‌నగర్ మండలాల్లోని గ్రామాలన్నీ నగరరూపు సంతరించుకున్నాయి. రాజేంద్రనగర్‌లోని మణికొండ మినహా మగతా గ్రామాలన్నీ గ్రేటర్ పరిధిలో చేరగా.. సరూర్‌నగర్‌లోని కొన్ని గ్రామాలు నగర పంచాయతీ (బడంగ్‌పేట్) పరిధిలో మరికొన్ని జీహెచ్‌ఎంసీలో కలిసిపోయాయి. దీంతో ఈ మండలాలను ఇక జిల్లా పరిషత్ జాబితా నుంచి తొలగించనున్నారు.
గ్రేటర్‌లో విలీనమైన పంచాయతీలు ఇవే..
రాజేంద్రనగర్ : గండిపేట్,
మంచిరేవుల, కోకాపేట్
శంషాబాద్ : శంషాబాద్ శామీర్‌పేట: జవహర్‌నగర్
కుత్బుల్లాపూర్ : ప్రగతినగర్, బాచుపల్లి,
కొంపల్లి, దూలపల్లి
ఘట్‌కేసర్ : బోడుప్పల్, మేడిపల్లి,
చెంగిచర్ల
కీసర : నాగారం, దమ్మాయిగూడ
మేడ్చల్ : గుండ్లపోచంపల్లి
ఎన్నికలకు బ్రేక్
గ్రేటర్‌లో పంచాయతీల విలీనంతో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు 15 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకూడదని కలెక్టర్‌ను ఆదేశించింది. నామినేషన్ల స్వీకరణ పర్వానికి కొన్ని గంటల ముందు పంచాయతీలను విలీనం చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేయడంతో డైలమాలోపడ్డ జిల్లా యంత్రాంగం... దీనిపై స్పష్టతను కోరుతూ ఈసీ అధికారులను సంప్రదించింది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియను పక్కనపెట్టాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను జారీచేసింది. కాగా, మణికొండ పంచాయతీకి మాత్రం యథావిధిగా ఈ నెల 21న ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
మణికొండ మినహా 15 పంచాయతీలు గ్రేటర్‌లో విలీనం
Published Fri, Sep 6 2013 2:05 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement