Tummalapalle
-
యురేనియం సమస్యలపై కమిటీ ఆరా
సాక్షి, వేముల: వైఎస్సార్ జిల్లాలోని వేముల మండలంలో యురేనియం కాలుష్య సమస్యపై నిపుణుల అధ్యయన కమిటీ సోమవారం పర్యటించింది. టైలింగ్ పాండ్ పరిధిలోని బాధిత రైతు సమస్యలపై యురేనియం సంస్థ అధికారులతో ఆరా తీసింది. తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టులో ముడి పదార్థాన్ని శుద్ధి చేసి టైలింగ్ పాండ్‌లో నింపుతున్నారు. టైలింగ్ పాండ్‌లోని వ్యర్థ పదార్థాలు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు కలుషితమై పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. ఈ సమస్యపై ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో సమీక్ష నిర్వహించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, విశ్రాంత సీనియర్ శాస్త్రవేత్త బాబూరావు, రైతులు కలసి యురేనియం కాలుష్యం, కలుషిత జలాలపై కాలుష్య నియంత్రణ మండలిలో ఫిర్యాదు చేశారు. స్పందించిన కాలుష్య నియంత్రణ మండలి 11 మందితో నిపుణుల అధ్యయన కమిటీని నియమించింది. కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త బాబూరావు ఆధ్వర్యంలో కమిటీ కర్మాగారాన్ని, టైలింగ్ పాండ్‌ను సందర్శించింది. ముందుగా తుమ్మలపల్లెలో యురేనియం అధికారులతో కమిటీ భేటీ అయింది. అధికారులిచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకిపోయి నీరు కలుషితం కాలేదనే∙దానిపై ఆధారాలు చూపాలని ప్రశ్నించినట్లు సమాచారం. తర్వాత యురేనియం శుద్ధి కర్మాగారాన్ని కమిటీ సందర్శించింది. టైలింగ్ పాండ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని కమిటీ బృందం గుర్తించినట్లు తెలుస్తోంది. యూసీఐఎల్ అధికారులు ప్రాణేష్, రావు, వీకే సింగ్ తదితరులు ఉన్నారు. (ఇది చదవండి: యురేనియం కాలుష్యానికి ముకుతాడు) -
యురేనియం కాలుష్యానికి ముకుతాడు
సాక్షి, వేముల(కడప) : పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలోని తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టుతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కాలుష్య నివారణ చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇందులో భాగంగా యురేనియం గ్రామాల్లో అధ్యయనానికి 11మందితో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. ఈ బృందానికి ముంబాయి అణుశక్తి నియంత్రణ మండలికి చెందిన అణు ప్రాజెక్టుల భద్రతా విభాగాధిపతి అధ్యక్షత వహించనున్నట్లు సమాచారం. ఈయన ఆధ్వర్యంలో ఈ బృందం సోమ, మంగళవారాలలో యురేనియం గ్రామాల్లో పర్యటించనుంది. ఇక్కడి కాలుష్యం, కలుషిత జలాలపై అధ్యయనం చేసి కాలుష్య నియంత్రణ మండలి ఈనెల 11న నివేదిక అందజేయనుంది. తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టులో యురేనియం ముడి పదార్థాన్ని శుద్ధి చేసి వ్యర్థ పదార్థాలను కె.కె.కొట్టాల సమీపంలోని టైలింగ్ పాండ్‌కు తరలిస్తున్నారు. టైలింగ్ పాండ్‌లోని వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకిపోయి భూగర్భజలాలు కలుషితమయ్యాయి. కలుషిత నీటితో సాగులో ఉన్న అరటి, మిరప, వేరుశనగ పంటలు ఎదుగుదలేక గిటకబారిపోయాయి. అరటి తోటలకు సాగునీటిని అందిస్తే భూమిపై తెల్లని రసాయన పదార్థం పేరుకపోతోంది. దీంతో సాగులో ఉన్న పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయ బోర్లలో నీరు కలుషితం కావడంతో రైతులు పంటలు సాగు చేయడంలేదు. పంటలు సాగు చేసిన కలుషిత నీటితో పంట దెబ్బతిని పెట్టుబడులురాక గిట్టుబాటు కావని రైతులు పొలాలను బీళ్లుగా ఉంచుకున్నారు. టైలింగ్ పాండ్ పరిధిలోని కె.కె.కొట్టాల, కనంపల్లె, మబ్బుచింతలపల్లె గ్రామాల్లో వ్యవసాయ బోర్లు కలుషితమయ్యాయి. యురేనియం కాలుష్యం ఈ గ్రామాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. కలుషిత నీటిని పంటకు ఇవ్వడంవలన భూమిపై ఏర్పడిన తెల్లని పదార్థం అధ్యయన కమిటీ.. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నియమించిన నిపుణుల బృందం యురేనియం బాధిత తుమ్మలపల్లె, మబ్బుచింతలపల్లె, రాచకుంటపల్లె, భూమయ్యగారిపల్లె, కె.కె.కొట్టాల, కనంపల్లె గ్రామాల్లో పర్యటించనుంది. కలుషిత జలాలతో పంటలు దెబ్బతిని నష్టపోయామని.. పంట సాగు చేసుకోలేక పొలాలను బీళ్లుగా ఉంచుకున్నామని.. జీవనాధారం కోల్పోతున్నామని.. వ్యాధులు ప్రబలుతున్నాయని కాలుష్య నియంత్రణ మండలికి రైతులు, ప్రజా సంఘాలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలి యురేనియం కాలుష్యంపై అధ్యయనానికి నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. అధ్యయన కమిటీ 9, 10వ తేదీలలో పర్యటించనుంది. గ్రామాలలో రెండు రోజులపాటు కమిటీ బృందం పర్యటించి యురేనియం కాలుష్యంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనుంది. యురేనియం గ్రామాల్లో ఎంతమేర కాలు ష్యం, భూగర్భజలాల కలుషితమయ్యాయనే తదితర అంశాలపై నిపుణుల కమిటీ అంచనాకు రానుంది. ఇక్కడి గ్రామాల్లో అధ్యయనం చేశాక నివేదిక తయారు చేసి ఈనెల 11న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అందజేయనుంది. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ఇటీవల పులివెందులలో ఇక్కడి కాలుష్య సమస్యపై సమావేశమైన నేపథ్యంలో కమిటీ ఏర్పాటు కావడం పట్ల బాధిత గ్రామ రైతాంగం ఆనందం వ్యక్తంచేస్తోంది. ప్రతినెల కాలుష్య సమస్యపై వివరాలు తెలుసుకుంటానని ఆయన స్వయంగా అధికారులకు చెప్పారు. సంస్థ ప్రతినిధులతో కూడా సీఎం జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. నిపుణుల కమిటీకి సమస్యలు వివరించండి ఈ నెల 9,10 తేదీలల్లో జిల్లాకు రానున్న తుమ్మలపల్లె యురేనియం కాలుష్యంపై జిల్లాకు రానున్న నిపుణుల కమిటీకి తమ సమస్యలను వివరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జి. ఈశ్వరయ్య పేర్కొన్నారు. శనివారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుమ్మలపల్లె ప్రజలు తమ భవిష్యత్తు బాగుపడుతుందని యురేనియం ప్రాజెక్టుకు భూములు ఇస్తే కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీటన్నింటికి కారణం పరివ్రమకు సంబంధించిన టెయిల్ ఫాండ్ నిర్మాణంలో నిర్లక్ష్యం చేయడమేనన్నారు. ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలువ్యాధులతో అల్లాడిపోతున్నారన్నారు. జిల్లాకు వస్తున్న నిపుణుల కమిటీలో శ్రాస్తవేత్తలు, ఇంజనీర్లు, సివిల్ అండ్ ఎన్విరాన్మెంట్, జియాలజీ, భూగర్బగనుల శాఖ, ఉద్యానశాఖ అధికారులతోకూడిన నిపుణలు కమిటీ రెండు రోజుల పాటు పర్యటిస్తున్నట్లు తెలిపారు. కమిటీ ముందు యురేనియం ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలు స్వచ్చందంగా తమ సమస్యలను వివరించాలన్నారు. సీపీఐ నాయకులు పులి కృష్ణమూర్తి, ఎల్. నాగసుబ్బారెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఇది చదవండి : యురేనియం చెత్త ‘శుద్ధి’పై రైతుల ఆగ్రహం -
‘యురేనియం’ గ్రామాల్లో నిపుణుల కమిటీ పర్యటన
సాక్షి, అమరావతి: రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నియమించిన నిపుణుల కమిటీ ఈ నెల 9, 10 తేదీల్లో వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని యురే నియం ప్రాజెక్టు పరిసర గ్రామాల్లో పర్యటిస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల వేల్పుల, మేడిపెంట్ల, కొట్టాల గ్రామాల్లో భూగర్భ జలమట్టం కలుషితమైందని, పంటలు పండటం లేదని, ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయ డం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు పీసీబీ నిపుణుల కమిటీని నియమించింది. ముంబైలోని అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు న్యూక్లియర్ ప్రాజెక్టు సేఫ్టీ డివిజన్ అధిపతి డాక్టర్ ఎల్ఆర్ బిష్ణోయ్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ–హైదరాబాద్) సీనియర్ ప్రిన్సి పల్ సైంటిస్టు డాక్టర్ ఈవీఎస్ఎస్కే బాబు, తిరుపతి ఐఐటీ సివిల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సురేష్ జైన్, డాక్టర్ ప్రసన్న వెంకటేశ్ సంపత్, డాక్టర్ శిభాబుద్దీన్, ఆంధ్రా వర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (విశాఖపట్నం) జియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం.జగన్నాథరావు, ఆంధ్రా వర్సిటీ ఫిజికల్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ, కెమికల్ ఓషనోగ్రఫి విభాగాల అధిపతి డాక్టర్ పి.శ్యామల, రాష్ట్ర భూగర్భ జలాలు, గనులు, వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉప సంచాలకులు బి.నాగేశ్వరరావు, సి.మోహన్‌రావు, బాలూనాయక్, డి.మధుసూదన్‌రెడ్డితో కూడిన బృందం ఈ నెల 9, 10 తేదీల్లో ఆయా గ్రామాల్లో పర్యటిస్తుంది. భూగర్భ జలంపై యురేనియం ప్రాజెక్టుకు చెందిన టెయిలింగ్ పాండ్ ప్రభా వం, ఇక్కడ భూమిలోని నీటిలో రేడియో యాక్టివిటీ, వ్యవ సాయ, ఉద్యాన పంటలపై ప్రభావం, ఇతర అంశాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. పూర్తిస్థాయిలో పరీక్షలు చేసి ఈ నెల 11వ తేదీన పీసీబీకి సమగ్రమైన నివేదిక ఇస్తుంది. -
యురేనియం చెత్త ‘శుద్ధి’పై రైతుల ఆగ్రహం
యురేనియం వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకిపోయి సాగు, తాగునీరు కలుషితమైంది. వ్యర్థ జలాలు భూగర్భజలాలతో కలిసిపోవడంతో వ్యవసాయం కుదేలైంది. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన అరటి పంట దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేముల మండలంలోని కె.కె.కొట్టాల, మబ్బుచింతలపల్లె, కనంపల్లె గ్రామాల్లో రైతులు ఆగ్రహించారు. టైలింగ్ పాండ్ పనులను అడ్డుకున్నారు. ఏడాదిన్నరగా పనులు నిలిచిపోవడంతో వ్యర్థ పదార్థాలను తరలించే టైలింగ్‌పాండ్ నిండుదశకు చేరింది. భారీ వర్షాలు వస్తే పొంగి ప్రవహించే ప్రమాదం ఉంది. దీంతో యూసీఐఎల్ అధికారులు అప్రమత్తమయ్యారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలోని తుమ్మలపల్లె యురేనియం కర్మాగారంలో నాలుగు రోజులుగా యురేనియం ఉత్పత్తిని యూసీఐఎల్ నిలిపివేసింది. టైలింగ్ పాండ్ పనులు కొనసాగేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.పనులకు బాధిత రైతులు ససేమిరా అనడంతో యూసీఐఎల్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. సాక్షి, వేముల(కడప) : తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టులో ముడి యురేనియం శుద్ధి చేయగా వచ్చే వ్యర్థ పదార్థాలను టైలింగ్ పాండ్‌కు తరలిస్తున్నారు. ఇందులోని వ్యర్థ జలాలు భూగర్భజలాల్లో ఇంకిపోయి వ్యవసాయ బోర్లు కలుషితమయ్యాయి.బోరు నీటిని అరటికి అందిస్తే పొలంపై తెల్లటి రసాయన పదార్థం మేట వేసి పంట ఎదుగుదల లేకుండా పోయింది. అరటి సాగు చేసిన ఆరు నెలలకు గెలలు వేయాలి. అయితే 10 నెలలైనా గెలలు వేయకపోవడంతో రైతులు నష్టపోయారు. టైలింగ్ వ్యర్థ జలాలు వ్యవసాయ బోర్లలో కలుషితం కావడంతో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కె.కె.కొట్టాల, కనంపల్లె గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఇక్కడి పరిస్థితులను యూసీఐఎల్ సీఎండీ హస్నాని దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎండీ గత ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన కె.కె.కొట్టాల, కనంపల్లె గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఇక్కడి పరిస్థితులను వివరించారు. వ్యర్థ జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే ఏడాది మార్చి 9న మళ్లీ వస్తానని చెప్పి ఇటువైపు తొంగి చూడలేదు. ఏడాదిన్నర్రగా నిలిచిపోయిన పనులు : టైలింగ్ వ్యర్థ జలాలు సాగునీటిలో కలిసిపోయి పంటలు దెబ్బతింటున్నా యూసీఐఎల్ పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన కె.కె.కొట్టాల రైతులు టైలింగ్ పాండ్ పనులను అడ్డుకున్నారు. టైలింగ్ పాండ్‌ను 5మీటర్ల మేర ఎత్తు పెంచే పనులను రూ.42కోట్లతో చేపట్టారు. అయితే సాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని యూసీఐఎల్ నుంచి స్పష్టమైన హామీ రాలేదు. దీంతో బాధిత రైతులు పనులను అడ్డుకున్నారు. నిండుదశకు చేరిన వ్యర్థాల టైలింగ్ పాండ్.. : యురేనియం వ్యర్థాలను నింపే టైలింగ్ పాండ్ నిండు దశకు చేరింది. ఏడాదిన్నర్రగా యురేనియం కర్మాగారంలో ముడి పదార్థాన్ని శుద్ధి చేస్తున్నారు. అక్కడ నుంచి వ్యర్థాలను పైపులైన్ ద్వారా టైలింగ్ పాండ్‌కు తరలిస్తున్నారు. వర్షాలు కురిస్తే టైలింగ్ పాండ్ పొంగి ప్రవహించే ప్రమాదం ఉంది. పశువులు, జంతువులు తాగితే చనిపోయే ప్రమాదం నెలకొంది. ఇప్పటివరకు వర్షాలు రాకపోవడంతో యూసీఐఎల్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలంలో వానాలు కురిసి టైలింగ్ పాండ్‌లోని వ్యర్థ పదార్థం వాగు వెంబడి వెళితే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. యురేనియం వ్యర్థాలను నింపే టైలింగ్ పాండ్ పనులకు బాధిత రైతులు ససేమిరా అంటున్నారు. యూసీఐఎల్ అధికారులు వీరితో మాట్లాడి పనులు కొనసాగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో సమస్యను యూసీఐఎల్ అధికారులు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ప్రాజెక్టులో నిలిచిపోయిన యురేనియం ఉత్పత్తి.. : యురేనియం వ్యర్థ పదార్థాలను తరలించే టైలింగ్ పాండ్ నిండు దశలో చేరడంలో యూసీఐఎల్ అధికారులు ప్రాజెక్టులో యురేనియం ఉత్పత్తిని నిలిపివేశారు. నాలుగు రోజులుగా పనులు జరగలేదు. టెలింగ్ పాండ్ పనులు ప్రారంభమయ్యే వరకు కర్మాగారంలో ముడి పదార్థాన్ని శుద్ధిచేసే పరిస్థితి కనిపించలేదు. శాశ్వత పరిష్కారం చూపాలి టైలింగ్ వ్యర్థ జలాలు భూగర్భజలాల్లోకి ఇంకిపోయాయి. సాగు, తాగునీరు కూడా కలుషితమైంది. రేడియేషన్ ప్రభావం ఉంటోంది. దీంతో శరీరంపై దద్దులు వస్తున్నాయి.టైలింగ్‌పాండ్ వల్ల నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు పనులు జరగనివ్వం. మాకు శాశ్వత పరిష్కారం చూపాల్సిందే. – శ్రీనివాసులు(మాజీ సర్పంచ్), కె.కె.కొట్టాల ఆర్ఆర్ ప్యాకేజీ కింద ఇళ్లు, భూములు తీసుకోవాలి టైలింగ్ వ్యర్థాలతో నష్టపోతున్నాం. పంటలను సాగు చేసుకునే పరిస్థితి లేదు. ఆర్ఆర్ ప్యాకేజీ కింద భూములు, ఇళ్లులు తీసుకోవాలి. మా బాధలను యూసీఐఎల్ పట్టించుకోలేదు. – చంద్రమోహన్(బాధిత రైతు), కె.కె.కొట్టాల -
మహిళను తాళ్లతో కట్టి నిప్పుటించారు
-
మహిళను తాళ్లతో కట్టి నిప్పుటించాడు
(కర్నూలు)కొలిమిగుండ్ల: డబ్బులివ్వనందుకు వెంకటిబాయి అనే మహిళను మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడో ఘనుడు. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లె ఎస్టీ తండాలో జరిగింది. అదే గ్రామానికి చెందిన శ్రీను నాయక్, వెంకటి బాయితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. మంగవారం రాత్రి తన అవసరాల కోసం డబ్బులు ఇవ్వనందుకు శ్రీను నాయక్, వెంకటిబాయిని మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. స్థానికులు కొన ఊపిరితో ఉన్న వెంకటిబాయిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. చనిపోయే ముందు ఆమె మరణ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.