పదవంటే ఎవరికి చేదు...? ఈ నిజం తెలిసి నందుకే కాబోలు, కొందరు కాంగ్రెస్ నేతలు
పదవులపై తెగ ఆశపెట్టుకున్నారు.. వచ్చే ఎన్నికల్లో ‘నాకో టికెట్..మా ఇంట్లో వారికి
మరో టికెట్’ అన్న ధోరణితో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తెలంగాణ ఏర్పాటు
ప్రకటనతో ఎన్నికల్లో బాగా కలిసి వస్తుందన్న ఆశతో.. అపుడే తొందరపడి పోతున్నారు..!!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: నిజం నిష్టూరంగా ఉంటుంది కానీ.. జిల్లా కాంగ్రెస్‌లో నాయకులు ఎవరికి వారుగా గిరిగీసుకునే ఉన్నారు. ఒక్కో సీనియర్ నాయకుడు తన సొంత నియోజకవర్గంతో పాటు, పక్క నియోజకవర్గంపై నజర్ పెట్టినోళ్లే. దీనికి భిన్నంగా కోమటిరెడ్డి సోదరులు వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి మాత్రం జిల్లాలోని అత్యధిక నియోజకవర్గాల్లో తమ సొంతవర్గాన్ని తయారు చేసుకున్నారు. దీంతో జిల్లా కాంగ్రెస్‌లో రెండు వర్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కోమటిరెడ్డి వర్గానికి వ్యతిరేకంగా ఇతర నాయకులంతా జట్టుకట్టినట్టు కనిపిస్తున్నా, ‘ఎవరికి వారు..’ అన్న రీతిలోనే ఉన్నారు. ఎవరి ఆశలు వారికున్నాయి. సీనియర్ మంత్రి జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి, మరో సీనియర్ నాయకుడు, సూర్యాపేట ఎమ్మెల్యే ఆర్.దామోదర్‌రెడ్డి తనయుడు సర్వోత్తమ్‌రెడ్డి ఈ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రానికి ఉవ్విళ్లూరుతున్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి కోదాడ నుంచి బరిలోకి దిగుతారన్న వార్త ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి తన కూతురు స్రవంతిని మునుగోడు నుంచి పోటికి దింపేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇక, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొన్నాల లక్ష్మయ్య తాను ఈసారి భువనగిరి ఎంపీ టికెట్‌ను తీసుకుని, తన కోడలు పొన్నాల వైశాలిని జనగామ నుంచి పోటీకి పెట్టాలని పావులు కదుపుతున్నారని సమాచారం. అంటే జిల్లా నేతలు, వారి వారసులు కలిసి ఆరు సీట్లు తీసేసుకుందామన్న వ్యూహంతో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. జానారెడ్డి, ఆయన తనయుడు రఘువీర్‌రెడ్డి నాగార్జునసాగర్, మిర్యాలగూడలలో చెరో చోటు నుంచి పోటీ చేయాలన్నది మొదటి ఆలోచన.
అయితే, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈసారి తాను మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పడంతో ఈ నాయకుల మధ్య చర్చ జరిగిందని అంటున్నారు. ఇదే కనుక కార్యరూపం దాలిస్తే, జానారెడ్డి, ఆయన తనయుడు ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎంపీ సీటుకు పోటీపడేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మంత్రి ఉత్తమ్ దంపతులు హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల నుంచి చెరొక చోటు నుంచి పోటీకి పడాలన్న ఆలోచనలో ఉన్నారన్న ప్రచారమూ ఉంది. ఇక, దామోదర్‌రెడ్డి తన సిట్టింగ్ స్థానం నుంచి, ఆయన తనయుడు సర్వోత్తమ్‌రెడ్డిని భువనగిరి ఎంపీ స్థానానికి పోటీ పెట్టాలని నాలుగైదు నెలల కిందటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఏడాడి కిందటే రాజ్యసభ సీటు దక్కించుకున్న పాల్వాయి గోవర్దన్‌రెడ్డి తన కూతురు స్రవంతిని ఎమ్మెల్యే చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇలా మొత్తంగా నేతలే తమ వారసులకోసం సీట్లు తీసేసుకునే ప్రయత్నాల్లో ఉంటే, ఇక మిగిలిన నేతల పరిస్థితి ఏమిటన్న విషయం చర్చనీయాంశమవుతోంది. జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలు, పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో మూడు అసెంబ్లీ స్థానాలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. అంటే మిగిలిన తొమ్మిది స్థానాలే. అందులోనూ తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడు స్థానంలో తన అనుచురునికే అవకాశం ఇప్పించుకోవాలని సూర్యాపేట ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి యథాశక్తి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
పైచేయి కోసం..
కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యూహం
మరోవైపు ఈ నేతలందరికీ చెక్ పెట్టేందుకు, తమ వర్గీయులకు టికెట్లు ఇప్పించుకుని పైచేయి సాధించేందుకు కోమటిరెడ్డి సోదరులు ముందు నుంచీ ఎత్తుగడలు వేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, అవసరాలకు ఆదుకుంటూ ప్రత్యేక వర్గాన్ని పెంచుకున్నారు. గత ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను టికెట్ ఇప్పించుకున్న వారిని గెలిపించారు. ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి భువనగిరి ఎంపీ, మరో అనుచరుడు చిరుమర్తి లింగయ్య నకిరేకల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ, ఇతర నేతలు టికెట్ ఇప్పించిన చోట పార్టీకి అపజయమే మిగిలింది. ఇలా, తుంగతుర్తి, కోదాడ, భువనగిరి టీడీపీ వశమయ్యాయి. ఇక, మునుగోడులో పాల్వాయి ఓటమి పాలయ్యారు. జానారెడ్డి కనుసన్నల్లో ఉండే మిర్యాలగూడలోనూ ఓడిపోయారు. ఈ కారణాలను చూపి, ఈసారి ఈ వర్గం ప్రయత్నాలు అడ్డుకోవాలన్న వ్యూహంతో కోమటిరెడ్డి సోదరులు ఉన్నారు.
‘‘ఎవరికి వారు, తమ వారసులను పోటీకి పెట్టాలని చూస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని, బీసీ వర్గాలకు చెందిన నాయకుల గురించి ఎవరూ ఆలోచించరా..? నా సిట్టింగ్ స్థానంలో తన తనయుడికి టికెట్ ఇప్పించుకోవాలని దామోదర్‌రెడ్డి ఎందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్నేళ్ల పాటు ఎన్నో పదవులు అనుభవించి, ఇపుడూ రాజ్యసభ సీటు దక్కించుకున్న పాల్వాయికి ఇంకా ఆశ ఎందుకు ఇక్కడ బీసీ వర్గానికి అవకాశం ఇవ్వాలి. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలంటే, అత్యధికంగా ఎంపీ సీట్లు గెలవాలి. దీనికోసం అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసే అభ్యర్థులు, సమీకరణలూ కీలకమే. తుంగతుర్తి, మునుగోడు, భువనగిరి అసెంబ్లీ స్థానాల్లో ప్రజాధరణ ఉన్న వారిని పోటీకి పెడితేనే సత్ఫలితాలు వస్తాయి..’’ అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు.
అది నాదే.. ఇదీ నాదే
Published Sat, Oct 19 2013 3:05 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement