పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట | Expert Committee on Pollution Prevention Says YS Jagan | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట

Published Wed, Jun 26 2019 4:39 AM | Last Updated on Wed, Jun 26 2019 4:39 AM

Expert Committee on Pollution Prevention Says YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని, కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా మంచి సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. కలెక్టర్ల సదస్సు రెండవ రోజైన మంగళవారం సీఎం జగన్‌ ఎస్పీలు, కలెక్టర్లతో శాంతిభద్రతలపై సమీక్షలో భాగంగా పలు ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్‌ జిల్లా వేముల మండలంలో యురేనియం కర్మాగారం కార్యకలాపాలవల్ల తాగునీరు కలుషితం అవుతోందన్న ప్రజల అభ్యంతరాలను సీఎం ప్రస్తావించారు. ప్రజల అభ్యంతరాలను తోసిపుచ్చి, బుల్డోజ్‌ చేసే పద్ధతి వద్దని అధికారులను ఆదేశించారు. కాలుష్యంపై ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినా దానిపై సానుకూల పరిశీలన చేయాలని చెప్పారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమల పట్ల అప్రమత్తతతో ఉండాలన్నారు. ఇటువంటి వాటి వల్ల భవిష్యత్‌ తరాలకు చేటు తెచ్చే పరిస్థితి ఉండకూడదన్నారు.

కాలుష్య నియంత్రణపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చాక మిగతా విషయాలు చర్చిద్దామని చెప్పారు. యురేనియం కంపెనీ అధికారులు, సంబంధిత ప్రజలు, కడప ఎంపీతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఆ సమావేశంలో తాను కూడా పాల్గొంటానన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా సాగు వల్ల మంచి నీరు కలుషితం అవుతోందని, ప్రజలకు కనీసం మంచి నీరు కూడా అందించలేకపోతే ఎలా అని ఆయన పశ్నించారు. పాదయాత్రలో ప్రజలు పడుతున్న తాగునీటి కష్టాలు చూశానన్నారు. నీరు కాలుష్యం బారిన పడకుండా కలెక్టర్, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు సీరియస్‌గా తీసుకోవాలన్నారు. కాలుష్య నియంత్రణకు కఠినమైన, కచ్చితమైన విధానాన్ని తీసుకురావాలని చెప్పారు. సమాజానికి చేటు తెచ్చే వాటిపై జవాబుదారీతనం ఉండాలని, విశ్వసనీయత ఉన్న ఏజెన్సీతో తాగునీటి పరీక్షలు చేయించి నీటి కాలుష్యం నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధవళేశ్వరం నుంచి పైపులైన్‌ ద్వారా నీటిని తీసుకుని ప్రతి గ్రామంలో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

భూములు తీసుకుని పరిశ్రమ పెట్టకపోతే ఎలా?
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరుకు సమీపంలో గత ప్రభుత్వం టీడీపీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు(కలువపూడి శివ)కు ఇచ్చిన 350 ఎకరాల్లో ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని ఆ జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు. 2016లో అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేకు 350 ఎకరాల ప్రభుత్వ భూమి ఇస్తే ఆయన ఆ భూమికి నామమాత్రపు ధర సుమారు రూ.ఏడు కోట్లు కూడా చెల్లించలేపోతే ఇంకా వందల కోట్లు పెట్టి పరిశ్రమలు ఎలా పెడతారని సీఎం ప్రశ్నించారు. మీరు చూసీచూడనట్టు వదిలేస్తే ఇదో ల్యాండ్‌ గ్రాబింగ్‌ అవుతుందని తప్పుబట్టారు. ఆయన ఏ పార్టీవారైందీ అనవసరమని, ఆ భూమిని తక్షణం వినియోగంలోకి తెచ్చి పరిశ్రమ పెడతారో? లేదో? తెలుసుకుని పూర్తి వివరాలతో తనకు నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. 

కేఈ పవర్‌ ప్రాజెక్టుపై నివేదిక ఇవ్వండి..
మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి చెందిన పవర్‌ ప్రాజెక్టు విషయంలో దాదాపు 150 కుటుంబాల వారు న్యాయం కోసం ఏళ్ల తరబడి ఆందోళన చేస్తున్నారని కర్నూలు జిల్లా అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కేఈ  ప్రాజెక్టు కోసం ఎస్సీ కుటుంబాలను బెదిరించి ఖాళీ చేయించారని, ప్రత్యామ్నాయం కూడా చూపలేదని అధికారులు ప్రస్తావించారు. దీనిపై పూర్తి వివరాలతో తనకు నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అక్కడ సమస్యను పరిశీలించి అవసరమైతే ఆ ప్రాజెక్టును కూడా రద్దు చేయొచ్చన్నారు.

ప్రభోదానంద ఆశ్రమానికి భక్తులను రానివ్వరా?
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని ప్రభోదానంద ఆశ్రమానికి భక్తులను ఎందుకు అనుమతించడంలేదని, ఆలయాలకు, ఆశ్రమాలకు భక్తులను రానీయకుండా అడ్డుకుంటే ఎలా అని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే చర్యలు మంచిది కాదన్నారు. ఆలయాలు, ఆశ్రమాలు ఎక్కడికైనా భక్తులు వెళ్లేలా ఉండాలన్నారు. ఏదైనా అసాంఘిక శక్తులు అక్కడకు వెళ్తున్నట్టు పోలీసులకు సమాచారం ఉంటే చర్యలు తీసుకోవచ్చని, అంతేగానీ సాధారణ భక్తులకు ఇబ్బందులు కలిగించడం సరికాదని చెప్పారు. 

స్మగ్లింగ్‌ను అడ్డుకుంటామంటే వినలేదు..
రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాలను గుర్తించి వారి ఆట కట్టించే చర్యలు తీసుకునేందుకు గత ప్రభుత్వం అనుమతివ్వలేదని ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నిరోధక టాస్క్‌ఫోర్స్‌ ఐజీ కాంతరావు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. స్మగ్లింగ్‌లో తమిళనాడు, కర్ణాటక ముఠాలు ఉన్నాయన్నారు. అక్కడి ఎస్పీలతో తాను మాట్లాడానని, జాయింట్‌ ఆపరేషన్‌కు వారు అంగీకరించారన్నారు. అయితే ఎన్నికల ముందు అదనపు పోలీసు బలగాలను ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని కోరినప్పటికీ అనుమతించలేదని వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. పట్టుబడిన ఎర్రచందనం, వాహనాలు వేలం వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను కట్టడి చేసేందుకు చాపర్‌ (హెలికాఫ్టర్‌) కావాలని గ్రేహౌండ్స్‌ ఏడీజీ నళిన్‌ ప్రభాత్‌ సీఎం వైఎస్‌ జగన్‌ను కోరారు. రాష్ట్రంలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌ విభాగాల పని తీరును వివరించిన ఆయన చాపర్‌ అవసరాన్ని ప్రస్తావించారు. చాపర్‌ కోసం కేంద్ర హోం శాఖకు లేఖ రాద్దామని సీఎం జగన్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి గ్రేహౌండ్స్‌ హెడ్‌ క్వార్టర్‌ మంజూరు చేసిందని, దాన్ని విశాఖపట్నం రూరల్‌ జిల్లాలో నిర్మించాలని నిర్ణయించినట్టు నళిన్‌ ప్రభాత్‌ చెప్పారు. అయితే అక్కడ అటవీ ప్రాంతం ఢి నోటిఫైడ్‌ చేయడంలో సాంకేతిక సమస్య రావడంతో ఇంత వరకు గ్రేహౌండ్స్‌ హెడ్‌క్వార్టర్‌ నిర్మాణం చేపట్టలేదన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement