సాక్షిప్రతినిధి, నల్లగొండ: జిల్లా కాంగ్రెస్‌లో ప్రధానవర్గంగా కొనసాగుతూ, వచ్చే ఎన్నికల్లో ప్రధాన కేంద్రంగా తయారయ్యేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ దిశలో చాలా దూరమే ప్రయాణించారు. ఇద్దరు మంత్రులు, తన వ్యతిరేక వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలను కాదని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను జిల్లా కేంద్రానికి తీసుకువచ్చిన కోమటిరెడ్డి ఆ కార్యక్ర మాన్ని విజయవంతం చేసి, జిల్లా కాంగ్రెస్‌లో తన పట్టును నిరూపించుకున్నారు.
ఓ వైపు తెలంగాణ స్థాయి పది జిల్లాల హాకీ టోర్నమెంటు.. మరోవైపు నల్లగొండ పట్టణంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండాలు, కోమటిరెడ్డి అనుకూల నినాదాలతో సోమవారం జిల్లా కేంద్రంలో ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇద్దరు ఎంపీలు సుఖేందర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బాలూనాయక్, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ పూల రవీందర్, ఇలా..
అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన కోమటిరెడ్డి ఒక విధంగా బలప్రదర్శన చేసినట్లే కనిపించింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే భారీగా జనాన్ని సమీకరించి క్లాక్‌టవర్ బహిరంగ సభను విజయవంతం చేశారు. చానాళ్లుగా జిల్లా కాంగ్రెస్‌లో ప్రధానమైన వర్గంగా కొనసాగుతున్న కోమటిరెడ్డి సోదరులు వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని కార్యక్రమం ద్వారా కాంగ్రెస్‌లోని ప్రత్యర్థి వర్గానికి స్పష్టమైన సంకేతాన్ని పంపించాలనే ఎత్తుగడ ను పక్కాగా అమలు చేశారు. కోమటిరెడ్డి సభను ఓసారి విశ్లేషిస్తే.. దీని ద్వారా ఏ అంశాలకు ప్రాచుర్యం కల్పించాలని భావించారో ఇట్టే తెలిసిపోతుంది.
తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసింది.. చివరికంటా కొట్లాడింది తామేనన్న విషయాన్ని మరోమారు జిల్లా ప్రజలకు వివరించడం.
తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాలు, ఉద్యోగ, విద్యార్థి, ఇతర తెలంగాణ వాద సంఘాల్లో తాను చేసిన మంత్రిపదవి త్యాగాన్ని గుర్తు చేయడం, కాంగ్రెస్‌లో పట్టు నిలపుకోవడం.
పార్లమెంటులో తెలంగాణ కోసం గళమెత్తడం, అధికార పార్టీ సభ్యుడై ఉండి కూడా సస్పెండ్ అయిన ఎంపీ రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ పోరాటాన్ని మరో మారు వివరించడం.
ఇక, తెలంగాణ ఏర్పాటైతే..కాబోయే సీఎం రేసులో చాలా మంది నాయకులే ఉండడం, వారిలో జిల్లాకు చెందిన సీనీయర్ మంత్రి జానారెడ్డి ఉండడం, అదే రేసులో ఉన్న డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను సీఎం చేయాల్సిందేనని బహిరంగంగా ప్రకటించడం ద్వారా ఎస్సీ,ఎస్టీల మనసులు చూరగొనడం.
రాబోయే తెలంగాణలో ఓ ముఖ్యనేత వర్గంలో తాముంటున్నామన్న సంకేతాన్ని ఇవ్వడం.
మంత్రి పదవికి రాజీనామా చేయడం వల్ల కొన్ని అభివృద్ధి పనులు చేయలేక పోయానని, తెలంగాణ పునర్నిర్మాణలో.. నవ నల్లగొండ నిర్మాణానికి తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరడం.
మొత్తంగా జిల్లాలో ఎన్నికల రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించిన కోమటిరెడ్డి సోదరులు పార్టీలోని ప్రత్యర్థి వర్గ నేతలపైనా త్రీవమైన విమర్శలే చేశారు. తెలంగాణకు ప్రధాన అడ్డంకిగా ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపైనా విరుచుకుపడ్డారు. నల్లగొండ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి తెర ఎత్తారు.
ఆధిపత్య కాంగిరేసు
Published Wed, Feb 5 2014 3:58 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement