లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి కోనేరు సెంటర్‌కు షాప్ తరలింపు
మసీదుకు 50 మీటర్ల దూరంలోనే ప్రభుత్వ వైన్ షాప్
మద్యం సిండికేట్‌కు అనుకూలంగా చక్రం తిప్పిన అమాత్యుని బంధువు
విజయవాడ: ఎక్సైజ్‌శాఖ మంత్రి అడ్డాలో అడ్డగోలు పంచాయితీ సాగుతోంది. అక్కడ నిబంధనలు పాటించరు. కావాల్సిన వారికి మేలు చేయటానికి నిబంధనలకు పూర్తిగా నీళ్లు వదిలేస్తున్నారు. గుడి, బడి నిబంధన పక్కన పెట్టి మరీ అడ్డగోలుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. పర్యవసానంగా విక్రయాలు జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వ వైన్ షాప్‌ను అక్కడి వ్యాపారుల కోసం వేరే సెంటర్‌కు మార్చివేశారు. మార్చిన సెంటర్‌లో పక్కనే మసీదు ఉన్నప్పటికి కనీసం పట్టించుకోకుండా షాపు ఏర్పాటు చేయటానికి సిద్ధం చేసి షాపు ఏర్పాటు చేసి మద్యం లోడ్లు దించటంతో స్థానికులు, ముస్లింలు ఆందోళణకు దిగటంతో వివాదంగా మారింది.
జిల్లాలో కేటాయించిన 33 ప్రభుత్వ దుకాణాల్లో భాగంగా మచిలీపట్నంలో ఒక ప్రభుత్వ వైన్ షాప్ ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. ఎక్కువ విక్రయాలు జరిగే ప్రాంతంలోనే వైన్ షాప్ పెట్టాలని ఎక్సైజ్ శాఖ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. కాగా, మచిలీపట్నం పట్టణంలో మద్యం విక్రయాలు ఎక్కువగా లక్ష్మీటాకీస్ సెంటర్‌లో జరగుతాయి.
ఇక్కడి ైవైన్‌షాపులు రోజుకు సగటున రూ.రెండు లక్షల వరకు విక్రయాలు సాగుతుంటాయి. ఈ ప్రాంతంలో ప్రభుత్వ వైన్ షాప్ ఏర్పాటు చేస్తే కనీసం సగటున రోజుకి రూ.లక్ష వరకు విక్రయాలు జరుగుతాయని ,శాఖకు ఎక్కువగా ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ భావించి అక్కడ ఏర్పాటుకు అంతా రంగం సిద్ధం చేసుకున్నారు. దీనిపై అక్కడి వైన్ షాపులు, బార్ల యజమానులు అమాత్యుని వ్యవహారాలు చూసే ఆయన సమీప బంధువును ఆశ్రయించారు. దీంతో సదరు బంధువు ఎక్సైజ్ అధికారులను పిలిచి మాట్లాడి షాపును వేరే చోట పెట్టాలని ఆదేశించారు. అది కొంత కష్టమని అధికారులు బదులిచ్చే క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో అక్కడి నుంచి షాపును కోనేరు సెంటర్‌లో ఏర్పాటు చేయాలని ఆదేశించటంతో అధికారులు చేసేదేమీలేక కోనేరు సెంటర్‌లో షాపును వెతికారు.
అయితే సదరు సెంటర్‌లో ఇప్పటికే 3 వైన్ షాపులు, 3 బార్లు ఉన్నాయి. అక్కడ ఒక్కొక్క షాపులో రోజుకి సగటున రూ.70 వేల నుంచి నుంచి రూ.లక్ష వరకు విక్రయాలు జరుగుతాయి. ఈ క్రమంలో అక్కడ షాపును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. శనివారం మద్యం నిల్వలు దించి షాపును ప్రారంభించటానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఏర్పాటు చేసిన షాపు మసీదుకు 50 మీటర్లు దూరంలోనే ఉంది. దీనికి ఎక్సైజ్ అధికారులు మాత్రం కొత్త వాదన వినిపిస్తున్నారు. వారి లెక్క ప్రకారం వంద మీటర్లు దూరం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ముస్లింలు, స్థానికులు, స్థానిక వ్యాపారులు షాపు ఏర్పాటు నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు.
ఎక్సైజ్ మంత్రి అడ్డాలో.. ప్రభుత్వ వైన్ షాప్ పంచాయితీ
Published Sat, Jul 4 2015 1:10 AM | Last Updated on Fri, Aug 17 2018 7:44 PM
Advertisement