సాక్షి, మచిలీపట్నం : ఎక్సైజ్ శాఖలోని పలువురు అధికారులు అవినీతిలో నిండా మునిగిపోయారు. మామూళ్ల మత్తులో జోగుతున్నారు. చివరకు లంచావతరాలకు జిల్లా ఎక్సైజ్ శాఖ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఎక్సైజ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సొంత జిల్లాలోనే అదే శాఖ ఉన్నతాధికారులు ఇద్దరు ఏసీబీ వలలో చిక్కడం చర్చనీయాంశమైంది. కొద్దినెలల క్రితం విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈఎస్) శ్రీలత ఏసీబీకి పట్టుబడగా, తాజాగా శుక్రవారం బందరు ఈఎస్ కె.ప్రదీప్‌రావు ఏసీబీకి దొరికిపోయారు. ఒకే జిల్లాలోని ఇద్దరు కీలక అధికారులు అవినీతి నిరోధక శాఖ వలలో పడటం ఎక్సైజ్ శాఖలో అవినీతి పర్వం మూడు క్వార్టర్లు.. ఆరు ఫుల్లులు మాదిరిగా సాగుతోందన్న విమర్శలు మరోమారు గుప్పుమన్నాయి. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం బందరు ఈఏస్ పట్టుబడిన క్రమం ఇదీ..
రూ.5 లక్షలు వసూలు...
మచిలీపట్నంలోని బార్‌లు, మద్యం షాపుల నుంచి గత ఐదు నెలలుగా మామూళ్లు ఇవ్వకపోడంతో వాటి నిర్వాహకులపై ఈఎస్ ప్రదీప్‌రావు తన సిబ్బందితో ఒత్తిళ్లు చేయించారు. వేధింపులు తాళలేక బందరుకు చెందిన ముగ్గురు బార్ షాపుల నిర్వాహకులు, ఒక వైన్‌షాపు యజమాని కలిసి గత ఐదు నెలలకు గాను ఒక్కొక్కరు రూ.1.25 లక్షలు చొప్పున మొత్తం రూ.5 లక్షలు లంచం ఇచ్చారు. ఆ మొత్తాన్ని విజయవాడకు చెందిన ఎక్సైజ్ ఎస్సై రామాంజనేయులు తీసుకుని గురువారం సాయంత్రం విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు.
ఏసీబీకి ఉప్పందించిన సిండికేట్లు...
ఈఏఎస్ వేధింపులు పడలేక మామూళ్లు ఇచ్చిన సిండికేట్లు ఎక్సైజ్ ఎస్సై ఎక్కిన బస్సు నంబర్ సహా పూర్తి సమాచారాన్ని ఏసీబీ ఉన్నతాధికారులకు చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏసీబీ డెరైక్టర్ జనరల్ ఏకే ఖాన్‌కు అనుమతి తీసుకుని వల పన్నారు. విజయవాడ సమీపంలోని ఈడ్పుగల్లు వద్ద రామాంజనేయులును అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన్ని ప్రశ్నించగా, ఆ మొత్తం ఈఎస్‌కు ఇచ్చేందుకు బార్‌లు, వైన్ షాపుల నుంచి మామూళ్లుగా తీసుకుని వెళుతున్నట్టు ఆయన ఏసీబీ అధికారుల వద్ద ధ్రువీకరించారు. దీంతో ఈఎస్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది.
పకడ్బందీ వ్యూహం..
మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్‌రావు చుట్టూ పకడ్బందీగానే ఉచ్చు బిగుసుకుంది. అందుకు అనేక కారణాలు ఆయన్ను వెంటాడాయి. మచిలీపట్నంలో ఒక వర్గానికి చెందిన కొందరు సిండికేట్లను ఇబ్బందిపెట్టేందుకు ఉద్దేశపూర్వంగానే ఒక కీలకనేత ఆయన్ను ఇక్కడికి తీసుకుని వచ్చినట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తరచూ వారిని వేధింపులకు గురిచేయడంతో వాళ్లు అదను కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాకు చెందిన కీలక నేతల అనుచరుల అడుగులకు మడుగులొత్తుతున్న ఈఏస్ ఇటీవల ఒక బార్‌ను సీజ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. దాదాపు రెండు నెలలపాటు బార్ సీజ్ చేయడంతో ఒక వర్గంవారు తీవ్రంగా మండిపడుతూ ఎక్సైజ్ అధికారులకు గత ఐదు నెలలుగా మామూళ్లు ఇవ్వకుండా మొండికేశారు. అయినా వేధింపులు కొనసాగుతుండటంతో డబ్బు ఇచ్చినట్టే ఇచ్చి ఏసీబీకి ఉప్పందించారు.
ఈఎస్ ఇళ్లలో సోదాలు...
కృష్ణా, పశ్చిమగోదావరి ఏసీబీ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో ఈఎస్ ప్రదీప్‌రావు ఇళ్లపై దాడులు జరిపారు. ఈఎస్ ప్రదీప్‌రావు స్థానికంగా ఉంటున్న మచిలీపట్నం ఆశీర్వాదపురంలోని ఇల్లు, వరంగల్‌లోని సొంత ఇంటిని ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా.. విలువైన పత్రాలు, డబ్బు, ఇతర సమాచారం కోసం ఈ సోదాలు చేసినట్టు ఏసీబీ అధికారులు ధ్రువీకరించారు. ఏలూరు నుంచి ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు, సీఐ విల్సన్.. మరికొందరు సిబ్బందితో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మచిలీపట్నంలోని ఈఎస్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి ఆయన్ని విచారించారు. తగిన ఆధారాలు లభించడంతో ఇప్పటికే ఎక్సైజ్ ఎస్సై రామాంజనేయులును అదుపులోకి తీసుకున్నామని, ఈఎస్‌ని కూడా అదుపులోకి తీసుకుని శనివారం అరెస్టు చేస్తామని ఏసీబీ డీఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు.
శ్రీలత నుంచి ప్రదీప్‌రావు వరకు అదే ఎస్సై...
ఏసీబీకి పట్టుబడ్డ ఎక్సైజ్ ఎస్సై మద్యం షాపులు, బార్‌ల నుంచి మామూళ్లు వసూలు చేయడంలో దిట్ట అని చెబుతున్నారు. సుమారు నాలుగు నెలల క్రితం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విజయవాడ ఈఎస్ శ్రీలతకు కూడా ఈ ఎస్సై మామూళ్లు వసూలు చేసి ఇచ్చేవారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. 2012 డిసెంబర్ 31 రాత్రి మైలవరం మండలం కనిమెర్ల, పోరాటనగర్, రెడ్డిగూడెం మండలం నాగులూరు తండా ప్రాంతాల్లో నాటుసారా తాగి 18 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.
అదే సమయంలో ఎక్సైజ్ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యల్లో భాగంగా విజయవాడ ఎక్సైజ్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పనిచేసిన ఈఎస్ శ్రీలతను విజయవాడ బదిలీ చేశారు. ఇక్కడ రూ.65 వేలు లంచం తీసుకునే క్రమంలో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. దీంతో ఆమెను సస్పెండ్ చేసి మచిలీపట్నం ఈఎస్ ప్రదీప్‌రావుకు అదనపు బాధ్యతలు కేటాయించారు. అదే సమయంలో పరిచయమైన ఎస్సై రామాంజనేయులు మామూళ్ల వసూళ్లలో ఆయనకు సహకరిస్తున్నట్లు సమాచారం.
ఆ మొత్తం ఎవరికి?
ఎక్సైజ్ ఈఎస్‌కు ఇచ్చేందుకు అని వసూలు చేసిన రూ.5 లక్షల మొత్తం ఎవరి కోసం, ఎక్కడికి తీసుకెళుతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఒక కీలకనేత ఆశీస్సులతో ఇక్కడ విధుల్లోకి చేరిన ఈఎస్ పెద్ద మొత్తాన్ని ఆయనకు పంపుతున్నారా.. అనే ప్రచారం జరిగింది. జిల్లాలోని ఎక్సైజ్ శాఖ రాజకీయ కక్షసాధింపులకు ఆయుధంగా పనిచేస్తోందన్న విమర్శలను మూటగట్టుకుంది.
దీంతో తమను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్న ఎక్సైజ్ సిబ్బంది ఆట కట్టించేందుకు సిండికేట్లు కూడా వెనకడుగు వేయడంలేదు. మామూళ్లను నేరుగా తీసుకుని తమ చేతికి మకిలి అంటించుకోవడం దేనికని భావించిన ఎక్సైజ్ అధికారులే వాటిని ఇతర ప్రాంతాల్లో తీసుకునే ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. జిల్లాలోని లంచాలను విజయవాడకు తీసుకెళ్లి అక్కడ గుట్టుచప్పుడు కాకుండా అందుకునే ఏర్పాట్లలో భాగంగానే ఇలా చేశారని చెబుతున్నారు.
లంచావతారాలు
Published Sat, Jan 11 2014 3:33 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement