ఓ ఇంట్లో దొంగలు బద్దలు కొట్టిన బీరువా
కర్నూలు: కర్నూలు మండలం గార్గేయపురంలో శనివారం రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని మరీ చోరీలకు తెగబడ్డారు. గ్రామానికి చెందిన సత్యనారాయణ ఇంటికి తాళం వేసి శబరిమల యాత్రకు వెళ్లాడు. దొంగలు ఇంటి తాళం పగులగొట్టి బంగారు గొలుసును తస్కరించారు. సమీపంలోని గాండ్ల వీరయ్య దుకాణంలో చోరీకి విఫలయత్నం చేశారు. శశిధర్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన మీ సేవ కేంద్రం తాళాలు పగులగొట్టి.. గదిలోకి ప్రవేశించి సామాన్లన్నీ చిందరవందర చేశారు. అక్కడ వారికి ఏమీ దొరకలేదు. మద్దిలేటి అనే గొర్రెల కాపరి ఇంట్లో బంగారు గొలుసు, రూ.30 వేల నగదుఅపహరించారు.
భార్య పుట్టింటికి వెళ్లగా.. మద్దిలేటి ఇంటికి తాళం వేసి గొర్రెల మంద దగ్గర కాపలాకు వెళ్లాడు. ఇదే అదనుగా దొంగలు బీభత్సం సృష్టించారు. పోస్టల్ ఉద్యోగి మల్లికార్జున కుటుంబంతో కలిసి గద్వాలలోని కూతురు ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి.. నెక్లెస్, రెండు ఉంగరాలు ఎత్తుకెళ్లారు. కురువ మాధవి ఇంటికి తాళం వేసి తల్లి సామక్క వద్దకు వెళ్లింది. ఉదయం ఇంటికి తిరిగొచ్చేసరికి తాళం కట్‌చేసి ఉంది. ఇంట్లో సామాన్లన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. జత బంగారు కమ్మలు, దుస్తులు, రూ.25 వేలు నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే శివ ఇంట్లో బ్రాస్‌లెట్, ఒక చైన్, రూ.3లక్షల నగదు మూటగట్టుకుని ఉడాయించారు. మరొకరి ఇంట్లోనూ చోరీకి పాల్పడ్డారు. బాధితులు ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాలూకా సీఐ ఓబులేసు తన సిబ్బందితో వెళ్లి చోరీ జరిగిన ఇళ్లన్నీ పరిశీలించారు.
అన్నీ తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేసినందున ప్రొఫెషనల్ దొంగల పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి ఆధారాలను సేకరించారు.
బిహార్ గ్యాంగ్‌గా అనుమానంకర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు నుంచి వెంకాయపల్లె వరకు బిహార్ ప్రాంతానికి చెందిన కొంతమంది రోడ్లకు ఇరువైపులా స్టీల్ సామాన్ల వ్యాపారం చేస్తూ కొంతకాలంగా స్థానికంగానే గుడారాలు వేసుకుని ఉంటున్నారు. వాళ్లలోని కొంతమంది ఈ చోరీలకు పాల్పడి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను కూడా సేకరించారు. చోరీ జరిగిన ఇళ్లన్నీ ప్రధాన రోడ్డుపక్కనే ఉండడంతో దొంగలు వాహనంలో వచ్చి, తాళాలను కట్టర్లతో కత్తిరించి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రత్యేకంగా రెండు బృందాలను రంగంలోకి దింపి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment