
నీటి ఆందోళనలపై నిపుణుల కమిటీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో నీటి పంపకాలపై వ్యక్తమవుతున్న ఆందోళనలను పరిశీలించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నీటి పంపకాలపై ప్రజల్లో, ముఖ్యంగా సీమాంధ్రుల్లో నెలకొన్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే పోలవరం నిర్మాణం ఆగిపోతుందని, ఆ ప్రాజెక్టుకు నీటి లభ్యత ఉండదని, కృష్ణా బేసిన్‌లో రాయలసీమ ప్రాజెక్టులకు చుక్క నీరు రాదని, డెల్టా ఆయకట్టు ఎండిపోతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.
వీటిని దృష్టిలో ఉంచుకుని నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుతో సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయనే అంశాన్ని ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. కమిటీ ఏర్పాటు విషయమూ భారీ నీటిపారుదల మంత్రి సుదర్శన్‌రెడ్డి రెండు రోజులుగా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తున్నారు. మంగళవారం కూడా దీనిపై ఉన్నతాధికారుల సమీక్ష జరిగింది. సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, నిపుణులు విద్యాసాగర్‌రావు, రోశయ్య, ప్రభాకర్‌రెడ్డి, అనంతరాములు, కేఎన్‌ఎస్ రెడ్డి, ఈఎన్‌సీలు మురశీధర్, నారాయణరెడ్డి, వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ రవూఫ్ తదితరులు పాల్గొన్నారు.
గోదావరి నదిపై తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం ప్రాణహిత-చేవెళ్ల, ఎల్లంపల్లి, దేవాదుల, కంతనపల్లి, దుమ్ముగూడెం వంటి ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి నిర్మాణాలు పూర్తయి, నీటి వాడటం మొదలైతే దిగువన చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుకు నీటి కొరత ఏర్పడుతుందని గోదావరి జిల్లాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అక్టోబర్ తర్వాత నదిలో వచ్చే నీరు ఎగువ ప్రాంత ప్రాజెక్టులకే సరిపోతుందని, దాంతో పోలవరానికి నీటి కొరత ఏర్పడుతుందని అంటున్నారు. వరదలప్పుడు ఇబ్బందులుండకపోయినా వర్షాభావం నెలకొనే సంవత్సరాల్లో మాత్రం పోలవరానికి నీటి కొరత ఉంటుందని దిగువ ప్రాంతంలో ఆందోళన ఉంది.
అలాగే రాష్ర్ట విభజన జరిగితే పోలవరం నిర్మాణానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయన్న వాదన ఉంది. అలాగే కృష్ణా పరీవాహక ప్రాంతం విషయంలో కూడా సీమాంధ్రుల్లో ఆందోళన ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రాయలసీమకు నీరందించే హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, వెలుగొండ ప్రాజెక్టులతో పాటు కృష్ణా డెల్టా రైతులు కూడా తమకు నీటి కొరత తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై వేయనున్న కమిటీలో నీటిపారుదల రంగ నిపుణులను సభ్యులుగా నియమించే అవకాశముంది. దీనికి ప్రభుత్వాధికారి సారథ్యం వహించాలా, లేక రిటైర్ట్ ఇంజనీరా అన్నదానిపై తుది నిర్ణయానికి రాలేదు. తెలంగాణ ఏర్పడ్డాక నీటి పంపకాల్లో ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ప్రజలకు వివరించే దిశగా కమిటీ పని చేయాలన్నది ప్రభుత్వ భావన అంటున్నారు. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటించే అవకాశముంది.