సారాజ్యం | Excise officials blasted brewery | Sakshi
Sakshi News home page

సారాజ్యం

Published Sat, Nov 21 2015 12:37 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

Excise officials blasted brewery

పల్నాడులో గురువారం ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేసిన సారా బట్టీ
విక్రయ కేంద్రాలుగా పల్నాడు పల్లెలు

 
పల్నాడు ప్రాంతాన్ని సారా రక్కసి పట్టి పీడిస్తోంది. ఇక్కడి పల్లెలు సారా విక్రయానికి కేంద్రాలుగా మారాయి.  గతంలో గుడుంబా వ్యాపారం మూడు ప్యాకెట్‌లు ఆరు సీసాలుగా సాగేది. మద్యం దుకాణాలు పెరగడం, వాటిలో చీప్ లిక్కర్ అందుబాటులోకి రావడంతో సారాకు డిమాండ్ తగ్గింది. రెండేళ్లుగా మద్యం ధరలు పెరిగాయి. పంటలు సరిగా పండక ప్రజల చేతిలో డబ్బూ లేదు. దీంతో చౌకగా లభించే సారాకు గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ  గిరాకీ ఏర్పడింది.  మాచర్ల, గురజాల, వినుకొండ నియోజకవర్గాల్లో విక్రయాలు జోరందుకున్నాయి.          
 
గుంటూరు: మద్యం దుకాణాల్లో అతి తక్కువ ధర ఉన్న చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్‌ను రూ. 70కు  అమ్ముతున్నారు. బట్టీల వద్ద సారా ప్యాకెట్ రూ. 10 నుంచి రూ. 15 లకు దొరుకుతోంది. దీంతో కార్మికులు, కూలీలు అధికంగా సారావైపే మొగ్గు చూపుతున్నారు.  
 జిల్లాలోని  మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో సారా అమ్మకాలు ఎక్కువగా సాగుతున్నాయి. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నుంచి ఈ నియోజకవర్గాలకు యథేచ్ఛగా రవాణా అవుతోంది. తెలంగాణాకు సరిహద్దు జిల్లాగా ఉండటంతోపాటు నల్గొండ, గుంటూరు జిల్లాలకు మధ్య కృష్ణా నది ప్రవహిస్తుండటంతో నాటు పడవల ద్వారా సారాను దర్జాగా జిల్లాకు చేరుస్తున్నారు.

 దాడులు చేసినా ఫలితం శూన్యం...
 పల్నాడు నల్లమల అటవీ ప్రాంతానికి, కృష్ణా నదికి పక్కనే ఉండటంతో అనాదిగా ఈ ప్రాంతంలో సారా తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉండేవి. ఎక్సైజ్ అధికారులు ఎన్నిసార్లు దాడులు నిర్వహించినా నిష్ర్పయోజనమే. జనసంచారం లేని అటవీ ప్రాంతాలు, కొండలపై తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని కొందరు వ్యాపారాన్ని నడిపేవారు.  గతంలో సారా వ్యాపారం చేసిన వారంతా మళ్లీ అటు వైపే అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

ఎక్సైజ్ అధికారులను నిలదీస్తున్న మందుబాబులు...
 మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తున్నా మామూళ్లు పుచ్చుకుంటూ చోద్యం చూస్తున్నారంటూ మందుబాబులు ఎక్సైజ్ అధికారులపై మండిపడుతున్నారు. వాటిని అరికట్టలేని మీకు సారా అమ్ముకునే వారిపై కేసులుపేట్టే హక్కు ఎక్కడిదంటూ పలు చోట్ల సిబ్బందిని నిలదీసిన సందర్భాలున్నాయి. అధికారులు చేసే తప్పులకు తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని పలువురు ఎక్సైజ్ సిబ్బంది తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. జిల్లాలో సారా విక్రయాలు పెరగడానికి పరోక్షంగా ఎక్సైజ్ అధికారులే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 సారా విక్రేతలపై కఠిన చర్యలు
 మాచర్లటౌన్ : ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అక్రమంగా సారా వ్యాపారం చేసే వారిపై దృష్టిసారించి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మాచర్ల ఎక్సైజ్ సీఐ టి.లక్ష్మణస్వామి తెలిపారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం మద్యం దుకాణాలలో విక్రయాలు చేయాలన్నారు. అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఎక్సైజ్‌శాఖకు సహకరించి సారా వివరాలను తెలియపర్చాలని కోరారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement