బాబు మాట తప్పితే కాంగ్రెస్ గతే | Except that now the Gate | Sakshi
Sakshi News home page

బాబు మాట తప్పితే కాంగ్రెస్ గతే

Published Sun, Jun 29 2014 3:29 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

బాబు మాట తప్పితే కాంగ్రెస్ గతే - Sakshi

బాబు మాట తప్పితే కాంగ్రెస్ గతే

కావలి: ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజావిశ్వాసాన్ని కోల్పోవటానికి చంద్రబాబుకు తక్కువ సమయమే పడుతుందని వైఎస్సార్‌సీపీ కేంద్రపాలకమండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి అధ్యక్షతన పట్టణంలోని ఆర్‌ఎస్సార్ కల్యాణమండపంలో శనివారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.
 
 ప్రజావిశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ లేనివిధంగా నామరూపాలు కోల్పోయి 44 ఎంపీ సీట్లకు పరిమితమైందని అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించిందన్నారు. ఫలితంగా ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారన్నారు. సోనియాగాంధీ పార్లమెంటులో వెనుక వరుస సీటులో కూర్చోవలసిన దుస్థితి ఆ పార్టీకి నెలకొందన్నారు. బాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులకు అర్జీలు ఇవ్వడం తప్ప ఎలాంటి నిధులను రాష్ట్రానికి తేలేకపోయారన్నారు.
 
  ఇచ్చిన హామీలను ఈసారైనా నిలుపుకుంటారని టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నారు. కష్టాల్లో ఉన్న రైతులు రుణాలు మాఫీ అవుతాయని భావించారన్నారు. ప్రలోభాలు పెట్టి తమ పార్టీ ఎంపీ ఎస్పీవెరైడ్డిని టీడీపీలో చేర్చుకున్నారన్నారు. వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్న నెల్లూరు జెడ్పీ, కార్పొరేషన్, కావలి, ఆత్మకూరు, గూడూరు మున్సిపాలిటీల్లోనూ  జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గందరగోళ వాతావరణాన్ని సృష్టించేలా పత్రికల్లో టీడీపీ నేతలు కథనాలు రాయిస్తున్నారన్నారు. అతి విశ్వాసం తమ పార్టీ ఓటమికి ఓ కారణమని చెప్పారు. మొత్తం ఓట్ల సరళిని చూస్తే రెండు పార్టీల మధ్య  5.4 లక్షల ఓట్ల తేడా మాత్రమే ఉందన్నారు. ఉపఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపొందిన సమయంలో వచ్చిన మెజారిటీ ఎంత ఉందో అన్ని ఓట్లు మాత్రమేనన్నారు.
 
 జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలను గెలవాల్సి ఉండగా, చిన్న తప్పిదాల కారణంగా ఉదయగిరి, కోవూరు, వెంకటగిరిల్లో ఓటమి చెందాల్సి వచ్చిందన్నారు. ఎన్నికలను డబ్బుమయం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కిందన్నారు. కోట్లాది రూపాయలను ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు చంద్రబాబు పంపి ఈ ఎన్నికల్లో గెలిచారన్నారు. పార్లమెంటు పరిధిలో ఏ వ్యక్తికైనా తాను పరిష్కరించగల సమస్య ఉంటే నేరుగా తనను కలవవచ్చని చెప్పారు. 2019 ఎన్నికల్లో తప్పనిసరిగా జగన్ సీఎం అవుతారన్నారు. అభివృద్ధిలో ప్రతాప్‌కుమార్‌రెడ్డికి అండగా ఉంటానన్నారు.
 
 అందరి సహకారంతో అభివృద్ధి :
 ప్రతాప్‌కుమార్‌రెడ్డి
 అందరి సహకారంతో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్దన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతానన్నారు. కావలి కాలువను ఆధునీకరించి రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చూడాలనేది తన లక్ష్యమన్నారు.ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. రామాయపట్నంకు పోర్టు తీసుకొచ్చేలా తన వంతు కృషి చేస్తానన్నారు.  
 
 దేశచరిత్రలో లేని విధంగా
 ఎన్నికలు: విష్ణు
 దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో గడిచిన మూడు నెలల్లో ఎన్నికలు జరిగాయని, అన్ని ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రామాయపట్నంలో పోర్టు వస్తే కావలి కనకపట్నం అవుతుందన్నారు. డబ్బుతో గెలవాలని బీద మస్తాన్‌రావు అనుకున్నాడని, ప్రజలు ప్రతాప్‌కుమార్‌రెడ్డికి అండగా నిలిచి ఎమ్మెల్యేను చేశారన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ అడిగే ప్రశ్నలకు ప్రతిపక్షం నుంచి అసెంబ్లీలో సమాధానం లేదన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ కార్యకర్తలు అధైర్యపడవద్దని, ఏ ప్రాంతంలో కార్యకర్తకు అన్యాయం జరిగినా ఏడుగురు ఎమ్మెల్యేలం అక్కడికి వచ్చి వారికి అండగా నిలుస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సహకారంతో జిల్లాను అభివృద్ధిపథంలో నిలుపుతామన్నారు. కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గోసల గోపాల్‌రెడ్డి, ముసునూరు పీఏసీఎస్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు పోనుగోటి శ్రీనివాసులరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు చీదెళ్ల కిషోర్ గుప్తా, దగదర్తి, బోగోలు మండలాల కన్వీనర్లు తూపిలి పెంచలయ్య, గోగుల వెంకయ్య, అల్లూరు మండల యువజన విభాగం అధ్యక్షుడు మన్నేమాల సుకుమార్‌రెడ్డి, కావలి రూరల్, బోగోలు, దగదర్తి జడ్పీటీసీ సభ్యులు సోమయ్యగారి పెంచలమ్మ, బాపట్ల కామేశ్వరి, దండా పద్మావతి, నెల్లూరు మాజీ కార్పొరేటర్ మదన్‌మోహన్‌రెడ్డి, నాయకులు కుందుర్తి శ్రీనివాసులు, రాంబాబు, అశోక్‌రెడ్డి, జంపాని రాఘవులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement