భీమవరం ప్రభుత్వాసుపత్రిలో ముఖ్యమంత్రి ఐ సెంటర్‌లో రెండు రోజుల క్రితం నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో ఐ కేంద్రాలను ఈ ఏడాది ఫ్రిబవరిలో ఏర్పాటు చేశారు. ఐ కేంద్రాల నిర్వహణను ప్రభుత్వం అపోలో సంస్థకు పీపీపీటి విధానంలో అప్పగించారు. ప్రారంభంలో కంటి పరీక్షలు నిర్వహించి కళ్లుజోడులను సకాలంలో అందించేవారు. రానురాను ఈ ఐ కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరించడంతో కంటి సమస్యలతో వచ్చే వారికి నేత్ర పరీక్షలు తప్ప కళ్ల జోళ్లు సకాలంలో పంపిణీ చేయలేకపోతున్నారు. దీంతో కళ్లజోళ్ల కోసం నేత్ర పరీక్షలు చేయించుకున్నవారు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. కళ్ల జోళ్లు 10 రోజుల్లో రావాలి. కాని నెలలు గడుస్తున్న రాకపోయేసరికి వారు ఇబ్బందులు పడుతున్నారు. బయట కళ్లజోళ్లు కొనుగోలు చేసుకోలేని పేదవారు ఉచితంగా కళ్లజోడు వస్తుందని కళ్లు కాయలు కాసేలా ఎదరుచూస్తున్నారు.
2 వేల కళ్లజోళ్లు అందించాలి
జిల్లాలోని భీమవరం, ఆకివీడు, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, అచంట, దెందులూరు, పోలవరం, భీమడోలు, కొవ్వూరు, చింతలపూడి, గోపాలపురం 12 ఆసుపత్రుల్లో ఈ ఐ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ 12 కేంద్రాలకూ రోజుకు 50 నుంచి 100 మంది వరకు కంటి చూపు సమస్యతో భాధడేవారు వచ్చి నేత్రల పరీక్షలు చేయించుకుంటారు.
ఈ కేంద్రాల్లో వారికి కంటికి సంబంధించి ఏఆర్, కంటిలోని నరాలకు సంబంధించిన పరీక్షలు కంప్యూటర్ ద్వారా చేస్తారు. ఐ సెంటర్‌లో టెక్నిషియన్ గాని లేదా నేత్ర పరీక్ష అధికారులు చేసిన పరీక్షల్లో కళ్లజోళ్లు అవసరం అయితే కళ్లజోడు కావాలని ఆన్‌లైన్‌లోనే సమాచారం అపోలో వారికి పంపిస్తారు. ఇలా గత మూడు నెలల్లో జిల్లా నుంచి సుమారు 2 వేల కళ్లజోళ్లు అందించాలి. అయితే ఇప్పటికీ కళ్లజోళ్లు రాలేదు. ఎప్పుడు అందిస్తారో తెలియని పరిస్థితి ఐ కేంద్రాల్లో ఉంది.
పనిచేయని కంప్యూటర్
భీమవరం ప్రభుత్వాసుపత్రిలోని ముఖ్యమంత్రి ఈ ఐ సెంటర్‌లో రెండు రోజులగా కంప్యూటర్ పనిచేయడం లేదు. దీంతో ఈ సెంటర్‌లో నేత్ర పరీక్షలు నిలిచిపోయాయి. కంటి పరీక్షల కోసం వచ్చిన వారు నిరాశగా తిరిగివెళ్లిపోతున్నారు.
కళ్లజోళ్ల పంపిణీకిచర్యలు తీసుకుంటున్నాం
జిల్లాలోని 12 ముఖ్యమంత్రి ఈఐ సెంటర్లలో పెడింగ్‌లో ఉన్న కళ్లజోళ్లు సుమారు 1500 వరకు ఉన్నాయి. వాటిని వెంటనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాము.
– డాక్టర్ కె.శంకరరావు,జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment