సాక్షి, వేముల: వైఎస్సార్ జిల్లాలోని వేముల మండలంలో యురేనియం కాలుష్య సమస్యపై నిపుణుల అధ్యయన కమిటీ సోమవారం పర్యటించింది. టైలింగ్ పాండ్ పరిధిలోని బాధిత రైతు సమస్యలపై యురేనియం సంస్థ అధికారులతో ఆరా తీసింది. తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టులో ముడి పదార్థాన్ని శుద్ధి చేసి టైలింగ్ పాండ్‌లో నింపుతున్నారు. టైలింగ్ పాండ్‌లోని వ్యర్థ పదార్థాలు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు కలుషితమై పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. ఈ సమస్యపై ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో సమీక్ష నిర్వహించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, విశ్రాంత సీనియర్ శాస్త్రవేత్త బాబూరావు, రైతులు కలసి యురేనియం కాలుష్యం, కలుషిత జలాలపై కాలుష్య నియంత్రణ మండలిలో ఫిర్యాదు చేశారు.
స్పందించిన కాలుష్య నియంత్రణ మండలి 11 మందితో నిపుణుల అధ్యయన కమిటీని నియమించింది. కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త బాబూరావు ఆధ్వర్యంలో కమిటీ కర్మాగారాన్ని, టైలింగ్ పాండ్‌ను సందర్శించింది. ముందుగా తుమ్మలపల్లెలో యురేనియం అధికారులతో కమిటీ భేటీ అయింది. అధికారులిచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకిపోయి నీరు కలుషితం కాలేదనే∙దానిపై ఆధారాలు చూపాలని ప్రశ్నించినట్లు సమాచారం. తర్వాత యురేనియం శుద్ధి కర్మాగారాన్ని కమిటీ సందర్శించింది. టైలింగ్ పాండ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని కమిటీ బృందం గుర్తించినట్లు తెలుస్తోంది. యూసీఐఎల్ అధికారులు ప్రాణేష్, రావు, వీకే సింగ్ తదితరులు ఉన్నారు. (ఇది చదవండి: యురేనియం కాలుష్యానికి ముకుతాడు)
Comments
Please login to add a commentAdd a comment