దిగ్విజయ్‌సింగ్‌కి విభజన సెగ! | bifurcation heat touches to digvijay singh | Sakshi
Sakshi News home page

దిగ్విజయ్‌సింగ్‌కి విభజన సెగ!

Published Thu, Aug 29 2013 2:49 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

bifurcation heat touches to digvijay singh

 ఇంటి ముందు సీమాంధ్ర ఉద్యోగుల నిరసన
 విభజనపై వెనక్కు వెళ్లేది లేదన్న దిగ్విజయ్
 రాష్ట్రపతిని కలసిన రఘువీరా, ఆనం, అనంత
 విభజనపై ముందుకు పోలేరు: అశోక్‌బాబు
 అద్వానీ, సుష్మాలతో భేటీ..

 
 సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు విభజన సెగ తగిలింది. రాష్ట్ర విభజన అంశంలో వెనక్కి వెళ్లలేమని దిగ్విజయ్ వ్యాఖ్యానించడంతో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు, సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ఆయన నివాసం ముందు ఆందోళనకు దిగారు. సచివాలయ సమైక్యాంధ్ర ఉద్యోగ నేతలు కృష్ణయ్య, మురళి నేతత్వంలో బుధవారం సాయంత్రం వారు దిగ్విజయ్‌ను ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ విజ్ఞాపన పత్రం అందజేశారు. కానీ తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, దానిపై వెనక్కు వెళ్లలేమని దిగ్విజయ్ స్పష్టం చేయడంతో వారంతా బయటికొచ్చి ఆయన నివాసం ముందు ఆందోళన కు దిగారు.
 
 బయటికి వెళ్తున్న దిగ్విజయ్ వాహనాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. మరోవైపు సీమాంధ్రకు చెందిన మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, వట్టి వసంత్‌కుమార్, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి దిగ్విజయ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. విభ జన నిర్ణయానికి తిరుగులేదని, దానిపై వెనక్కు వెళ్లే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు అక్కడి నేతలే చొరవ చూపాలని చెప్పినట్టు తెలుస్తోంది. అనంతరం నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలిశారు. రాష్ట్ర విభజన యత్నాలకు అడ్డుకట్ట వేయాలని ఆయనను కోరినట్టు సమాచారం. నవ ంబర్ 1న అనంతపురంలో దివంగత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంత్యుత్సవాల ముగింపు సభకు ప్రణబ్‌ను వారు ఆహ్వానించారు. ఆంటోనీ కమిటీ సభ్యుడు, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీతోనూ రఘువీరా, అనంత భేటీ అయ్యారు. అంతకుముందు దిగ్విజయ్ ఇంటి ముందు అనంత, రఘువీరాలను ఉద్యోగులు అడ్డుకున్నారు.
 
 స్వాతంత్య్రోద్యమమే స్ఫూర్తి: అశోక్‌బాబు
 రాష్ట్ర విభజన నిర్ణయంపై యూపీఏ ప్రభుత్వం వెనక్కు వెళ్లలేకున్నా ప్రక్రియను ముందుకు మాత్రం తీసుకెళ్లే పరిస్థితి లేదని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. విభజనతో తలెత్తే సమస్యలను కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పాటు జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లామని, వారంతా సీమాంధ్రకు అన్యాయం జరిగిందన్న వాదనతో ఏకీభవించారని తెలిపారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలు ఎల్‌కే అద్వానీ, సుష్మాస్వరాజ్‌లను కలిశాక ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, హైదరాబాద్‌లో సెప్టెంబర్ 7న సభ జరిపి తీరుతామని స్పష్టం చేశారు. స్వాంతత్య్రోద్యమమే స్ఫూర్తిగా పోరాడి గెలుస్తామన్నారు. అంతకుముందు సుష్మాను కలిసిన ఎన్జీవో నేతలు... సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు వివరించారు. విభజన నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకించాలని కోరారు. చిన్న రాష్ట్రాలకు తాము అనుకూలమే అయినా ఏ ప్రాంతానికీ అన్యాయం జరగడాన్ని ఒప్పుకోబోమని సుష్మా అన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement