ఎక్సైజ్ అధికారులపై ‘నీలిషికారీ’ల తిరుగుబాటు
► మహిళల రాళ్ల వర్షం
► దాడిలో ఇద్దరికి గాయాలు
► వాహనాల అద్దాలు ధ్వంసం
► టూటౌన్ స్టేషన్‌లో ఎక్సైజ్ అధికారుల ఫిర్యాదు
కర్నూలు: స్తానిక బంగారుపేటలోని సారా స్థావరంపై మంగళవారం రాత్రి రైడింగ్‌కు వెళ్లిన ఎక్సైజ్ పోలీసులకు నీలిషికారీల నుంచి తిరుగుబాటు ఎదురైంది. వాళ్లు రాళ్ల వర్షం కురిపించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ ఆర్.సుధాకర్, కానిస్టేబుల్ జగన్నాథం, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.డీటీఎఫ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో పాటు ఏఈఎస్ సుధాకర్, కర్నూలు ఎక్సైజ్ స్టేషన్ సీఐ పద్మావతి, డీటీఎఫ్ సీఐ కృష్ణకుమార్, ఎస్‌ఐలు హరికృష్ణ, కిశోర్‌కుమార్, పత్తికొండ, ఆలూరు సీఐలు చంద్రశేఖర్, మంజుల, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐలు రమణారెడ్డి, శ్రీరాములు, సుమారు 30 మంది పోలీసులు సారా స్థావరంపై తనిఖీలకు వెళ్లగా నీలిషికారీ మహిళలు వారిని చుట్టు ముట్టి గొడవకు దిగారు. ఈలోగా నీలిషికారీకి చెందిన శేఖర్ మద్యం సీసాను పోలీసులపై విసరడంతో ఉద్రిక్తత నెలకొంది. కొందరు మహిళలు కూడా రాళ్లు విసరడంతో పోలీసులు అడ్డదారిలో రోడ్డుపైకి రావాల్సి వచ్చింది.
తోపులాటలో షికారి మహిళ తలకు గాయాలు కావడంతో వారు మరింత రెచ్చిపోయారు. ఎక్సైజ్ పోలీసులపై రాళ్లు విసురుతూ రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. కొంతమంది నీలిషికారీ యువకులు ఎక్సైజ్ వాహనాలపై రాళ్లతో దాడి చేయడంతో వాటి అద్దాలు ధ్వంసమయ్యాయి. కొంతమంది కానిస్టేబుళ్లకు కూడా రాళ్లు తగిలి గాయాలయ్యాయి. దీంతో వెనక్కు తగ్గిన ఎక్సైజ్ పోలీసులు రెండో పట్టణ పోలీసుల సాయంతో మరోసారి రైడింగ్‌కు వెళ్లారు. అప్పుడు కూడా షికారీ మహిళలంతా చుట్టుముట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు గంటల పాటు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. షికారీ మహిళలు శాపనార్థాలు పెడుతుం డడంతో చేసేదేమీ లేక పోలీసులు అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే మహిళలు మాత్రం గంటకు పైగా రోడ్డుపైనే ఆందోళన కొనసాగించారు. ఇందుకు సంబంధించి ఏఈఎస్ సుధాకర్, స్టేషన్ ఎస్‌ఐ, సిబ్బంది రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.