బీహార్‌ దొంగల బీభత్సం | Exploitation of Biharis in Kurnool | Sakshi
Sakshi News home page

బీహార్‌ దొంగల బీభత్సం

Published Wed, Jul 17 2019 7:23 AM | Last Updated on Wed, Jul 17 2019 7:24 AM

Exploitation of Biharis in Kurnool - Sakshi

మోహనకృష్ణ నుంచి వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు

కర్నూలు : నగర శివారులోని దిన్నెదేవరపాడు రోడ్డులో ఉన్న ఎన్‌సీసీ క్యాంటీన్‌ సమీపాన పార్థసారథి నగర్‌లో బిహార్‌ దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముఖాలకు మాస్క్‌లు ధరించిన ఎనిమిది మంది దొంగలు మూడు ఇళ్లలోకి ప్రవేశించి హల్‌చల్‌ చేశారు. రెండు కుటుంబాలపై కత్తులు, రాడ్లతో దాడికి కూడా పాల్పడ్డారు. 13 తులాల బంగారు నగలు, రూ.39 వేల నగదు మూటగట్టుకుని ఉడాయించారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్‌సీసీ 28వ ఆంధ్రా బెటాలియన్‌లో ప్లాంట్స్‌ నాయక్‌గా పనిచేస్తున్న ఆళ్లగడ్డ మండలం నందింపల్లికి చెందిన పాములపాటి మోహనకృష్ణ కర్నూలు ఎన్‌సీసీ క్యాంటీన్‌లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన కుటుంబంతో కలిసి  

పార్థసారథి నగర్‌లో నివాసం ఉంటున్నారు. భార్య లావణ్య, ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం రాత్రి భోజనం తర్వాత ఇంట్లో నిద్రించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఎనిమిది మంది యువకులు ముఖాలకు మాస్క్‌లు ధరించి ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టారు. గాఢనిద్రలో ఉండడంతో వారు లేవలేదు. దీంతో మెట్ల మీదుగా పై అంతస్తులోకి వెళ్లి తలుపులను పెకలించే ప్రయత్నం చేశారు. ఆ చప్పుడుకు మోహనకృష్ణ నిద్రలేచి తలుపులు తెరవడంతో మిద్దెపై నుంచి కిందకు పరుగెత్తుకుంటూ వచ్చి లోపలికి ప్రవేశించారు. మోహనకృష్ణ ప్రతిఘటించేందుకు ప్రయత్నం చేయడంతో కత్తులు, కర్రలు, రాడ్లతో దాడి చేశారు. దీంతో తల, వీపు, చేతిపై బలమైన గాయాలయ్యాయి. దెబ్బలకు తాళలేక ఆయన మెడలో ఉన్న బంగారు గొలుసు, భార్య లావణ్య మెడలోని బంగారు గొలుసును తీసిచ్చారు. పక్కనే ఉన్న రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి కరుణాకర్‌ ఇంట్లోకి కూడా దొంగలు చొరబడ్డారు. కరుణాకర్, రోజీమేరీ వృద్ధ దంపతులు. వీరి వద్ద కూడా రూ.39వేల నగదు, 3 తులాల బంగారు నగలు లాక్కుని ఉడాయించారు. ఇదే కాలనీలోని మరో ఇంట్లో కూడా దొంగతనానికి విఫలయత్నం చేశారు. అయితే.. తెల్లారుతుండడంతో జనం లేస్తారన్న భయంతో పారిపోయారు. కాగా.. దొంగల చేతిలో గాయపడిన మోహనకృష్ణ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స తీసుకున్నారు.

 ముందురోజు రెక్కీ.. 
డాక్టర్స్‌ కాలనీకి రెండువైపులా జాతీయ రహదారులు ఉన్నాయి. ఒకవైపు నంద్యాల, మరోవైపు బెంగళూరు జాతీయ రహదారులను కలుపుతూ డాక్టర్స్‌ కాలనీలో బైపాస్‌ రోడ్డు(రింగ్‌రోడ్డు) నిర్మించారు. దొంగలు ముందురోజు రాత్రి డాక్టర్స్‌ కాలనీలోని బైపాస్‌ రోడ్డుగుండా రెక్కీ నిర్వహించి, శివారులో జనసమ్మర్దం లేని ఇళ్లను ఎంపిక చేసుకుని దోపిడీకి పాల్పడ్డారు. ముఖాలకు మాస్క్‌లు ధరించి హిందీలో మాట్లాడుతూ దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. మనుషులు ఎర్రగా ఉన్నారని, వారి జుట్టు కూడా ఎర్రగా ఉందని పేర్కొన్నారు. బయటకు వెళ్లేటప్పుడు ఫ్రిడ్జ్‌లో ఉన్న పండ్లు, బ్రెడ్డు, జామ్‌ మొత్తం తిని.. మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కెళ్లిపోయారని కరుణాకర్, రోజీమేరీ దంపతులు బోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు 
విషయం తెలిసిన వెంటనే పలువురు పోలీస్‌ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కర్నూలు ఇన్‌చార్జ్‌ డీఎస్పీ బాబా ఫకృద్దీన్, సీసీఎస్‌ డీఎస్పీ సూర్యనారాయణ, మూడో పట్టణ సీఐ రామకృష్ణారెడ్డి తదితరులు బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  క్లూస్‌టీమ్‌ సిబ్బందిని రప్పించి వేలిముద్రలను సేకరించారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. దొంగలంతా ముఖాలకు మాస్క్‌లు ధరించి ఉండటంతో గుర్తుపట్టడం సాధ్యపడలేదు. అయితే.. సీసీఎస్‌ పోలీసుల వద్ద ఉన్న పాత నేరస్తుల ఫొటోలతో సీసీ ఫుటేజీలో ఉన్న ఆధారాలతో సరిచూస్తున్నారు.  ప్రత్యేక బృందాలను నియమించి దొంగల కోసం గాలిస్తున్నారు. జాతీయ రహదారి మీదుగా ఉండే పోలీస్‌స్టేషన్ల అధికారులను అప్రమత్తం చేశారు. ఇటు బెంగళూరు వైపు, అటు హైదరాబాద్‌ వైపు, నంద్యాల జాతీయ రహదారిలో కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి వాహన తనిఖీలు నిర్వహించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement