అసలేం జరుగుతోంది..? ఇంటిపోరు ఇంతింతై, ఎందుకిలా రచ్చకెక్కుతోంది..? సిట్టింగులపై ‘కూటములు’ కయ్యానికి కాలుదువ్వుతున్నాయెందుకు..? కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించే వారి మదిలో ఈ ప్రశ్నలు ఉదయించక మానవు.. ఏఐసీసీ పరిశీలకులుగా.. రాహుల్ దూతలుగా జిల్లాకు వస్తున్న నాయకులు చివరకు
ఇక్కడ అగ్నిలో ఆజ్యం పోసి వెళుతున్నారు..!!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: వారం రోజుల వ్యవధిలో రెండు చోట్లా అవే దృశ్యాలు. నల్లగొండ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో జరిగిన సంఘటనలు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న ‘గుంపుల కుమ్ములాటలకు’ అద్దం పట్టాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ గుంపుల లొల్లి మరింత ఎక్కువైంది. మెజారిటీ నాయకులు కలిసి ఉన్నట్టు పైకి కనిపిస్తున్నా జిల్లా కాంగ్రెస్ నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీలిపోయినట్లు అర్ధమవుతోంది. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు, రెండు పార్లమెంటు సీట్లనూ కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ స్థానాలూ దక్కాయి. ఇంకేం జిల్లా కాంగ్రెస్‌కు తిరుగులేదన్నంత బలం కనిపించింది.
కానీ, తెలంగాణ రాష్ట్రం కోసమంటూ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో అసలు రాజకీయం మొదలైంది. ఆయన జిల్లా అంతా విస్తరించి అన్ని నియోజకవర్గాల్లో తనకంటూ వర్గం తయారు చేసుకున్నారు. పార్లమెంటులో తెలంగాణ కోసం బలంగా తన గొంతు విని పించిన ఎంపీ రాజగోపాల్‌రెడ్డితోపాటు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు కోమటిరెడ్డికి అండగా నిలిచారు. జిల్లా కోటాలో ఖాళీ అయిన బెర్తు కోసం సీనియర్లు ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. అనంతర పరిణామాలతో జిల్లా కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి వర్గం, ఆయన వ్యతిరేక వర్గంగా రెండు గుంపులు స్పష్టంగా కనిపించాయి.
సీఎం... పాచిక
జిల్లా కాంగ్రెస్‌ను తన గుప్పిట పెట్టుకునేం దుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కొందరు ఎమ్మెల్యేలను బాగానే దువ్వారు. ఆయన అండతో కొందరు నాయకులు కోమటిరెడ్డి సోదరులపై ఎదురుదాడి ప్రారంభించారు. ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి ఏకంగా సీఎంతో తన నియోజకవర్గంలో కార్యక్రమం ఏర్పాటు చేయించి, పలు పనుల కోసం నిధులు ప్రకటింపజేసుకున్నారు. అప్పటివరకు తెలంగాణ నినాదాన్ని బలంగా వినిపించిన ఆయన చివరకు సీఎం సభలో కనీసం జై తెలంగాణ నినాదం కూడా చేయలేనంతగా ఆత్మరక్షణలో పడిపోయారు. కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాక, సీఎం సమైక్యవాదాన్ని భుజాన వేసుకోవడంతో ఈ నాయకులంతా సీఎంకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నా, కోమటిరెడ్డి సోదరులకు వ్యతిరేకంగా పావులు కదపడం మాత్రం మానలేదు. చివరకు సూర్యాపేట ఎమ్మెల్యే ఆర్.దామోదర్‌రెడ్డికి, కోమటిరెడ్డి సోదరుల మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే మండేంత స్థాయికి చేరాయి.
మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు పరి మితమైనట్లే కనిపిస్తోంది. కానీ, దామోదర్‌రెడ్డి తన తనయుడి రాజకీయ అరంగేట్రానికి భువనగిరి పార్లమెంటు స్థానమే సరైన వేది కని భావించడంతోనే గొడవంతా వచ్చిపడిం దన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే బలంగా వ్యక్తమవుతోంది. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంటు నుంచి ప్రాతి నిధ్యం వహిస్తున్న దామోదర్ రెడ్డి, తన పాత నియోజకవర్గం తుంగతుర్తిపైనా ఆధిపత్యం నిలుపుకునేందుకు ప్రయత్నిం చారు. కానీ, ఈ సెగ్మెంటు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉండడంతో ఎంపీ రాజగోపాల్‌రెడ్డి ఇక్కడ తనవర్గాన్ని తయారు చేసుకున్నారు.
ఈ నియోజకవర్గంలో జరిగిన సంఘటనలే ఎంపీ రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి మధ్య విభేదాలకు ప్రధాన కారణమయ్యాయన్న అభిప్రా యం వ్యక్తం అవుతోంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న తనను కాదనడానికి, తనకు వ్యతిరేకంగా కూటమిని తయారు చేసి, తప్పుడు ప్రచారం చేయడానికి దామోదర్‌రెడ్డి పావులు కదపడంతో రాజగోపాల్‌రెడ్డి సైతం ఒకింత తీవ్రమైన ఆరోపణలే చేశారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి చింతల వెం కటేశ్వర్‌రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతివిద్యాసాగర్, మరికొందరు నాయకులు, ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టి తన తనయుడు సర్వోత్తమ్‌రెడ్డికి టికెట్ తెచ్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది.
దూతల... పనేంటి..?
రాహుల్ దూతలుగా వస్తున్న ఏఐసీసీ పరిశీల కులు సైతం స్థానిక రాజకీయాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం కూడా ప్రస్తావించాల్సిన అంశం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి రావడం, తమ పని తీరు గురించి వీరికి వివరించాల్సి ఉండడం, ఎవరైనా టికెట్ కోరుతూ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించడం వల్ల అంతా గందరగోళంగా మారుతోంది. రాహుల్ దూతల ముందు ‘బాగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న నాయకునిగా’ ముద్ర వేసేందుకు వ్యూహాత్మకంగా గొడవలకు దిగుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నల్లగొండలో ఎమ్మెల్యే వెంకటరెడ్డికి వ్యతిరేకంగా, భువనగిరిలో ఎంపీ రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా ఇలా ఓ గ్రూపు నేతలు పక్కా ప్లానింగ్‌తోనే గొడవ సృష్టించారని చెబుతున్నారు. అసలు అభిప్రాయ సేకరణ చేస్తున్నారా..? పనితీ రును మదింపు చేస్తున్నారా..? టికెట్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారా..? అన్న స్పష్టత అధినాయకత్వం ఇవ్వలేదని అంటున్నారు.
దీంతో వరసగా హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేను పక్కన పెట్టి తమకు టికెట్ కేటాయిం చాలని కోరుతున్న వారు తయారవుతున్నారని ఉదహరిస్తున్నారు. ‘నల్లగొండ, భువనగిరిలో జరిగిన సంఘటనలను గమనిస్తే కాం గ్రెస్‌లోని ఒకవర్గం కోమటిరెడ్డి సోదరులను లక్ష్యంగా చేసుకుని గొడవలకు దిగుతున్నారన్న అభిప్రాయమే బలపడుతోంది...’ అని పార్టీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి, అక్కడి ప్రజలతో సిట్టింగులకు ఉన్న సంబంధాలు, పట్టు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా పరిశీలకుల ముందు గొడవలు చేస్తే నిర్ణయాలు జరిపోతాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కాంగ్రెస్‌లో.. రచ్చ.. రచ్చ!
Published Thu, Jan 16 2014 3:43 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement