సెల్‌ఫోన్ దుకాణం యజమానిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ స్పెషల్ స్క్వాడ్
10 నకిలీ మద్యం మాఫియా గ్యాంగుల గుర్తింపు
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: నకిలీ మద్యం రాకెట్‌పై ‘సాక్షి’ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌తో ఎక్సైజ్ యంత్రాంగం కదిలింది. ఈ ఆపరేషన్‌తో మాఫియా గ్యాంగులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాయి. అధికారులు వారిని కలుగులోంచి బయటికి తెచ్చే పనిలో పడ్డారు. ‘మద్యం మార్కెట్‌పై మాఫియా దండయాత్ర’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనంలోని అంశాలపై ఎక్సైజ్ స్పెషల్ స్క్వాడ్ బృందాలు దృష్టి పెట్టాయి. నకిలీ మద్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి తెస్తున్న మాఫియా గ్యాంగుల కోసం ఈ బృందాలు గురువారం జల్లెడ పట్టాయి. ప్రతి మద్యం దుకాణంలో తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో మొత్తం 10 మాఫియా గ్యాంగులను గుర్తించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్‌నగర్ కేంద్రాలుగా, ఉత్తరాంధ్రలో విశాఖ కేంద్రంగా, కోస్తాలో నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాలు కేంద్రాలుగా మాఫియా గ్యాంగులు పనిచేస్తున్నాయని గుర్తించారు. విచారణ నిమిత్తం ఓ సెల్‌ఫోన్ దుకాణ యజమానిని స్పెషల్ స్క్వాడ్ అదుపులోనికి తీసుకుంది. అయితే ‘సాక్షి’ తన ఆపరేషన్ కోసం మాట్లాడిన మాఫియా గ్యాంగ్ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఈ గ్యాంగ్‌ను ఎవరు నడుపుతున్నారన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో నకిలీ మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న ఉప్పల్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించారు. స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడిన నాలుగు సెల్ ఫోన్ నంబర్లను విశ్లేషణ చేస్తున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ నదీం తెలిపారు.