
ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనస్వాగతం
- ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేటకు చేరుకున్న నాయకులు
- నినాదాలతో మార్మోగిన కాజీపేట జంక్షన్
- అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ
కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ : పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో ఢిల్లీకి వెళ్లిని జిల్లా ఉద్యోగ సంఘాల నాయకులు.. బిల్లు ఆమోదం పొందిన తర్వాత విజయదరహాసంతో గురువారం ఢిల్లీ నుంచి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేటకు చేరుకున్నారు. నాయకుల రాకను తెలుసుకున్న ఉద్యోగులు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వారికి ఘనస్వాగతం పలికారు. ఉద్యోగ సంఘాల నాయకులు, తెలంగాణవాదులతో కాజీపేట రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. తెలంగాణ నినాదాలతో కాజీపేట జంక్షన్ ప్రాంగణం మార్మోగింది.
తెలంగాణ రాష్ర్టం.. అమరులకు అంకితం
కాజీపేట రైల్వే వీఐపీ లాంజ్‌లో ఉద్యోగ సంఘాల ఐకాస చైర్మన్ పరిటాల సుబ్బారావు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం.. తెలంగాణ కోసం అసువులు బాసిన అమరవీరులకే అంకితం అని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్, యావత్తు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల కృషి ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ సిద్ధించిందని అన్నారు. తెలంగాణ ఉద్యోమంలో కలిసి వచ్చిన ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట టీఎన్జీవోఎస్ అధ్యక్షుడు కోలా రాజేష్‌గౌడ్, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం కార్యదర్శి జగన్మోహ న్‌రావు, టీఎన్జీవోఎస్ సిటీ అధ్యక్షుడు రాంకిషన్‌నాయక్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ ఉన్నారు.
కాజీపేట జంక్షన్ నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ
కాజీపేట జంక్షన్ నుంచి ప్రత్యేక వాహనం ద్వారా ఉద్యోగ సంఘాల నాయకుల ర్యాలీ నిర్వహించారు. కాజీపేట జంక్షన్ నుంచి చౌరస్తా, పాతీమానగర్ జంక్షన్, సుబేదారి మీదుగా అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు.